ఇండియన్స్ కి శుభవార్త ... కొవాగ్జిన్‌ను గుర్తించిన బ్రిటన్

Update: 2021-11-23 06:30 GMT
ఇంగ్లండ్ వెళ్లానుకునే భారతీయులకు ఆ దేశ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. భారతదేశ తయారీ వ్యాక్సిన్ ‘కొవాగ్జిన్’ను గుర్తించింది. ఫలితంగా ఈ టీకా తీసుకున్న వారు ఇకపై ఎలాంటి ఆంక్షలు లేకుండా బ్రిటన్ వెళ్లి రావొచ్చు. తాము అధికారికంగా గుర్తించిన టీకాల జాబితాలో కొవాగ్జిన్‌ను కూడా చేర్చినట్టు తాజాగా బోరిస్ జాన్సన్ ప్రభుత్వం ప్రకటించింది.

ఈ నెల 22 నుంచి కొవాగ్జిన్‌ తీసుకున్న వారు బ్రిటన్‌ కు వచ్చిన తర్వాత ఐసోలేషన్‌ ఉండాల్సిన అవసరం లేదని తెలిపింది. కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ ను భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసింది. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అత్యవసర వినియోగ జాబితాలో కొవాగ్జిన్‌ ను చేర్చింది.

బ్రిటన్ తాజా నిర్ణయంతో కొవాగ్జిన్ రెండు డోసులు తీసుకున్నవారు ప్రయాణానికి ముందు కరోనా నిర్ధారణ పీసీఆర్ టెస్టు చేయంచుకోకుండానే ఫ్లైట్ ఎక్కేయొచ్చు. అయితే, బ్రిటన్ చేరుకున్నాక మాత్రం రెండు రోజుల్లోపు పీసీఆర్/లాటరల్ ఫ్లో టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేసిన టీకాలన్నింటికీ తాము గుర్తింపునిచ్చినట్టు బ్రిటన్ రవాణాశాఖ తెలిపింది. ఫలితంగా కొవాగ్జిన్, సినోవాక్, సినోఫార్మ్‌ కు అనుమతి లభించింది. బ్రిటన్‌ ప్రభుత్వం ఇప్పటికే కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను గుర్తించింది.

తాజాగా కొవాగ్జిన్‌ గుర్తిస్తున్న విషయాన్ని ధ్రువీకరిస్తూ బ్రిటిష్‌ హైకమిషనర్‌ అలెక్స్‌ ఎలిస్‌ ట్వీట్‌ చేశారు. యూకేకు వచ్చే భారత ప్రయాణికులకు మరో గుడ్‌న్యూస్‌.

నవంబరు 22వ తేదీ నుండి కొవాగ్జిన్‌ తో సహా ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర వినియోగానికి గుర్తించిన టీకాలు వేసుకొని ఇక్కడికి చేరుకున్నాక ఐసొలేషన్‌ లో ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ కొత్త రూల్స్‌ నవంబర్ 22 తేదీ తెల్లవారుజామున 4 గంటల నుండి అమల్లోకి రానున్నాయి. కొవాగ్జిన్‌ తోపాటు చైనాకు చెందిన సినోవాక్, సినోఫార్మ్‌లనూ బ్రిటన్‌ ప్రభుత్వం గుర్తించింది.




Tags:    

Similar News