ఉక్రెయిన్ పై పుతిన్ యుద్ధం.. రష్యా పై 'కార్పొరేట్ల వార్' మామూలుగా లేదుగా?

Update: 2022-03-18 08:42 GMT
ఏదైనా వివాదం మీద కోర్టుకు వెళ్లినోడు.. ఏళ్లకు ఏళ్లుగా సాగే విచారణతో తీర్పు తర్వాత గెలిచినోడు ఇంటికి వెళ్లి ఏడిస్తే.. ఓడినోడు కోర్టు వద్దే ఏడుస్తాడట. కోర్టులో గెలిచినా.. ఓడినా ఏడవటం మాత్రం కామన్ గా కనిపిస్తుంటుంది. యుద్ధకాంక్ష తో రగిలిపోయే దేశాలు.. ఏదైనా దేశం మీద యుద్ధం చేసినంతనే సరిపోదు. యుద్దాన్ని ఎదుర్కొంటున్న దేశమే కాదు.. యుద్ధం చేసే దేశం కూడా అందుకు తగ్గ ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటుంది. అందుకు తాజాగా ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తున్న రష్యా పరిస్థితే ఇందుకు నిదర్శనంగా చెప్పాలి.

ఉక్రెయిన్ ను తన అదుపులో ఉంచుకోవటానికి పుతిన్ తెర తీసిన యుద్దం పెద్ద ఎత్తున మనుషుల ప్రాణాల్ని తీయటమే కాదు.. ఏళ్లకు ఏళ్లుగా నిర్మించుకున్న ఆస్తులన్నింటిని ధ్వంసం చేస్తోంది. ఇదంతా ఉక్రెయిన్ కు జరుగుతున్న నష్టం. కానీ.. యుద్దం చేస్తున్న రష్యాకు తీవ్రమైన షాకులు ఒకటి తర్వాత ఒకటి చొప్పున తగులుతున్నాయి. రష్యా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రపంచ దేశాలు ఆంక్షల్ని అమలు చేస్తుండటంతో రష్యా ఆర్థిక పరిస్థితి మహా దారుణంగా మారింది.

సింఫుల్ లెక్క చెప్పాలంటే ఉక్రెయిన్ తో యుద్దానికి ముందు ఆ దేశంలో 100-120 రూబుళ్లకు(రష్యా కరెన్సీని రూబుళ్లగా పేర్కొంటారు. మన రూపాయికి రష్యా రూబుల్ రూ.1.36 చొప్పున వస్తుంది. కొన్ని నెలల క్రితం చూస్తే రూపాయితో పోలిస్తే ఇప్పుడున్న దాని కంటే ఎక్కువగా రూబుల్ విలువ ఉండేది) బ్రెడ్ పాకెట్ లభించేది. అది కాస్తా ఇప్పుడు 250 రూబుళ్లకు పెరిగింది. ఇదొక్కటే కాదు.. ఆహార వస్తువుల ధరలు భారీగా పెరిగిపోయాయి. ఉక్రెయిన్ తో యుద్ధం మొదలు పెట్టిన నాటి నుంచి రష్యాలో వస్తువుల ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

వస్తువుల ధరలు పెరగటం ఒక ఎత్తు అయితే.. అమెరికా సంస్థలైన మాస్టర్ కార్డు.. వీసా లాంటి సంస్థలు తమ సేవల్ని రష్యాలో నిలిపివేయటంతో.. రష్యన్ల క్రెడిట్.. డెబిట్ కార్డులు పని చేయని పరిస్థితి. దీంతో.. బ్యాంకు ఖాతాల్లో డబ్బులు ఉన్నప్పటికీ.. వాటిని తీసుకోలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితి తాము ఎప్పుడూ చూడలేదని వాపోతున్నారు.

అంతేకాదు..రష్యా వ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ రెస్టారెంట్లు.. ఫుడ్ చైన్ సంస్థలు తమ సేవల్ని రష్యాలో నిలిపివేశాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పెప్సికో.. స్టార్ బక్స్.. కార్ల్స్ బర్గ్.. బడ్ వర్.. బర్గర్ కింగ్.. మెక్ డొనాల్డ్స్ లాంటి సంస్థలు తమ సేవల్ని నిలిపివేశాయి. దీంతో.. రష్యన్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాదు.. కార్ల కంపెనీలు సైతం తమ సేవల్ని నిలిపివేశారు.

ప్రపంచ దేశాలకు చెందిన ప్రముఖ కార్ల కంపెనీలైన టయోటా.. మెర్సిడెజ్ బెంజ్.. ఫోకస్ వ్యాగన్.. వోల్వో.. ఫోర్డ్.. హార్లేడేవిడ్ సన్.. రెనో లాంటి కంపెనీలు తమ సేవల్ని రష్యాలో నిలివేశాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. రష్యన్ల చేతిలో ఉన్నకొన్ని కంపెనీలు ఫోన్లు సైతం పని చేయటం మానేశాయి. యాపిల్.. శాంసంగ్.. డెల్ టెక్నాలజీస్.. గూగుల్.. టిక్ టాక్.. ఏటీ అండ్ టీ లాంటివి సేవల్ని బంద్ చేయటంతో.. వాటిని ఉపయోగించుకునే వీల్లేని పరిస్థితి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. వినోద రంగానికి చెందిన సంస్థలు సైతం తమ సేవల్ని బంద్ చేసి.. రష్యా మీద ఒత్తిడిని అంతకంతకూ పెంచుతున్నాయి. వార్నర్ బ్రదర్స్.. వాల్ట్ డిస్నీ.. సోనీ పిక్చర్స్.. నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలు సైతం తమ సేవల్ని నిలిపేశాయి. ఇలా ఒకటి తర్వాత ఒకటి చొప్పున చోటు చేసుకుంటున్నపరిణామాలతో రష్యన్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రష్యా చేస్తున్న యుద్దంతో ఉక్రెయిన్లు కకావికలమవుతుంటే.. అందుకు ప్రతిగా రష్యాలో కార్పొరేట్ సంస్థలు ప్రకటించిన వార్ తో.. రష్యన్లు గతంలో ఎప్పుడూ ఎదుర్కోని తీవ్ర సమస్యల్ని ఎదుర్కొంటున్నారు.

అంతేకాదు.. రష్యాలోని పలు యూనివర్సిటీల్లో పని చేసే విదేశీయులు తమ దేశాలకు వెళ్లిపోయారు. మరికొందరు రష్యాలో నెలకొన్న అనిశ్చితికి భయపడిపోయి దేశాన్ని విడిచి పెట్టి వెళ్లిపోవాలనుకుంటున్నారు. ఇక.. ఉద్యోగులకు వచ్చే జీతాలపై పలు సందేహాలు ఉన్నాయి. ఇప్పటికే పలు సంస్థలు తమ పెట్టుబడులు నిలిపివేస్తే.. మరికొన్ని విదేశీ సంస్థలు రష్యాలో తమకు వచ్చిన లాభాల్ని తీసుకెళ్లి ఉక్రెయిన్లకు ఖర్చు చేస్తామని ప్రకటించి..అదే పని చేస్తున్నారు. ఇలా.. రష్యా చేస్తున్న యుద్దంతో ఉక్రెయిన్లు ఒకలా.. రష్యన్లు మరోలా అవస్థలు పడుతున్నారు. మొత్తంగా ఇరు దేశాల్లోనూ ప్రజలకు అవస్థలు తప్పని పరిస్థితి.
Tags:    

Similar News