కరోనా ఎఫెక్ట్:కుప్పకూలిన స్టాక్ మర్కెట్స్..ఒక్కరోజే రూ.14 లక్షల కోట్లు మాయం!

Update: 2020-03-24 05:41 GMT
ఒక్కదేశంలో మొదలైన కరోనా వైరస్ ప్రపంచంపై వేగంగా జూలు విధిలించింది. చిన్నోడు పెద్దోడన్న తేడా లేదు.. పేదోడు డబ్బున్నోడన్న చిన్న చూపు లేదు.. అందరినీ చుట్టచుట్టేసింది. ఎక్కడికక్కడ అన్నింటినీ మూసేయించింది. ఎవరిని చూసినా మాస్కులు. ఎక్కడైనా హ్యాండ్ క్లీనింగ్ లు. దేశాల షట్ డౌన్లు. సిటీల లాక్ డౌన్లు.  బస్సులు - రైళ్ల హాల్టింగ్లు. షాపులు - మాల్స్ - స్కూల్స్ అన్నీ క్లోజ్. బోర్డర్ల ను బంద్ చేసేసింది. వ్యాపారాలను దెబ్బతీసింది. సామాన్యుడిని ఇంటికి పరిమితం చేసింది. ప్రపంచం మొత్తాన్ని స్తంభింపజేసింది.

లితంగా ఆయా రాష్ర్టాల్లో ప్రకటించిన లాక్‌డౌన్‌.. సోమవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లను కుప్పకూల్చింది. ఈ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక మాంద్యానికి దారితీస్తాయేమోనన్న భయాలు మదుపరులను వెంటాడాయి.  పెరిగిపోతున్న కేసులు - మరణాల మధ్య తీవ్ర అమ్మకాల ఒత్తిడి ఏర్పడింది. దీంతో సూచీలు మునుపెన్నడూ లేని నష్టాలను చవిచూశాయి. ఒకానొక దశలో ట్రేడింగ్‌ ను సైతం ఆపేశారు. అయినప్పటికీ సెన్సెక్స్‌ 3,900 పాయింట్లకు పైగా - నిఫ్టీ 1,100 పాయింట్లకుపైగా కోల్పోయాయి. ఈ ఒక్కరోజే మదుపరుల సంపద రూ.14 లక్షల కోట్లకు పైగా ఆవిరైపోయింది.

ఉదయం ఆరంభం నుంచే భారీ నష్టాల్లో మొదలైన సూచీలు.. కాసేపటికే 10 శాతానికిపైగా క్షీణించాయి. దీంతో మార్కెట్‌ నిబంధనల ప్రకారం ట్రేడింగ్‌ ను 45 నిమిషాల పాటు నిలిపివేశారు. అయినప్పటికీ పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు. 11 గంటల సమయంలో మళ్లీ మొదలైన మార్కెట్లు.. సమయం గడుస్తున్నకొద్దీ మరింతగా పతనమైయ్యాయి.

చివరకు మునుపెన్నడూ లేని నష్టాలు వాటిల్లగా - మూడేండ్లకు పైగా కనిష్ఠ స్థాయికి సూచీలు దిగజారాయి. బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ సెన్సెక్స్‌ 3,934.72 పాయింట్లు లేదా 13.15 శాతం పడిపోయి 25,981.24 వద్దకు చేరింది. ఒకానొక దశలో 25,880.83 పాయింట్ల వద్దకు పడిపోవడం గమనార్హం. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌  సూచీ నిఫ్టీ కూడా 1,135.20 పాయింట్లు లేదా 12.98 శాతం క్షీణించి 7,610.25 వద్ద నిలిచింది. కేవలం ఒక్కరోజులోనే ఈ స్థాయిలో నష్టాలు నమోదవడం ఇదే తొలిసారి.
Tags:    

Similar News