స్టూడెంట్స్ ఆత్మహత్యలకు - గంటాకూ లింకుందా?

Update: 2017-10-22 09:06 GMT
తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ కాలేజీల్లో విద్యార్థులు చిగురుటాకుల్లా రాలిపోతున్నారు. కాలేజీల్లో ఒత్తిడి భరించలేక తమ జీవితాలను కడతేర్చుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఇటీవలి గణాంకాల ప్రకారం 60 రోజుల వ్యవధిలో 50 మంది ఇంటర్మీడియట్ చిన్నారులు రెండు తెలుగు రాష్ట్రాల్లో మరణించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే.. విద్యార్థుల ఆత్మహత్యలకు, కాలేజీల్లో యాజమాన్యాలు మార్కులు కోసం పెట్టే ఒత్తిడి, కొద్దిగా వెనకబడితే వారు చేసే అవమానాలు ఇవన్నీ కారణం అవుతాయి. అలాంటి మూల కారణాల్ని కనిపెట్టి చక్కదిద్దితే.. పరిస్థితి మారుతుంది. ఇదంతా ఓకే గానీ.. విద్యార్థుల ఆత్మహత్యలకు ఒక మంత్రికి సంబంధం ఉంటుందా? కేవలం ఒక మంత్రిని మార్చినంత మాత్రాన పరిస్థితి మారుతుందా? అవుననే అంటున్నారు సీపీఐ నాయకులు. ఏపీలో ఆత్మహత్యలు ఆగాలంటే మంత్రి గంటాను విద్యాశాఖనుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక రకంగా వారి వాదనలో కూడా లాజిక్ ఉంది మరి.

మంత్రి గంటా శ్రీనివాసరావు - మరో మంత్రి నారాయణకు స్వయానా వియ్యంకుడు. జరుగుతున్న ఆత్మహత్యలు చాలా వరకు నారాయణ కాలేజీల్లోనే చోటు చేసుకుంటున్నాయి. అయితే.. సామాజిక ఉద్యమకారులందరూ కూడా ఈ జూనియర్ కాలేజీల యజమానులకే శిక్ష పడేలా చట్టాలు ఉండాలని పనదేపదే అంటూ ఉంటారు గానీ.. గంటా మాత్రం.. ఎన్నడూ నారాయణ కాలేజీల గుత్తాధిపత్యం వెలగబెట్టే బావగారి మీద ఈగ వాలనివ్వకుండా చూసుకుంటూ ఉంటారు. చివరికి ఆత్మహత్యల నివారణకు యాజమాన్యాల మీద చర్య తీసుకునేలా చట్టాల రావడానికి కూడా ఆయన కృషిచేయరు. సామాజిక ఉద్యమ కారులు, కాస్తో కూస్తో ఆలోచించగలిగిన ప్రతి ఒక్కరూ చెప్పే పరిష్కార మార్గాలు ఆయనకు మాత్రం స్పురించవు. అర్థం కావు.

అందుకే కాబోలు.. ముందు విద్యాశాఖ నుంచి మంత్రి గంటాను తప్పిస్తే.. ఆటోమేటిగ్గా చట్టాలు బాగుపడి.. యాజమాన్యాలు మారుతాయని, తద్వారా పిల్లల మీద ఒత్తిడి తగ్గుతుందని, ఆత్మహత్యలు కూడా తగ్గుతాయని సీపీఐ నాయకులు అంటున్నారు. గంటా పేరుకు సమావేశాలు భేటీలు నిర్వహిస్తున్నారే గానీ.. ఆత్మహత్యల నివారణకు నిర్దిష్ట చర్యలు తీసుకోవడం లేదని, ఇన్ని ఆత్మహత్యలు జరిగినా బాధ్యులుగా ఎక్కడా ఏ యాజమాన్యాన్నీ గుర్తించకపోవడమే.. ప్రభుత్వ అచేతనత్వానికి నిదర్శనం అని కూడా అనేక విమర్శలు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News