అమిత్ షా...నీ కొంగ జ‌పం ప‌నిచేయ‌దు

Update: 2017-05-21 04:51 GMT
త‌న‌దైన శైలిలో ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్లు చేసే సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఒకింత గ్యాప్ త‌ర్వాత మీడియా ముందుకు వ‌చ్చారు.   బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా తెలంగాణ పర్యటన సందర్భంగా విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేసిన నారాయ‌ణ ఎప్ప‌ట్లాగే త‌న‌దైన శైలిలో సెటైర్లు,విమ‌ర్శ‌లు చేశారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై 25 చోట్లకుపైగా దాడులు జరిగాయని నారాయ‌ణ తెలిపారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతల చేతులు రక్తసిక్తమయ్యాయని,  అందువల్ల ఆ పార్టీ అగ్ర నాయకులను పాపభీతి వెంటాడుతున్నదని తెలిపారు. దాన్ని తొలగించుకునే పనిలో భాగంగానే అమిత్‌ షా తెలంగాణ పర్యటన సందర్భంగా దళితుని ఇంట భోజనం చేస్తానంటూ ప్రకటించారని ఎద్దేవా చేశారు.

ఒకవైపు దళితులపై దాడులు చేస్తున్న బీజేపీ, ఆరెస్సెస్‌... మరోవైపు వారికి దగ్గరయ్యేందుకు కొంగ జపం చేస్తున్నాయని నారాయ‌ణ‌ విమర్శించారు. రామనామాన్ని పఠిస్తూ దేశంలో రావణ కాష్టాన్ని రాజేస్తున్నారని మండిపడ్డారు. అమిత్‌షా తెలంగాణ పర్యటన సందర్భంగా ఆయన చూపు కమ్యూనిస్టులవైపు ఉన్నట్టు కనబడుతున్నా... దాడి మాత్రం కేసీఆర్‌ సర్కారు పైనే ఉంటుందని చెప్పారు. అందువల్ల బీజేపీ మతోన్మాద చర్యల్ని గుర్తించి, వాటిని అరికట్టేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లేదంటే రాష్ట్రానికి ప్రమాదమని హెచ్చరించారు. ఇలాంటి మతోన్మాద చర్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వామపక్ష, అభ్యుదయ, ప్రజాతంత్ర శక్తులతో కలిసి పోరాడతామని తెలిపారు.బీజేపీ నేతలు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా... తెలంగాణలో కమ్యూనిస్టుల పునాదులను వారు కదిలించలేరని హెచ్చరించారు. 100 మంది అమిత్‌షాలు ప్రచారం చేసినా... తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి రాదని వ్యాఖ్యానించారు.

ఒకేసారి ఎన్నికలంటూ మోడీ ఊదరగొడుతున్నారని అయితే భారత్‌లాంటి సమాఖ్య వ్యవస్థలో ఇది సాధ్యం కాదని నారాయ‌ణ‌ తెలిపారు. ఎన్నికల నిర్వహణలో సంస్కరణలను తీసుకురావాలని, ఇందులో భాగంగా దామాషా పద్ధతిన వాటిని నిర్వహించాలని ఆయన ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. కేసీఆర్‌ మూడేళ్ల‌ పాలన ముచ్చటగానే గడిచిపోయిందని ఎద్దేవా చేశారు. ఆయన ఆడిందే ఆటగా, పాడిందే పాటగా ఈ కాలం ముగిసిందని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ హయాంలో పోలీసులు విచ్చలవిడిగా పేట్రేగిపోతున్నారని, ఇదే సమయంలో పోలీసుల సేవలు బ్రహ్మాండంగా ఉన్నాయంటూ ముఖ్యమంత్రి పొగడటం శోచనీయమని అన్నారు. తద్వారా వారు మరింతగా రెచ్చిపోవటానికి ఆయన ఆస్కారం కల్పించారని విమర్శించారు. ఇటీవల ధర్నాచౌక్‌ ఉద్యమం సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరునుబట్టి... వారు అధికార టీఆర్‌ఎస్‌ ఏజెంట్లలాగా వ్యవహరిస్తున్నారనే విషయం బట్టబయలైందని నారాయ‌ణ‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News