బీహార్ ఎన్నికల్లో ఆవు యాడ్ కలకలం

Update: 2015-11-04 09:02 GMT
బీహార్ ఎన్నికల్లో మరో కలకలం మొదలైంది.  ఐదు విడతలుగా జరుగుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చివరి విడత ఎన్నికలు గురువారం జరగనున్నాయి. పోలింగ్ కు ఒక రోజు ముందు బిహార్ దినపత్రికల్లో ఈ రోజు ప్రచురితమైన ఒక యాడ్ (ప్రకటన) తీవ్ర రాజకీయ కలకలాన్ని రేపుతోంది. ఐదో విడత పోలింగ్ ప్రత్యేకత ఏమిటంటే.. ఈ దఫా జరిగే 57 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లదే అధిపత్యం. మజ్లిస్ సైతం ఈ ప్రాంతాల్లో పోటీ చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉదయాన్నే దినపత్రికల్లో వచ్చిన యాడ్ రాజకీయ సంచలనంగా మారింది.

ఆవును అప్యాయంగా దగ్గరకు తీసుకున్న ఒక మహిళ ఫోటోను ప్రచురించి.. సీఎంగారు.. మీ మిత్రుడు గోమాతనూ.. హిందువులనూ అవమానిస్తూ ప్రకటనలు చేస్తుంటారు.. అతడిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి మీరు మౌనంగా ఉంటారు.. దీని భావం ఏమిటి? అన్న అర్థం వచ్చేలా వెలవడిన ప్రకటనపై బీజేపీయేతర రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. బీహార్ లోని అన్నిప్రధాన దినపత్రికల్లోనూ ఈ ప్రకటన ప్రచురితమైంది. దీంతో.. ఆవు యాడ్ పోలింగ్ పై తీవ్రప్రభావితం చూపిస్తుందని భావిస్తున్నారు. హిందూ ఓటు బ్యాంక్ మొత్తాన్ని ఏకీకరణ చేసే పనిలో భాగంగా బీజేపీ ఈ వ్యూహాన్ని ఎంచుకున్నదని రాజకీయ పార్టీలు అభిప్రాయ పడుతున్నాయి.

ఆఖరివిడత పోలింగ్  కు సరిగ్గా ఒకరోజు ముందు హిందుత్వ కార్డును వినియోగించటం ఏమిటని పార్టీలు అగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా కలకలం రేపిన దాద్రి ఘటన సందర్భంగా మహాకూటమిలో భాగస్వామి అయిన లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ.. హిందువులు గో మాంసం తింటారని వ్యాఖ్యలు చేయగా.. దీనిపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇప్పటివరకూ స్పందించింది లేదు. దీన్ని అస్త్రంగా చేసుకొని బీజేపీ ఆవు యాడ్ ను ప్రయోగించిందని చెబుతున్నారు. బీజేపీ ఇచ్చిన ఈ తాజా ప్రకటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని మిగిలిన రాజకీయ పక్షాలుహెచ్చరిస్తున్నాయి. మరి.. ఆవు యాడ్ తో చివరి విడత పోలింగ్ ముందు ప్రయోగించిన బీజేపీ.. తాను అనుకున్న ఫలితాన్ని సాధిస్తుందా? లేదా? అన్నది ఫలితాలే (నవంబరు 8న ఓట్ల లెక్కింపు) నిర్ణయించాలి. మరి.. ఆవుయాడ్ పై ఎన్నికల సంఘం ఎలా రియాక్ట్ అవుతుందో?
Tags:    

Similar News