సెంచరీ దిశగా భారత్ లో కరోనా కేసులు

Update: 2020-03-15 06:55 GMT
ప్రపంచాన్ని చుట్టేసిన కరోనా.. భారత్ మీద తన పిడికిలి బిగిస్తుందా? అన్న సందేహాలు వ్యక్తమయ్యేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకూ దేశంలో కరోనా కారణంగా ముగ్గురు మరణిస్తే.. వారిలో ముగ్గురు పెద్ద వయస్కులే. ఇక.. ఇప్పటివరకూ కరోనా బారిన పడిన వారిలో తొమ్మిది మందికి పూర్తిగా నయమై.. డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు కొత్త కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

తాజాగా విడుదల చేసిన బులిటెన్ ప్రకారం భారత్ లో 93 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 76 మంది భారతీయులు కాగా.. మరో 17 మంది విదేశీయులుకావటం గమనార్హం. కరోనాకు గురైన విదేశీయుల్లో దాదాపుగా అందరూ హర్యానా(14 మంది)లో ఉండగా.. మరో ఇద్దరు రాజస్థాన్ లో.. ఇంకొకరు ఉత్తరప్రదేశ్ లో ఉన్నారు.

దేశీయంగా చూస్తే.. 76 మందిలో అత్యధికం కేరళకు చెందిన వారే కావటం గమనార్హం. ఆ రాష్ట్రంలో మొత్తం 22 మంది కరోనా బారిన పడినట్లుగా లెక్కలు తేలాయి. తర్వాతి స్థానంలో మహారాష్ట్ర నిలిచింది. ఈ రాష్ట్రంలో పాజిటివ్ కేసులు 19గా తేలాయి. ఉత్తరప్రదేశ్ లో పదకొండు కేసులు.. ఢిల్లీలో ఏడు కేసులు.. కర్ణాటకలో ఆరు.. లద్దాఖ్ లో మూడు.. జమ్ముకశ్మీర్.. రాజస్థాన్ లలో రెండేసి చొప్పున కేసులు పాజిటివ్ గా తేలాయి. తెలంగాణ.. తమిళనాడు.. పంజాబ్.. ఆంధ్రప్రదేశ్ లో ఒక్కొక్క కేసు పాజిటివ్ గా తేలింది.

భారత్ లో ఈ వైరస్ వ్యాప్తి రెండో దశలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైరస్ ను కట్టడి చేసేందుకు అవసరమైన అన్ని ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇదిలా ఉంటే.. ఇప్పటివరకూ దేశంలోని విమానాశ్రయాల్లో 12,29,363 మందిని స్క్రీన్ చేసినట్లుగా చెబుతున్నారు. వైరస్ కట్టడికి అవసరమైన మాస్కులు.. శానిటైజర్లను నిత్యవసర వస్తువులుగా గుర్తించారు. అధిక ధరలకు అమ్మితే వారిపై చర్యలు తీసుకుంటారు. అంతేకాదు.. వాటి తయారీని పెంచాలని సదరు సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు.


Tags:    

Similar News