బాలకృష్ణ, చిరంజీవి సినిమాలకు జగన్‌ సైంధవుడిలా అడ్డుపడుతున్నారు: సీపీఐ నేత సంచలన వ్యాఖ్యలు!

Update: 2023-01-06 09:21 GMT
బాలకృష్ణ, చిరంజీవి సినిమాలకు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ సైంధవుడిలా అడ్డుపడుతున్నారని సీపీఐ నేత రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కల్యాణ్‌ రాజకీయాల్లో ఉన్నారని.. ఆయన సినిమాలను అడ్డుకున్న అర్థం ఉంది కానీ.. బాలయ్య, చిరంజీవి సినిమాలను అడ్డుకోవడం ఏమిటని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలను, సినిమా హీరోలను వేధించేలా జగన్‌ పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. వైఎస్‌ జగన్‌ గెలిస్తే రాష్ట్రం రావణకాష్టంలా రగులుతూనే ఉంటుందని తాను గతంలోనే చెప్పానని రామకృష్ణ హాట్‌ కామెంట్స్‌ చేశారు.

బాలకృష్ణ, చిరంజీవి సినిమాలను అడ్డుకోవడం ద్వారా రెండు కులాలను జగన్‌ లక్ష్యంగా చేసుకున్నట్టు కనిపిస్తోందని రామకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. రోజా మాత్రం ఎక్కడున్నా ఎంజాయ్‌ చేస్తోందన్నారు. తాను కూడా జబర్దస్త్‌ చూస్తానని రామకృష్ణ తెలిపారు.

జనవరి 6న ఒంగోలులో నిర్వహించనున్న బాలయ్య వీరసింహారెడ్డి ప్రి రిలీజ్‌ ఈవెంట్‌ వేదికను ఇప్పటికే పలుమార్లు పోలీసులు మార్పించారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఈ ఈవెంట్‌ కు సైతం షరతులు విధించారని పత్రికల్లో కథనాలు వచ్చాయి. వృద్ధులు, చిన్నారులను సభకు తీసుకురావద్దని ఈవెంట్‌ ను నిర్వహిస్తున్న శ్రేయ శ్రీనివాసరావు పోలీసులు ప్రకటన ఇప్పించారు.

బాలకృష్ణ వీరసింహారెడ్డి ప్రి రిలీజ్‌ ఈవెంట్‌ కు సంబంధించి ముందుగా అనుకున్న వేదిక కాదని.. మరో చోటకు, మళ్లీ అక్కడ నుంచి ఇంకో చోటకు ఇలా పలు వేదికలు పోలీసులు మార్పించారని పత్రికల్లో కథనాలు వచ్చాయి. దీంతో అప్పటికే వేసిన సెట్టింగులను, ఏర్పాట్లును తీసివేయాల్సి వచ్చిందని మీడియా పేర్కొంది.

ఇక చిరంజీవి కథానాయకుడిగా వస్తున్న వాల్తేరు వీరయ్య ప్రి రిలీజ్‌ ఈవెంట్‌ విశాఖపట్నం ఆర్కే బీచ్‌ లో జరగాల్సి ఉంది. ఇందుకు సంబంధించి సెట్టింగ్‌ ఏర్పాట్లలో చిత్ర యూనిట్‌ ఉండగా.. పోలీసులు అనుమతి లేదని నిలిపివేసినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్యలకు ఇబ్బందులు తప్పవని అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే సీపీఐ నేత రామకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ సీఎం జగన్‌ సినిమాలను కూడా వదలకుండా సైంధవుడిలా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. రామకృష్ణ విమర్శలపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News