నయీం భూములపై నారాయణ కన్ను

Update: 2016-08-13 09:15 GMT
ఎర్రజెండాలు పాతి పేదలకు భూములు పంచిపెట్టడంలో స్పెషలిస్టులైన వామపక్ష నేతలు ఒక్కసారి ఇలా భూమి పంచిపెట్టారంటే అక్కడి నుంచి వారిని కదిలించడం అంత తేలికేం కాదు. ప్రభుత్వ స్థలాలు - భూస్వాముల భూముల్లో వీరు ఎర్రజెండాలు పాతిస్తుంటారు. తాజాగా గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్ తరువాత ఆయనకు భారీగా భూములున్నట్లుగా బయటపడడంతో వాటిపై కమ్యూనిస్టు నేతల కన్ను పడింది. ముఖ్యంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఈ విషయంలో వేగంగా స్పందించారు. జనాలను  బెదిరించి - ఆక్రమించి - తక్కువ ధరలకు వందలాది ఎకరాలు పోగేసుకున్న నయీం భూములన్నీ అక్రమాస్తులే కాబట్టి పేదలు వాటిని ఆక్రమించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

నయీం భూముల్లో ఎర్ర జెండాలు పాతాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అర్జంటుగా అందులో గుడిసెలు వేసుకోండని సూచించారు. ‘‘మీరు గుడిసెలు వేసుకోండి... ఏ నాయకుడు అడ్డు వస్తాడో చూస్తా’’ అంటూ ఆవేశంగా చెప్పారు. రేపటి నుంచే పని మొదలుపెట్టాలని.. నయీం భూములన్నీ పేదల పరం కావాలని ఆయన పిలుపునిచ్చారు. దీంతో ఇప్పటికే నయీం వ్యవహారాలతో రచ్చరచ్చ సాగుతున్న తెలంగాణలో ఈ విషయంలో సీపీఐ ఎంట్రీతో మరింత వేడి మొదలవుతుందని భావిస్తున్నారు.

కాగా నయీం తమను బెదిరించి లాక్కున్న భూములు తమకే చెందాలి కానీ ఎవరికో ఎలా పంచిపెడతారని వాటి యజమానులు నారాయణను ఉద్దేశించి ప్రశ్నిస్తున్నారు. అప్పుడు నయీం అన్యాయంగా లాక్కుంటే ఇప్పుడు కమ్యూనిస్టులు కూడా న్యాయం లేకుండా ఇలా ప్రజలపరం చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు. నారాయణ పిలుపు నేపథ్యంలో ఏం జరగబోతోందో చూడాలి.
Tags:    

Similar News