వామపక్షాలకు మిగిలింది లోక్ సత్తానే

Update: 2016-01-02 11:28 GMT
జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో వామపక్షాలు లోక్ సత్తాతో జట్టు కడుతున్నాయి. సీపీఐ - సీపీఎం - లోక్ సత్తా కలిసి ఎన్నికల్లో ఉమ్మడిగా బరిలోకి దిగనున్నాయి. వీరి కలయిక నేపథ్యంలోనే జోగి జోగి కలుసుకుంటే బూడిద రాలుతుందనే సామెత చందంగా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

వాస్తవానికి వామపక్షాలు ఎవరో ఒకరితో కలవకపోతే, నీటి నుంచి బయటపడిన చేపల్లా వాటి పరిస్థితి తయారైంది. దాంతో ప్రతి ఎన్నిక సందర్భంలోనూ తమతో ఎవరు కలుస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు వామపక్షాలు ఎక్కువగా టీడీపీతో జట్టు కట్టాయి. గ్రేటర్ ఎన్నికల్లో కూడా టీడీపీతో జట్టు కడదామని భావిస్తే తెలుగుదేశం పార్టీ చేయిచ్చింది. ఆ పార్టీ బీజేపీతో జట్టు కట్టింది. బీజేపీతో జట్టు కట్టిన టీడీపీతో వామపక్షాలు జట్టుకట్టలేవు కదా. దాంతో టీడీపీకి కటీఫ్.

సాధారణంగా అధికారంలో ఎవరు ఉంటే.. అధికారంలోకి ఎవరు వస్తారనుకుంటే ఆ పార్టీతో జట్టు కట్టడం వామపక్షాల అలవాటు. ఇప్పుడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ వామపక్షాలను దరిదాపుల్లోకి కూడా రానివ్వడం లేదు. అసలు పొత్తులు అనేవే ఉండవని తెగేసి చెబుతోంది. దాంతో టీఆర్ఎస్ గురించి ఆలోచించే ప్రసక్తే లేదు.

హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఆదరణ లేదు. ఆ పార్టీ ఇప్పటికే తనకు తానే లయబులిటీగా మారింది. దీనికితోడు కాంగ్రెస్ తో జట్టు కట్టినప్పుడల్లా వామపక్షాలకు బొప్పి కట్టింది తప్పితే ఉపయోగం లేకపోయింది. అదే సమయంలో ఈసారి పొత్తులకు కాంగ్రెస్ పార్టీ కూడా సుముఖత చూపలేదు. దాంతో దానితోనూ కటీఫ్. ఇక మజ్లిస్ వామపక్షాలను ఎలాగూ దగ్గరకు రానివ్వదు. వామపక్షాలు కూడా ఆ పార్టీ దరిదాపుల్లోకి కూడా వెళ్లవు.

ఈ నేపథ్యంలోనే మిగిలింది ఒకే ఒక పార్టీ. అదే లోక్ సత్తా. ఆ పార్టీతో పొత్తుకు ఒక ప్రాతిపదిక రూపొందించుకోవాలి కదా. అందుకే అవినీతిరహిత రాజకీయాలు అనే ఒక ప్రాతిపదికను రూపొందించుకుని కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ మూడు కలిసినా ఎవరి అవకాశాలకైనా గండి కొట్టే అవకాశం ఉందా?
Tags:    

Similar News