భార‌త్‌ లో ఒక్క‌రోజే 1,718 కేసులు - 67 మంది మృతి

Update: 2020-04-30 14:17 GMT
భారత్‌ లో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగానే ఉంది. క‌రోనా క‌ట్ట‌డి కోసం విధించిన లాక్‌ డౌన్ ఫ‌లితం ఉండ‌డం లేదు. లాక్‌ డౌన్ ముగింపున‌కు చేరువ‌వుతున్నా క‌రోనా విజృంభణ త‌గ్గుముఖం ప‌ట్ట‌లేదు. కేసులతో పాటు - మృతుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. గురువారం ఒక్క‌రోజే దేశవ్యాప్తంగా 1,718 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు న‌మోద‌య్యాయి. వాటితో క‌లిపి దేశంలో మొత్తం 33,050 కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ ‌అగర్వాల్ ప్ర‌క‌టించారు.

కేసులు ఆ విధంగా ఉండ‌గా మ‌ర‌ణాలు కూడా సంభ‌వించాయి. 24 గంటల్లో 67 మంది మృతి చెందారని వెల్ల‌డించారు. వాటితో క‌లిపి దేశంలో కరోనా మృతులు 1,074కు చేరారు. అయితే దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి శాతం 25.19గా పెరిగింద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కోలుకుంటున్న వారి సంఖ్య పెర‌గ‌డంతో భ‌విష్య‌త్‌ లో క‌రోనా ప్ర‌భావం త‌క్కువ ఉంటుంద‌ని అధికార వ‌ర్గాలు భావిస్తున్నాయి. దేశ‌వ్యాప్తంగా క‌రోనా బారిన ప‌డి కోలుకున్న‌వారు ఇప్పటి వరకు 8,324 మంది ఉన్నార‌ని కేంద్రం ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. దేశవ్యాప్తంగా కరోనా హాట్‌ స్పాట్‌ లను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టిన‌ట్లు  కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ ‌అగర్వాల్‌ తెలిపారు. వ‌ల‌స కూలీల‌కు స‌డ‌లింపులు ఇవ్వ‌డంతోపాటు నిత్యావ‌స‌ర స‌రుకుల ర‌వాణా కొన‌సాగుతుండ‌డంతో లారీ డ్రైవర్లకు స్క్రీనింగ్‌ చేయాలని రాష్ట్రాలను ఆదేశించిన‌ట్లు పేర్కొన్నారు.


Tags:    

Similar News