ఇద్ద‌రు నాయుళ్లు విలువ త‌గ్గించుకుంటున్నార‌ట‌

Update: 2016-09-25 16:37 GMT
సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ మ‌రోమారు ఘాటు వ్యాఖ్యలు చేశారు.  విజ‌య‌వాడ‌లో జ‌రిగిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ చేతిలో పావులుగా మారిన కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు, చంద్ర‌బాబు నాయుడు సన్మానానికున్న విలువను మంటగలిపారని మండిప‌డ్డారు. ప్రత్యేక హోదా అమలు జరిగిన రాష్ట్రాల్లో అభివృద్ధి జరిగిందో లేదో నిజనిర్ధారణ పర్యటనకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సిద్ధమేనా? అని  సవాలు విసిరారు. విభజన సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని గట్టిగా వాదించిన వెంకయ్య తీరా ఇప్పుడు హోదా అమలు చేసిన 11 రాష్ట్రాల్లో ఏమీ జరగలేదని మాట్లాడం విడూరంగా ఉందన్నారు. హోదా వల్ల ప్రత్యేకంగా ఏమీ ఒరగనప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షునిగా, మూడు సార్లు కేంద్ర మంత్రిగా చేసి విశేష అనుభవం ఉన్న వెంకయ్య ఎందుకు హోదా కోసం డిమాండ్ చేశారని నారాయణ ప్రశ్నించారు.

ప్ర‌త్యేక‌ హోదా అమలు జరిగిన రాష్ర్టాల్లో బీజేపీతో పాటు వామపక్షాలు కలసి తిరిగి అభివృద్ధి జరిగిందో లేదో లెక్కలు ద్వారా తేలుద్దామని నారాయ‌ణ ప్ర‌తిపాదించారు. వాస్తవంగా ఆ రాష్ట్రాలు హోదా వల్ల అభివృద్ధి చెందలేదని నిరూపణ అయితే ప్రత్యేక ప్యాకేజీ తీసుకోవడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ప్రతి కార్యక్రమంలోనూ కేంద్రం రాష్ట్రానికి రూ. 2.25 లక్షల కోట్లు ఇచ్చిందని వెంకయ్య చెబుతున్నారని, ఏయే ప్రాజెక్టులకు ఎంతెంత ఇచ్చారో లెక్కలు చెబితే నిజంగానే ఆయనకు పాలతో అభిషేకం చేస్తామని నారాయ‌ణ చెప్పారు. ఒకప్పుడు ప్రత్యేక హోదా కావాలన్నందుకు, ఇప్పడు హోదా వద్దన్నందుకు విజయవాడలో వెంకయ్య సన్మానాలు చేయించుకోవడంపై నారాయ‌ణ‌ స్పందిస్తూ స‌న్మానానికి ఉన్న విలువను తీసేసారని విమర్శించారు. సన్మాన ప్రక్రియకు ద్రోహం చేసిన వ్యక్తి ఎవరైనా ఉంటే అది వెంకయ్యే అవుతారని చెప్పారు. ప్రత్యేక హోదా విషయమై తనను విమర్శించే వారి స్థాయిని బట్టి స్పందిస్తానని కేంద్రమంత్రి వెంకయ్య చెప్పారన్న విషయాన్ని గుర్తుచేస్తూ.. 'ఆకాశంలో అందనంత ఎత్తులో వెంకయ్య ఉండి నీతులు చెబుతున్నారు. నేను నేల నుండి నిజాలే చెబుతున్నాను' అని నారాయ‌ణ‌ అన్నారు. ప్రజలు చాలా విజ్ఞలని ఇప్పటికైనా చేసిన తప్పని ఒప్పుకోవాలని బీజేపీ - టీడీపీ కూటమికి ఆయన విజ్ఞప్తి చేశారు. దేశంలో అత్యవసర పరిస్థితి కల్పించిన నాటి ప్రధాని ఇందిరాగాంధీ తాను చేసింది తప్పేనని అంగీకరించడంతో ప్రజలు పెద్ద మనసుతో మళ్లీ ఆమెకు పట్టం గట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అబద్దాలను నిజం చేయాలని యత్నిస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని నారాయణ స్పష్టం చేశారు.

విభజన సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా 15 సంవత్సరాలు కావాలని డిమాండ్ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు మాటమార్చి ప్ర‌ధాన‌మంత్రి కోసం ప్రత్యేక హోదా సర్వరోగ నివారణి కాదని చెప్పడం సరికాదని నారాయ‌ణ అన్నారు. ఒకప్పుడు కేంద్రంలో చక్రం తిప్పిన చంద్రబాబు సర్వం తెలిసి కూడా ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ప్రజల్ని మోసగించడమే అవుతుందన్నారు. ఒక విధంగా వెంకయ్య, చంద్రబాబులను ప్ర‌ధాన‌మంత్రి మోడీ పావులుగా వాడుకుంటున్నారని అయితే 2019 నాటికి ఈ బంధం తెగిపోవడం ఖాయమని నారాయ‌ణ జోస్యం చెప్పారు.
Tags:    

Similar News