భారతీయుల దగ్గర అన్ని వేల టన్నుల బంగారముందా?

Update: 2021-08-24 16:30 GMT
ప్రపంచంలో అత్యంత విలువైన ఖనిజం బంగారం. ప్రతీ దేశం కూడా బంగారు నిల్వలను కలిగి ఉన్నప్పటికీ...ఆర్థిక స్థిరత్వం కోసం పసిడి నిల్వలను సేకరిస్తుంటాయి. ప్రపంచంలోని ప్రతి దేశ ప్రభుత్వం దగ్గర ఎంత బంగారం నిల్వగా ఉంది అన్న విషయాన్ని ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యుజిసి) లెక్కించి నివేదికలిస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా వెల్లడైన నివేదికలో మనదేశం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచంలో ప్రైవేట్ స్టాక్ రూపంలో అత్యధిక బంగారం కలిగిన దేశంగా భారత్ అవతరించింది.

భారతీయ కుటుంబాల దగ్గర దాదాపు 25 వేల టన్నుల బంగారం ఉంటుందని అంచనా. ఆభరణాలు, గోల్డ్ బిస్కెట్లు, బంగారు నాణేలు..ఇలా వివిధ రూపాల్లో బంగారం మొత్తం కలిపితే దాదాపు 25 వేల టన్నులుంటుందని డబ్ల్యుజిసి అంచనా వేసింది. అంటే, దాదాపు రూ.110 లక్షల కోట్ల విలువైన బంగారం నిల్వలు మనోళ్ల దగ్గరున్నాయని అంచనా. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను మన దేశ జీడీపీలో ఇది దాదాపు 48 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను మన దేశ జీడీపీలో అది 40 శాతంగా ఉండగా...తాజాగా అది 48 శాతానికి చేరుకోబోతోందని అంచనా వేస్తున్నారు. ఓ వైపు కరోనా దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతమవుతున్నా...మన దేశం కొద్దిగా నిలదొక్కుకోవడానికి ఈ బంగారం నిల్వలే కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బంగారం కమోడిటీగా మారిన తర్వాత ఇటు మదుపరులకు, అటు ప్రభుత్వ నిధులకు, దేశ ఎకానమీకి బంగారం కీలకంగా మారిందని అంటున్నారు.

మరోవైపు, బంగారం డిపాజిట్ చేసి లాభాలు పొందేందుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా 'గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్' అందిస్తోన్న సంగతి తెలిసిందే. కనీసం 10 గ్రాముల బంగారం దగ్గరి నుంచి ఇష్టం వచ్చినంత బంగారాన్ని ఈ స్కీమ్ లో పెట్టుబడిగా పెట్టవచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ఏడాది నుంచి 15 ఏళ్ల కాల పరిమితితో గోల్డ్ డిపాజిట్ చేసే అవకాశముంది. 0.5 శాతం నుంచి 2.5 శాతం వరకు వడ్డీ లభిస్తోంది.
Tags:    

Similar News