క‌రోనాకు కొత్త ఔష‌ధం హాంకాంగ్ విశ్వ‌విద్యాల‌యం సృష్టి

Update: 2020-05-10 11:09 GMT
ప్ర‌పంచాన్ని క‌కావిక‌లం చేస్తున్న క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు ప్ర‌పంచ దేశాలు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాయి. శ‌క్తికి మించి క‌రోనా మ‌హ‌మ్మారితో పోరాడుతున్నాయి. ఈ క్ర‌మంలో ఆ వైరస్ నివార‌ణ కోసం వ్యాక్సిన్‌ - టీకా - మందు త‌దిత‌ర వాటిని క‌నుగొనేందుకు తీవ్ర‌ ప్రయత్నాలు జ‌రుగుతున్నాయి. కొన్ని ప్ర‌యోగాలు తుది ద‌శ‌కు చేర‌గా.. మ‌రికొన్ని ప్ర‌యోగాలు - ప‌రీక్ష‌లు కొన‌సాగుతున్నాయి. ఈ స‌మ‌యంలోనే మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిశోధ‌న వెలుగులోకి వ‌చ్చింది. కొత్త ఔష‌ధాన్ని హాంకాంగ్ విశ్వ‌విద్యాల‌యం ప‌రిశోధ‌కులు క‌నుగొన్నారు. క‌రోనా నివార‌ణ‌కు మూడు వేర్వేరు యాంటీవైరల్‌ ఔషధాల కలయికతో చికిత్స అందించారు. ఆ చికిత్స‌తో స‌త్ఫ‌లితాలు వ‌స్తున్నాయ‌ని ఆ విశ్వ‌విద్యాల‌య పరిశోధకులు చెబుతున్నారు.

ఆ చికిత్స విధానంపై వారు చేసిన అధ్యయనం లాన్సెట్‌ జర్నల్‌ లో ప్రచురితమైంది. ఆ చికిత్స‌లో కొన్ని ర‌కాల ఔష‌ధాలు క‌లిపి చేశార‌ని ఆ జ‌ర్న‌ల్‌లో ఉంది. ఆ మూడు ర‌కాల మందు ఏవి అంటే.. హెచ్‌ ఐవీ చికిత్సకు ఉపయోగించే ‘లోపినావిర్‌-రిటోనావిర్‌’ - నోటి హైపటైటిస్ సీ ఔషధమైన ‘రైబవిరన్‌’ - కండరాల బలహీనత చికిత్స కోసం అభివృద్ధి చేసిన ‘ఇంటర్‌ ఫెరాన్‌ బీటా 1బీ’ని క‌లిపి చికిత్స అందిస్తున్న‌ట్లు ఆ జ‌ర్న‌ల్‌ లో ప‌రిశోధ‌కులు వివ‌రించారు.

హాంకాంగ్‌ లోని ఆరు ప్రభుత్వ ఆస్పత్రుల్లో 127 మంది క‌రోనా బాధితులకు ఆ ఔషధాలను విడతల వారీగా ఇచ్చారు. ఆ ఔష‌ధాలు ఇచ్చిన ఏడు రోజుల్లోనే క‌రోనా వైర‌స్ క‌నిపించ‌డం లేదు. క‌రోనా బాధితుల్లోని నాసికా రంధ్రాల్లో వైరస్ క‌నిపించ‌కుండాపోయింది. ఆ వైర‌స్ పోయిన త‌ర్వాత రెండు వారాల అనంత‌రం వారి ఆరోగ్యం మెరుగైందని జ‌ర్న‌ల్‌ లో హ్యాంకాంగ్ విశ్వ‌విద్యాల‌య ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.

ప్రాథ‌మిక స్థాయిలో క‌రోనా నివార‌ణ‌కు ఈ చికిత్స విధానం స‌త్ఫ‌లితాలు ఇచ్చింది. ఈ చికిత్స‌పై మ‌రికొన్ని ప‌రిశోధ‌న‌లు - ప‌రీక్ష‌లు కొన‌సాగుతున్నాయి. క‌రోనా ప్ర‌వేశించిన వెంట‌నే శరీరంలో వైరస్ తీవ్రంగా ఉంటుంది. అయితే క‌రోనా బాధితుల‌కు ఆస్పత్రిలో ప్ర‌స్తుతం అందిస్తున్న వైద్యంతో పోలిస్తే ఈ మిక్స్‌ డ్ ఔష‌ధంతో చికిత్స అందిస్తే అధిక ఫ‌లితం క‌నిపిస్తోంద‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. ఈ వైర‌స్‌ తో తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నవారిలో ఈ మిక్స్‌డ్ ఔషధంపై ప్రయోగాలు చేస్తున్నారు. ఫేజ్‌-3 క్లినికల్‌ ట్రయల్స్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు వారు వెల్ల‌డించారు.

Tags:    

Similar News