కొవాగ్జిన్ సీక్రెట్ రివీల్.. కోట్లాది మందిని సేవ్ చేసిన 20 కోతులు

Update: 2021-11-15 04:13 GMT
ఒక ఔషధాన్ని తయారు చేయటం వెనుక ఉండే కష్టం అంతా ఇంతా కాదు. దాని కోసం పడే ప్రయాస పెద్దగా బయటకు రాదు. ఇవాల్టి రోజున దేశీయంగా తయారు చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ కు సంబంధించి.. తెర వెనుక పడిన కష్టం.. దాని కోసం చేసిన ప్రయత్నాలు.. ఎదుర్కొన్న సవాళ్లు ఎవరికి తెలియవు. భారత్ బయోటెక్ కొవాగ్జిన్ వ్యాక్సిన్ సిద్ధం చేస్తున్నట్లుగా తెలుసే కానీ.. దాని కోసం చేసే ప్రయత్నాలు ఎంతన్నది చాలామందికి తెలీదు.

అయితే.. ఈ టీకా తయారీలో మానవ మేధస్సుతో పాటు.. 20 కోతులు చేసిన సాయం అంతా ఇంతా కాదని చెబుతున్నారు. అందుకు సంబంధించిన ఆసక్తికర అంశాలు తాజాగా వెలుగు చూశాయి. కోవాగ్జిన్ జర్నీపై భారతీయ వైద్య పరిశోధన మండలి డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ కొత్త విషయాల్ని వెల్లడించారు. ఆయన రాసిన ‘‘గోయింగ్ వైరల్.. మేకింగ్ ఆఫ్ కొవాగ్జిన ఇన్ సైడ్ స్టోరీ’’ పేరుతో రాసిన పుస్తకంలో ఇప్పటివరకు బయటకు రాని ఎన్నో కొత్త విషయాల్ని వెల్లడించారు.

కొవాగ్జిన్ విజయం వెనుక మనుషులే కాదని.. 20 కోతులు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. వాటిని పట్టుకోవటానికి పడిన పాట్లు అన్ని ఇన్ని కావన్న ఆయన.. తామేం చేశాం? కోతులు ఏం చేశాయి? వాటిని వెతికేందుకు చేసిన ప్రయత్నాల్ని ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు. తన తాజా పుస్తకంలో ఆయన పేర్కొన్న అంశాల్ని చూస్తే..

 రామాయణంలో లంకను చేరటానికి రాముడికి కోతులే సాయం చేశాయి. ఈ రోజున తయారైన స్వదేశీ వ్యాక్సిన్ ‘కొవాగ్జిన్’ తయారీలో భారత శాస్త్రవేత్తలకు కొండంత సాయాన్ని చేసింది కోతులే. అవే లేకపోతే ఈ రోజున లక్షలాది ప్రాణాలు నిలిచేవి కావు. కొవాగ్జిన్ తయారీకి సంబంధించి రీసస్ జాతికి చెందిన 20 కోతుల్ని గుర్తించి.. వాటితో వ్యాక్సిన్ తయారు చేశారు. వాటిని ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. రీసస్ జాతికి చెందిన కోతుల్ని పట్టుకోవటానికి శాస్త్రవేత్తలు పడిన పాట్లు అన్ని ఇన్ని కావు.

వ్యాక్సిన్ చిన్న జంతువుల్లో యాంటీబాడీస్ ఉత్పత్తి చేస్తుందన్న విషయం తెలిసిన తర్వాత.. తర్వాతి దశ కోతుల వంటి పెద్ద జంతువులపై పరీక్షలు జరుపుతారు. వాటి శరీర నిర్మాణం.. రోగ నిరోధక వ్యవస్థ మొత్తం మనుషులకు దగ్గరగా ఉంటుంది.ప్రపంచ వ్యాప్తంగా వైద్య పరిశోధనల్లో రీసస్ కోతుల్నే ఉపయోగిస్తారు. వీటిని చైనా నుంచి చాలా దేశాలు దిగుమతి చేసుకుంటాయి. కొవిడ్ వేళ చోటు చేసుకున్న పరిణామాలు.. లాక్ డౌన్ కారణంగా ఆ దిగుమతులు ఆగిపోయాయి.

దీంతో కోతుల్ని ఎక్కడి నుంచి తీసుకురావాలన్నది పెద్ద సమస్యగా మారింది. దీంతో భారత శాస్త్రవేత్తలు నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పరిశోధకులు దేశంలోని జంతు ప్రదర్శన శాలలు.. వివిధ సంస్థల్ని సంప్రదించారు. అయినా.. వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఈ పరీక్షల కోసం యంగ్ గా ఉండే కోతులు.. ఎక్కువ రోగ నిరోధక శక్తి ఉన్నవే కావాలి తప్పించి పెద్ద వయసులో ఉన్నవి.. బలహీనంగా ఉన్నవాటితో సాధ్యం కాదు.

దీంతో.. ఈ కోతుల కోసం అన్వేషణ భారీ ఎత్తున సాగింది. కరోనా నేపథ్యంలో గ్రామాల్లో చోటుచేసుకున్న పరిణామాలతో ఆహారం దొరక్క కోతులు అడవుల్లోకి వెళ్లిపోయాయి. దీంతో వీటిని పట్టుకోవటం కోసం మహారాష్ట్ర అటవీ విభాగం వేలాది కిలోమీటర్లను గాలించారు. ఇందుకోసం పడిన పాట్లు అన్ని ఇన్ని కావు. చివరకు నాగపూర్ వద్ద రీసస్ కోతుల్ని గుర్తించారు.

వీటిని గుర్తించిన తర్వాత శాస్త్రవేత్తలకు ఎదురైన మరో సవాలు.. ఈ కోతులకు మనుషుల నుంచి కొవిడ్ 19 వైరస్ సోకకుండా రక్షించటం. ఇందుకోసం కోతుల సంరక్షకులు.. పశువైద్యులు.. పారిశుద్ధ్య సిబ్బందికి తరచూ కొవిడ్ పరీక్షలు జరుపుతూ జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. ఇలా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని.. వాటిపై పరీక్షలు జరిపిన అనంతరం కథ సుఖాంతమైంది. ప్రయోగాలు సక్సెస్ అయ్యాయి. కొవాగ్జిన్ ప్రయాణం కంచికి చేరింది. ఈ జర్నీలో ఆ ఇరవై కోతులు పోషించిన పాత్ర ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

ఈ రోజున కోట్లాది మంది కొవిడ్ మహమ్మారి నుంచి రక్షణ పొందుతున్నారంటే.. అందుకు ఆ 20 కోతులు చేసిన సాయమే అవుతుంది. ఆ కోతులు మనుషులకు చేసిన ఉపకారానికి మనిషి ఆ విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రకృతిలో అందరూ ఉండాలి. ఒకరికి ఒకరు సాయం చేసుకోవాలన్న ధర్మాన్ని మనిషి ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది. తోపుగా చెప్పే మనిషికి కష్టం వచ్చినప్పుడు సాటి మనిషి కంటే కూడా.. కోతులే అక్కరకు రావటం.. వాటి సాయంతో మనం ఈ కష్టం నుంచి బయటపడటాన్ని అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.
Tags:    

Similar News