రాజకీయ పార్టీల విరాళాలకు కొవిడ్ ఎఫెక్టు.. ఎంతలా తగ్గాయంటే?

Update: 2022-07-15 23:30 GMT
ప్రపంచ దేశాలకు దిమ్మ తిరిగే షాకివ్వటమే కాదు.. పలు దేశాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో ఉక్కిరి బిక్కిరి అయ్యేలా చేసిన ఘనత మహమ్మారి కరోనాకే దక్కుతుంది. దీని పుణ్యమా అని కోట్లాది మంది ప్రభావితమయ్యారు. మిగిలిన దేశాల్లో మాదిరే మన దేశంలోనూ కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటమే కాదు.. దాని కారణంగా ఆ రంగం.. ఈ రంగం అన్న తేడా లేకుండా అన్ని రంగాలు తీవ్రమైన ఇబ్బందుల్లో పడ్డాయి. ఇదిలా ఉంటే.. ఈ కరోనా కారణంగా రాజకీయ పార్టీలకు సైతం దెబ్బ పడిందన్న కొత్త విషయాన్ని తాజాగా ఒక సంస్థ వెల్లడించింది.

అసోసియేషన్ ఫర్‌ డెమోక్రాటిక్‌ రిఫామ్స్‌ సంస్థ.. కరోనా.. లాక్ డౌన్ కాలంలో రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాల లెక్క తీసింది. దేశంలోని గుర్తింపు పొందిన జాతీయ పార్టీలకు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే రూ.420 కోట్ల మేర విరాళాలు తగ్గినట్లుగా పేర్కొంది. శాతంగా చెప్పాలంటే దాదాపు 41.4 శాతం తక్కువగా విరాళాలు వచ్చినట్లుగా పేర్కొంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. కరోనా కారణంగా అధికారంలో ఉన్న జాతీయ పార్టీకి సైతం విరాళాల రాక తగ్గి ఉండటం గమనార్హం.

కేంద్రంలో పవర్లో ఉన్న బీజేపీ విషయానికే వస్తే.. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో రూ.785.77 కోట్ల విరాళాలు రాగా.. కరోనా ఏడాది (2020 - 2021)లో అదే బీజేపీకి వచ్చిన విరాళాలు కేవలం రూ.477.54 కోట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.139.01 కోట్ల విరాళాలు వస్తే.. 2020-21లో రూ.74.52 కోట్లు మాత్రమే విరాళాల రూపంలో అందుకున్నట్లు వెల్లడించింది.

ఇక.. జాతీయపార్టీలకు వచ్చే విరాళాల్లో ఏయే నగరం నుంచి ఎంతమేర వస్తాయన్న విషయానికి వస్తే.. అత్యధిక విరాళాలు ఢిల్లీ నుంచి జాతీయ పార్టీలకు వచ్చాయి. ఆ తర్వాతి స్థానం మహారాష్ట్రలోని ముంబయి.. తర్వాతి స్థానం గుజరాత్ నుంచి వచ్చినట్లుగా పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాల్లో అత్యధికం కార్పొరేట్లు.. బిజినెస్ రంగాల నుంచి వచ్చాయి. ఇక.. వ్యక్తిగత స్థాయిలోనూ పార్టీలకు విరాళాలు వచ్చాయి. వీటిల్లోనూ అత్యధికం బీజేపీకి రాగా.. తర్వాతి స్థానంలో కాంగ్రెస్ నిలిచింది.
Tags:    

Similar News