నాగ‌వైష్ణ‌వికి న్యాయం జ‌రిగింది

Update: 2018-06-14 10:40 GMT
ఏ త‌ప్పు చేయ‌ని ఒక ఎనిమిదేళ్ల‌ చిన్నారిని రెండ్రోజులు న‌ర‌క‌యాత‌న పెట్టి చంపేస్తే మీరు త‌ట్టుకోగ‌ల‌రా? అస‌లు విన‌డానికే ఒళ్లు జ‌ల‌ద‌రిస్తుంది. అస‌లు న‌వ్వులు కురిపించే చిన్నారిని చంప‌డానికి ఎవ‌రికి మాత్రం చేతులు వ‌స్తాయి. కానీ కేవ‌లం ఆస్తి కోసం క‌సాయి మ‌నుషులు ఈ అకృత్యానికి పాల్ప‌డ్డారు. 2010లో ఈ ఘోరం జ‌రిగింది. అప్పుడే కాదు, ఇప్ప‌టికీ ఈ హ‌త్య ఓ సంచ‌ల‌న‌మే. ఈ హత్య అనేక మ‌ర‌ణాల‌కు దారితీసింది.  దీంతో నిందితుల‌కు బెయిల్ కూడా ద‌క్క‌లేదు. ఇన్నాళ్ల‌కు విచార‌ణ పూర్త‌యి ముగ్గురు నిందితుల‌కు యావ‌జ్జీవ కారాగార శిక్ష ప‌డింది.

ఎవ‌రీ చిన్నారి?
 
విజయవాడకు చెందిన బీసీ నాయకుడు పలగాని ప్రభాకర్ తొలుత అక్క కూతురిని పెళ్లాడారు. వారికి ఆరుగురు సంతానం క‌లిగినా విక‌ల‌త్వంతో అంద‌రూ చ‌నిపోయారు. దీంతో ఆయన చాలా కుంగిపోయారు. బంధువుల ఒత్తిడి మేర‌కు చివ‌ర‌కు న‌ర్మ‌దాదేవి అనే యువ‌తిని రెండో పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్ద‌రు ఇద్ద‌రు కొడుకులు - కూతురు (హ‌త్య‌కు గుర‌యిన నాగ‌వైష్ణ‌వి) ఉన్నారు. ప్ర‌భాక‌ర్ కూతురిపై అమిత‌మైన ప్రేమ‌తో అన్ని ఆస్తులు ఆ చిన్నారి పేరుపైనే కొన్నారు. ఇది ఆ చిన్నారికి మ‌ర‌ణ శాసనం అయ్యింది. మొద‌టి భార్య - ఆమె సోద‌రుడు ఇక మాకు ఆస్తులు దక్క‌వు అని ప‌థ‌కం ప‌న్ని ఆ చిన్నారి హ‌త్య‌కు ప్లాన్ వేశారు.

కుమార్తె నాగవైష్ణవి - సోద‌రుడితో క‌లిసి 2010 జనవరి 30న కారులో పాఠశాలకు వెళుతుండగా నిందితులు అడ్డగించారు.  డ్రైవరును చంపి వైష్ణవిని కిడ్నాప్ చేశారు. అనంత‌రం గొంతు నులిమి ఆ చిన్నారిని చంపిన నిందితులు ఆధారాలు దొర‌క్కుండా బ్లాస్ట్ ఫ‌ర్నేస్ మిష‌న్లో వేసి కాల్చి బూడ‌ద చేశారు. రెండు రోజుల పాటు తీవ్ర గాలింపుల అనంతరం - గుంటూరు శివార్లలోని ఆటోనగర్‌ లోని ప్లాట్ నెంబరు 445లో చిన్నారి ధ‌రించిన చెవిపోగు లభ్యమైంది.  ఈ వార్త విన్న వెంట‌నే తండ్రి ప్ర‌భాక‌ర్ గుండెపోటుతో మ‌ర‌ణించారు. అనంత‌రం షాక్ గురైన త‌ల్లికి బ్రెయిన్ క్యాన్స‌ర్ అటాక్ అయ్యింది. ఆమె కూడా కేసు కోసం పోరాడుతూ గ‌త ఏడాది మ‌ర‌ణించింది. ఆమెకు స‌హ‌క‌రిస్తూ వ‌చ్చిన ప్ర‌భాక‌ర్ త‌మ్ముడు సుధాక‌ర్ కూడా గ‌త ఏడాది మ‌ర‌ణించాడు. మొత్తం పాప త‌ల్లిదండ్రులు - బాబాయి న్యాయం జ‌ర‌గ‌లేద‌నే బాధ‌తోనే మ‌ర‌ణించిన‌ట్ల‌య్యింది.

ఇపుడు ఈ కేసులో ఏ1 నిందితుడిగా మెర్ల శ్రీనివాసరావు - ఏ2గా వెంపరాల జగదీష్ - ఏ3గా పంది వెంకట్రావు అలియాస్‌ కృష్ణ ఏడేళ్లుగా జైలులో రిమాండ్‌ లోనే ఉన్నారు. వారిపై ఐపీసీ 302 - 367 - 420 - 201 - 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చార్జిషీట్‌ దాఖలు చేశారు. ఇన్నాళ్ల‌కు విచార‌ణ పూర్త‌య్యి వారికి శిక్ష ప‌డింది. కానీ... ఈ వార్త వినాల్సిన అస‌లు వ్య‌క్తులు ఈ భూమ్మీద లేక‌పోవ‌డం శోచ‌నీయం.
Tags:    

Similar News