కరోనా టీకాల కోసం మోడీ సర్కారు పెట్టిన ఖర్చు లెక్క వచ్చేసింది

Update: 2021-12-24 04:25 GMT
కరోనాకు చెక్ పెట్టే వ్యాక్సిన్ ను దేశ ప్రజలందరికి వేసే బాధ్యతను కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకున్న సంగతి తెలిసిందే. మొదట్లో కేంద్రం కొంత.. రాష్ట్ర ప్రభుత్వాలు మరికొంత వాటాతో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని భావించారు. అయితే.. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కేంద్రం సొంతంగా నిర్వహించలేదా? అన్న విమర్శలతో పాటు.. టీకా కార్యక్రమంలో జరుగుతున్న పరిణామాల్ని చూసిన మోడీ సర్కారు.. తన పాలసీని మార్చుకోవటం.. దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఖర్చు మొత్తం కేంద్రమే భరిస్తుందని అప్పట్లో మోడీ సర్కారు వెల్లడించింది.

ఇందుకు తగ్గట్లే.. ఈ వార్షిక బడ్జెట్ లో వ్యాక్సినేషన్ కార్యక్రమం కోసం కేంద్ర బడ్జెట్ లో రూ.35 వేల కోట్లను కేటాయించింది. మరి.. ఇప్పటివరకు కేంద్రం చేసిన వ్యాక్సినేషన్ ఖర్చు ఎంత? అన్న విషయంపై ఎలాంటి అధికారిక సమాచారం అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో సమాచార హక్కు కార్యకర్త అమిత్ గుప్తా ముందుకు వచ్చారు. ఆర్టీఐ ద్వారా అప్లికేషన్ పెట్టారు. ఈ నేపథ్యంలో టీకాల కోసం మోడీ సర్కారు ఎంత ఖర్చుచేసిందన్న విషయాలపై సమాచారం అందింది.

తాజాగా కేంద్రం ఇచ్చిన సమాచారం ప్రకారం ఇప్పటివరకు కరోనా వ్యాక్సిన్ కోసం రూ.19,675 కోట్లు ఖర్చు చేసినట్లుగా పేర్కొన్నారు. టీకా కార్యక్రమం కోసం మోడీ ప్రభుత్వం 2021-22 బడ్జెట్ లో మొత్తం రూ.35 వేల కోట్లు కేటాయించినా.. అందులో సగం కంటే కాస్త ఎక్కువ మాత్రమే ఖర్చు చేసినట్లుగా చెప్పాలి. మే ఒకటి నుంచి డిసెంబరు 20 వరకు 117.56 కోట్ల డోసుల్ని అందించారు.

మరో 4.18 కోట్ల టీకా డోసుల్ని ప్రైవేటు కొవిడ్ వ్యాక్సినేషన్ ద్వారా ప్రజలకు అందాయి. ఇదిలా ఉంటే.. కొవిడ్ పోర్టల్ ప్రాకరం ఈ ఏడాది జనవరి 16 నుంచి ఇప్పటివరకు దేశంలో 140 కోట్లకు పైగా టీకా డోసులు వేశారని.. 56.7 శాతం మందికి టీకా పంపిణీ చేసినట్లుగా పేర్కొన్నారు. మరి మూడు నెలల వ్యవధిలో టీకా డోసుల కోసం కేటాయించిన మొత్తాన్ని పూర్తి చేస్తారా? మిగులుస్తారా? అన్నదిప్పుడు ప్రశ్నగా చెప్పాలి.


Tags:    

Similar News