కరోనా వైరస్ గురించి సెక్సాలజిస్ట్ డాక్టర్ సమరం ఏమన్నారో తెలుసా

Update: 2020-03-24 03:30 GMT
ప్రపంచాన్ని లాక్ డౌన్ చేసిన కరోనా వైరస్ ప్రకంపనలు సృష్టిస్తోంది. వైద్య - ఆసుపత్రి సదుపాయాలు అత్యున్నత స్థాయిలో ఉన్న యూరప్ దేశాలు కూడా ఈ విపత్తును ఎదుర్కోలేక విలవిలలాడుతున్నాయి. జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటికే 400కి పైగా పాజిటివ్ కేసులు నమోదైన భారత దేశంలో 19 రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. జనం కదలికలను పూర్తిగా అడ్డుకుంటే తప్ప ఈ వైరస్‌ ను అడ్డుకోలేమన్న ఉద్దేశంతోనే కేంద్రం సూచనతో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయి. దేశంలో తాజా పరిస్థితులపై ప్రముఖ సెక్సాలజిస్ట్ డాక్టర్ సమరం స్పందించారు. నిర్లక్ష్యం చేస్తే నష్టపోతామని, ప్రభుత్వాలు చెప్పే మాటను తూచా తప్పకుండా విని దీన్నుంచి బయటపడాలని ప్రజలకు సూచించారు.

కరోనా వైరస్ మూడో ప్రపంచ యుద్ధం కంటే ప్రమాదకరమని.. ప్రజలు నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోగొట్టుకుంటారని హెచ్చరించారు. మాస్కులు ధరించడం, చేతులు కడుక్కోవడం.. సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తే దీన్నుంచి బయటపడడానికి చాన్సుంటుందని చెప్పిన ఆయన మోదీ పిలుపు మేరకు చేపట్టిన జనతా కర్ఫ్యూ మంచి నిర్ణయమని.. అది సూపర్ సక్సెస్ అయిందని చెప్పారు.

ఈ కర్ఫ్యూ మరికొన్నాళ్లు కొనసాగితే కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చని సమరం చెప్పారు. కరోనా వైరస్ సెక్స్ ద్వారా వ్యాపించదని సమరం ఈ సందర్భంగాచెప్పారు. కాగా కరోనావైరస్ ఇప్పటికే 198 దేశాల్లో వ్యాపించింది. 3 లక్షల మందికిపైగా సోకింది. 14 వేలమందికి పైగా దీని బారినపడి మరణించారు. అత్యధికంగా ఇటలీలో 5 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. భారత్‌లో ఇంతవరకు 9 మంది మరణించారు.

   

Tags:    

Similar News