కరోనా కేసులు: తెలుగు రాష్ట్రాల్లో 68..దేశంలో 773

Update: 2020-04-08 17:26 GMT
ప్రస్తుతం సాయంత్రమైతే చాలు ప్రజలు ఒక ఫలితం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకే టీవీలతో పాటు సోషల్‌ మీడియాలో ఆ ఫలితాల వివరాలు తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు. అవే కరోనా పాజిటివ్‌ కేసులు. దేశంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఏనాడు ఊహించలేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ ఇంకా తగ్గుముఖం పట్టలేదు. ఈ వైరస్‌ సోకిన వారి సంఖ్యను ప్రతిరోజు సాయంత్రం కేంద్ర ప్రభుత్వం మీడియాకు వెల్లడిస్తోంది. కేంద్రంతో పాటు ఆయా రాష్ట్రాల్లో వైద్యారోగ్య శాఖ మంత్రి కానీ, సంబంధిత అధికారులు కానీ కరోనా వైరస్‌పై తాజా వివరాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం కూడా కరోనా వైరస్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ ప్రకటించారు. తాజాగా 24 గంటల్లో దేశవ్యాప్తంగా 773 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు తెలిపారు. దీంతో ఇప్పటివరకు దేశం మొత్తం 5,194 కరోనా కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. అయితే మృతుల సంఖ్య కూడా పెరిగిందని - ఒక రోజులో 32 మంది మృతిచెందారని పేర్కొన్నారు. వీటిని కలిపితే మొత్తం మృతులు 149 కి చేరాయి. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 402 మంది కరోనా సోకి కోలుకుని డిశ్చార్జయ్యారు.

ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు పెరిగాయి. ఒక్కరోజులో తెలంగాణలో 49 - ఆంధ్రప్రదేశ్‌ లో 19 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే రెండు రాష్ట్రాల్లో 68 వెలుగులోకి వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసులు 801. కరోనా కేసులు పెరుగుతుండడంతో తెలుగు ప్రాంతాల్లో పకడ్బందీగా లాక్‌ డౌన్‌ కొనసాగుతోంది.

తెలంగాణలో

తెలంగాణలో కొత్తగా 49 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రకటించారు. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం సాయంత్రం వరకు ఆ కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 453కి చేరుకున్నాయి. అయితే తాజా కేసులన్నీ మర్కజ్‌ తో సంబంధమున్నవేనని అధికారులు చెబుతున్నారు. కేసుల వారీగా పరిశీలించగా మొదటి స్థానంలో హైదరాబాద్‌ - తర్వాతి స్థానాల్లో గద్వాల - నిజామాబాద్‌ జిల్లాలు ఉన్నాయి. అయితే కరోనా సోకిన వారిలో 397 మంది హైదరాబాద్‌ లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని మంత్రి తెలిపారు. చికిత్స పొందుతున్న వారిలో ఎవరి పరిస్థితి ఆందోళనకరంగా లేదని స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 80 ప్రాంతాలు హాట్‌ స్పాట్‌ స్థలాలుగా గుర్తించారు. ఢిల్లీలోని తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి వెళ్లి వచ్చిన 1,100 మందికి పరీక్షలు నిర్వహించినట్లు మంత్రి వెల్లడించారు. అలా వెళ్లిన వారిని కలిసిన 3,158 మందిని గుర్తించి 167 క్వారంటైన్ కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు. ఇంకా 535 మందికి సంబంధించిన టెస్ట్ రిపోర్టులు రావాల్సి ఉందని మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు.

ఏపీలో కొత్తగా 19

ఆంధ్రప్రదేశ్‌ లో కొత్తగా 19 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో 19 కేసులు వెలుగులోకి వచ్చాయి. వాటిలో జిల్లాల వారీగా గుంటూరులో 8 - అనంతపురంలో 7 - ప్రకాశంలో 3 - పశ్చిమ గోదావరిలో ఒక కేసు నమోదైంది. అయితే కరోనా వైరస్‌ బారిన పడి చికిత్స పొంది కోలుకున్న వారిలో బుధవారం ముగ్గురు డిశ్చార్జయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 9 ఆరోగ్యంతో ఇంటికి చేరారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 348 కేసులు నమోదయ్యాయి.


Tags:    

Similar News