24 గంటల్లో 27 మంది మృతి, 117కు చేరుకున్న భారత్ మరణాలు

Update: 2020-04-06 04:00 GMT
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. నిన్న (ఏప్రిల్ 5) ఒక్కరోజే మూడున్నర వేలమంది ఈ వైరస్ వల్ల మృత్యువాత పడ్డారు. అమెరికాలో అత్యధికంగా నేడు 874 మంది, స్పెయిన్‌లో 471, ఇటలీలో 525 మంది, యూకేలో 621 మంది చనిపోయారు. సోమవారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా 12,73,709 కేసులు నమోదు కాగా, 69,456 మంది మృత్యువాత పడ్డారు. మన దేశంలోను కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తబ్లిగీ కారణంగా దేశంలో వారం రోజులుగా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది.

ఈ రోజుకు భారత్‌లో కరోనా కేసులు 4,288కి చేరుకున్నాయి. మరణాలు 117కు పెరిగాయి. ఆదివారం నాడు మరణాలు భారీగా పెరిగాయి. 27 మరణాలు చోటు చేసుకున్నాయి. ఓ రోజు అత్యధిక మరణాలు చోటు చేసుకోవడం ఇదే ప్రథమం. ఇందులో మహారాష్ట్రలో 13 మరణాలు ఉన్నాయి.

దేశవ్యాప్తంగా నాలుగు రోజుల్లోనే కేసుల సంఖ్య రెండింతలకు పైగా పెరిగింది. ఏప్రిల్ నెలలో 2,000గా ఉన్న కేసులు ఆదివారానికి 4,300 సమీపానికి వచ్చాయి. తబ్లిగీ జమాత్ ఇష్యూ లేకుంటే కరోనా వ్యాప్తి సగటున 7.4 రోజుల్లో రెండింతలు అవుతూ వస్తోంది. కానీ తబ్లిగ్ జమాతే కారణంగా ఇది 4.1 రోజులకు తగ్గింది. అంటే గతంలో కంటే దాదాపు రెట్టింపు కేసులు పెరుగుతున్నాయి.

తెలంగాణలో రాత్రి వరకు కొత్త కేసులు 62 నమోదయ్యాయి. మొత్తం కేసులు 283కు చేరుకున్నాయి. డిశ్చార్జ్ అయిన కేసులు 32గా ఉన్నాయి. మృతుల సంఖ్య 11కు చేరుకుంది. హైదరాబాద్‌లో ఎక్కువగా 139 కేసులు ఉన్నాయి. ఆ తర్వాత వరంగల్ అర్బన్‌‌లో 23, అదిలాబాద్‌లో 10, మేడ్చల్‌లో 12, నల్గొండలో 13, రంగారెడ్డిలో 11 ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోను కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. శనివారం రాత్రి వరకు 192గా ఉన్న కేసులు ఆదివారం 60 పెరిగి 252కు చేరుకున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ కేసుల్లో ఎక్కువగా ఢిల్లీ మర్కజ్ ప్రార్థనకు వెళ్లి వచ్చినవారివి, వారి కుటుంబ సభ్యులవే ఉన్నాయి. రాష్ట్రంలో శనివారం రాత్రి 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 వరకు నమోదైన కరోనా పరీక్షల్లో కొత్తగా ఒంగోలు లో 2, చిత్తూరులో 7, కర్నూలు లో 23, నెల్లూరులో 2 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు నమోదైన పరీక్షల్లో కర్నూలు లో కొత్తగా 26 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 252కి పెరిగింది. కర్నూలులోనే కేసులు 53కు చేరుకున్నాయి.
Tags:    

Similar News