చిట్టెలుకతో కొవిడ్ ముప్పు.. అప్రమత్తమైన దేశం!

Update: 2021-12-11 04:31 GMT
కరోనా వ్యాప్తికి కాదేది అనర్హం అన్న చందంగా వైరస్ విజృంభిస్తోంది. రూపాంతరం చెందుతూ దశలు దశలుగా పంజా విసురుతోంది. కాగా గత పదిరోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతోంది. సెకండ్ వేవ్ లో అతి ప్రమాదకరంగా పేర్కొన్న డెల్టా వేరియంట్ కన్నా... ఇది చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

అంతేకాదు ఇది జెట్ స్పీడ్ లో ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతోంది. అయితే తైవాన్ దేశంలో దాదాపు 30 రోజుల నుంచి ఒక్క పాజిటివ్ కేసు నమోదుకాలేదు. నెల రోజుల తర్వాత ఒక్కరికి కరోనా సోకింది. అయితే అందుకు కారణం ఓ చిట్టెలుక.

కరోనా వైరస్ కు.. చిట్టెలుకకు సంబంధం ఏంటి అనుకుంటున్నారా.. అక్కడే ఉంది అసలు విషయం. ఓ ల్యాబ్ లో ఉండే చిట్టెలుక వల్లే పాటిజివ్ కేసు నమోదైందని అక్కడివారు అనుమానిస్తున్నారు. 'అకాడెమికా సినికా జెనోమిక్ రీసెర్చ్ సెంటర్' లో పని చేసే 20 ఏళ్ల మహిళకు వైరస్ సోకింది. ల్యాబ్ లో ఉన్న ఎలుక కరిచిన తర్వాతే ఆమెకు వైరస్ నిర్ధరణ కావడం గమనార్హం.

ప్రపంచంలో అత్యున్నత పరిశోధనా కేంద్రాల్లో ఈ ల్యాబ్ ఒకటి. వివిధ రకాల వ్యాధికారకాలు, నిరోధకాలు, జంతువుల్లో వ్యాక్సినేషన్ వంటి వాటిపై ఇక్కడ పరిశోధన చేస్తారు. అందుకే ఈ ప్రయోగశాలలో కొన్ని జంతువులు కూడా ఉంటాయి. కాగా ల్యాబ్ లో ఉండే ఎలుకే ఉద్యోగిని కరిచింది. ఈ అంశాన్ని ఆ దేశ హెల్త్ మినిస్టర్ చెన్ షిహ్ చుంగ్ ధ్రువీకరించారు.

ల్యాబ్ లో పనిచేసే ఉద్యోగినికి పాజిటివ్ గా తేలడంతో మళ్లీ వైరస్ విస్తరిస్తుందేమోనని ఆ దేశ ప్రజలు భయపడుతున్నారు. వైరస్ ను కట్టడి చేయడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

మరోవైపు ఆమెకు పాజిటివ్ గా నిర్ధరణ కావడానికి చిట్టెలుకే కారణమా? అన్న కోణంలో పరిశోధనలు చేస్తున్నారు. ఇందుకోసం అంతర్గత విచారణ, పలు పరీక్షలు చేపట్టాలని సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ అన్నారు. కాగా ఆమె కలిసిన వ్యక్తులను ఇప్పటికే క్వారంటైన్ లో ఉంచారు.

తైవాన్ దేశంలో నవంబర్ 5న చివిరి కేసు నమోదైంది. ప్రభుత్వం తీసుకున్న పటిష్ఠ చర్యల వల్ల ఆ తర్వాత ఒక్క కేసు కూడా తేలలేదు. కాగా ఇప్పుడు ల్యాబ్ లో పనిచేసే ఓ మహిళకు వైరస్ నిర్ధరణ అయింది. ఆమెకు డెల్టా వేరియంట్ సోకిందని అక్కడి వైద్యులు తెలిపారు. అయితే ఈ కేసులు మరింతగా పెరగకుండా చర్యలు చేపడుతున్నారు.

చిట్టెలుక ద్వారానే వైరస్ సోకిందా? ఎంతవరకు నిజం అనే దానిపై ఇప్పటికే పరిశోధనలు మొదలుపెట్టారు. ఒకవేళ ఎలుక నుంచే ఆమెకు వైరస్ సోకినట్లయితే మరింత అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని ఆ దేశ ఆరోగ్య శాఖ కసరత్తులు చేస్తోంది.



Tags:    

Similar News