బ్రెజిల్‌ తో కోవాగ్జిన్ టీకా సప్లై ఒప్పందం రద్దు .. ఏమైందంటే ?

Update: 2021-07-24 03:29 GMT
భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ దేశంలో కరోనా మహమ్మారి కట్టడికి దోహదపడుతోంది. అయితే , తాజాగా భారత్ బయోటెక్ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో భారత్ బయోటెక్ బ్రెజిల్‌ ఫార్మా కంపెనీలతో ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. కోవాగ్జిన్ సప్లై కోసం జరిగిన 324 మిలియన్ డాలర్ల ఒప్పందంలో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో డీల్ నుంచి భారత్ బయోటెక్ వెనక్కి తగ్గింది. ఈ కారణంగా బ్రెజిల్‌ కు సప్లై చేయాల్సిన 20 మిలియన్ డోసుల కోవాగ్జిన్ వ్యాక్సిన్లకి బ్రేక్ పడినట్లయింది.

బ్రెజిల్‌ కు చెందిన ప్రెసికా మెడికమెంటోస్, ఎన్విక్సియా ఫార్మాసూటికల్స్ కంపెనీలతో భారత్ బయోటెక్ గతేడాది నవంబర్‌ లో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ ఒప్పందంలో బ్రెజిల్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందన్న ఆరోపణలు వచ్చాయి. బ్రెజిల్‌ లో కోవాగ్జిన్ గేట్ గా వ్యవహరిస్తున్న ఈ వివాదం పై బ్రెజిల్ ఫెడరల్ ప్రాసిక్యూటర్స్‌ దర్యాప్తు కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలోనే భారత్ బయోటెక్ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. మొదట బ్రెజిల్ ఆరోగ్యశాఖ మంత్రి రికార్డో మిరందా చేసిన వ్యాఖ్యలతో ఈ అవినీతి ఆరోపణలు వెలుగుచూశాయి. వ్యాక్సిన్ల కొనుగోలుకు సంబంధించి సందేహాస్పదమైన ఇన్‌ వాయిస్‌ ను క్లియర్ చేయాల్సిందిగా తనపై పైనుంచి ఒత్తిడి తీసుకొచ్చారని మిరందా ఆరోపణలు చేశారు.

దీనితో ఈ వ్యవహారంలో బ్రెజిల్ ఫెడరల్ ప్రాసిక్యూటర్స్‌ జోక్యం చేసుకున్నారు.మరోవైపు బ్రెజిల్ సెనేట్ ప్యానెల్ కూడా దీనిపై విచారణ జరుపుతోంది. భారత్ బయోటెక్ మాత్రం అన్ని ఆరోపణలను తోసిపుచ్చింది. వ్యాక్సిన్ అత్యవసర వినియోగ ఆమోదం కోసం తాము ప్రతీ స్టెప్‌ ను ఫాలో అయ్యామని వెల్లడించింది. అంతర్జాతీయంగా ఆయా దేశాల్లోని చట్టాలకు లోబడే ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపింది. విలువలు, సమగ్రత విషయంలో తమ సంస్థ అత్యున్నత ప్రమాణాలకు పెద్ద పీట వేస్తుందని వెల్లడించింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా కోవాగ్జిన్ వ్యాక్సిన్ ధర 15 డాలర్ల నుంచి 20 డాలర్ల వరకు ఉంది. బ్రెజిల్‌కు 15 డాలర్ల చొప్పున విక్రయించేందుకు ఒప్పందం చేసుకుంది. అయితే ఇందుకోసం ఎలాంటి అడ్వాన్స్ ప్రభుత్వం నుంచి తీసుకోలేదని తెలిపింది. ఇప్పటివరకూ బ్రెజిల్‌ కు వ్యాక్సిన్లు సప్లై చేయలేదని స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే ..భారత్‌ బయోటెక్‌ సంస్థకు చెందిన కోవాగ్జిన్‌ కరోనా వైరస్ టీకాకు వచ్చే ఆరు వారాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ ఓ) అత్యవసర వినియోగ అనుమతిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని డబ్ల్యూహెచ్‌ ఓ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్‌ గత వారం వెల్లడించారు. సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సీఎస్‌ఈ) ఏర్పాటు చేసిన ఒక వెబినార్‌ లో పాల్గొన్న సందర్భంగా ఆమె మాట్లాడారు. డబ్ల్యూహెచ్‌ ఓ అత్యవసర వినియోగ జాబితా(ఈయూఎల్‌)లో ఏదైనా కొత్త టీకాను చేర్చాలంటే అది నిర్దేశిత పనితీరు స్థాయిని చేరుకోవాల్సి ఉంటుందని ఆమె వ్యాఖ్యానించారు. కనీసం మూడు నుంచి నాలుగు ట్రయల్స్‌ కు చెందిన వివరాలను డబ్ల్యూహెచ్‌ ఓ కు అందించాలని తెలిపారు.

డబ్ల్యూహెచ్‌ ఓ లోని నిపుణుల సలహా బృందం ఆయా సమాచారాన్ని విశ్లేషించి అనుమతుల జారీపై తమ సూచనలు ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. కోవాగ్జిన్‌కు చెందిన సమాచారం ఇప్పటికే డబ్ల్యూహెచ్‌ ఓ కు చేరిందని అని తెలిపారు. నెలన్నరలోగా కోవాగ్జిన్‌ అత్యవసర వినియోగ జాబితాలో చేరే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ఫైజర్‌/బయోఎన్‌ టెక్, ఆస్ట్రాజెనెకా–ఎస్‌ కే బయో/ సీరమ్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, ఆస్ట్రాజెనెకా ఈయూ, జాన్సెన్, మోడెర్నా, సినోఫార్మ్‌ టీకాలను డబ్ల్యూహెచ్‌ వో తమ ఈయూఎల్‌ జాబితాలో ఇప్పటికే చేర్చింది.
Tags:    

Similar News