కరోనా దెబ్బకు మీడియాలో ఉద్యోగాలు ఉఫ్‌

Update: 2020-04-06 03:30 GMT
కరోనా వైరస్ కారణంగా ఉద్యోగులపై తీవ్ర ప్రభావం ఉంది. ఉన్నత ఉద్యోగుల నుంచి అడ్డా కూలీ వరకు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. కరోనా వైరస్‌ కట్టడి కోసం ప్రపంచదేశాలన్నీ లాక్‌ డౌన్‌ విధించాయి. ఈ క్రమంలో ఉద్యోగులను ఇళ్లకే పరిమితం చేశారు. అయితే కొందరు ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తుండగా.. అలాంటి అవకాశం లేని ఉద్యోగులంతా ఇంట్లోనే ఖాళీగా కూర్చున్నారు. ఇప్పుడు అదంతా ఎలా ఉన్నా ఎప్పుడు బిజీగా ఉండే.. నిరంతరం పని చేయాల్సిన రంగం మీడియా. అలాంటి మీడియా రంగంపై కూడా కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. ముఖ్యంగా పత్రికలకు గడ్డు కాలం వచ్చింది.

కరోనా వైరస్ వ్యాప్తి.. లాక్‌ డౌన్‌ కారణంగా ప్రింట్ మీడియా సంస్థలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. ఎందుకంటే వాటికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న వాణిజ్య ప్రకటనలు రావడం లేదు. లాక్‌ డౌన్‌ తో ఎలాంటి వ్యాపారాలు కొనసాగడం లేదు. దుకాణాలు - వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. ఈ సమయంలో పత్రికలకు ప్రకటనలు ఇచ్చే వారు కరువయ్యారు.  ప్రింట్ మీడియాకు ప్రధాన ఆదాయ మార్గంగా ఉన్న ప్రకటనలు ఆగిపోవడంతో ఆ సంస్థలు మనుగడ సాగించలేని పరిస్థితి. దీనికి తోడు కరోనా భయంతో పత్రికలు కూడా వేసుకోవడానికి పాఠకులు ఆసక్తి చూపడం లేదు. ప్రచురితమైన పత్రికలను ఇంటింటికి చేరవేయడంలో కూడా హ్యాకర్లు ఆసక్తి చూపడం లేదు. బయట వాతావరణం సక్రమంగా లేదు. పైగా ప్రచురితమైన పత్రికను పాఠకులు కొనుగోలు చేయడం లేదు.

ఈ నేపథ్యంలో ముద్రణ ఖర్చును భరించలేకపోతున్నాయి. దీంతో చాలా పత్రికలు జిల్లా టాబ్లాయిడ్లను సినిమా పేజీలను ఎత్తివేశాయి. పేజీలను తగ్గించేసి పత్రికను నాలుగైదు ప్రచురిస్తున్నారు. కొన్ని చిన్న సంస్థలు అయితే మూతపడ్డాయంట. దీంతో పాటు ఖర్చు తగ్గించుకునేందుకు మీడియా సంస్థలు తమ సిబ్బందిని తగ్గించుకోవాలని చూస్తున్నాయంట. ఈ మేరకు ఆయా యాజమాన్యాలు ఆలోచిస్తున్నాయంట. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన మీడియా సంస్థలుగా కొనసాగుతున్న వాటిల్లో కూడా సగం మంది సిబ్బందిని తొలగిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ముందే పత్రిక ముద్రణ ఖర్చు పెరిగిపోయింది.. పత్రికాదరణ తగ్గిపోతుంది. ఈ క్రమంలో సిబ్బందిని తొలగించేసి ఉన్న సిబ్బందితోనే పని చేయించుకోవాలనే ధోరణి కొనసాగుతోంది.

ఎటు తిరిగినా సంస్థకు చెందిన ఉద్యోగులు బలవుతూనే ఉన్నారు. ఇప్పుడు కరోనా ప్రభావంతో ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తే చిన్న స్థాయి ఉద్యోగులనే తొలగించే అవకాశం ఉంది. అదే గనుక జరిగితే పెద్ద ఎత్తున మీడియా సంస్థలోని ఉద్యోగులు రోడ్డుపై పడే ప్రమాదం ఉంది.


Tags:    

Similar News