ఇక ఎమర్జెన్సీ కేసులే విచారణ: సుప్రీం కోర్టుకు కరోనా వైరస్ దెబ్బ

Update: 2020-03-14 04:13 GMT
ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తికి భారత ప్రభుత్వం సహా ప్రపంచ దేశాలు చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా ప్రభావం భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుపై కూడా పడింది. అంతర్జాతీయంగా - భారతదేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుండి అత్యవసర కేసులు మాత్రమే విచారణకు స్వీకరిస్తామని శుక్రవారం నాడు సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

కరోనా వైరస్ తీవ్రత తగ్గే వరకు పరిమిత విధులు మాత్రమే నిర్వర్తించాలని నిర్ణయించింది. అత్యవసర కేసులు తప్ప మిగతా కేసులను ఈ మహమ్మారి ప్రభావం తగ్గిన తర్వాతే చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం సుప్రీం కోర్టు సెక్రటరీ జనరల్ నోటిఫికేషన్ విడుదల చేశారు. న్యాయస్థాన పరిధిలోని వైరస్ వ్యాప్తి చెందకుండా నిర్ణయాలు తీసుకున్నారు.

కోర్టు ప్రాంగణాలలో లాయర్లు, ప్రజలు గుమికూడవద్దని నిర్ణయించారు. కోర్టు గదిలోకి ఒక పిటిషన్ దారు, సంబంధిత లాయర్, ప్రతివాదిని మాత్రమే అనుమతిస్తారు. కాగా, ఇండియాలో 81 కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం రాత్రి కల్బురిగిలో 76 ఏళ్ల వృద్ధుడు కరోనా కారణంగా మృతి చెందిన విషయం తెలిసిందే.

కర్ణాటకలో ప్రభుత్వం వారం రోజుల పాటు షాపింగ్ మాల్స్, స్కూల్స్ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. గుంపులుగా ఉండరాదని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. హర్యానా - జమ్ము కాశ్మీర్ - ఢిల్లీ - మధ్యప్రదేశ్ - శ్రీనగర్ - కేరళ - కర్ణాటక - యూపీ - బీహార్ రాష్ట్రాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయి. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా 5వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. లక్షా 30వేల మందికి పైగా వైరస్ బాధితులు ఉన్నారు.


Tags:    

Similar News