రాజ‌ధానిపై జ‌గ‌న్ కు సీపీఐ కొత్త గ‌డువు!

Update: 2020-02-05 13:30 GMT
ఒక‌వైపు ఏపీ రాజ‌ధాని అంశం పూర్తిగా ఆ రాష్ట్ర ప‌రిధిలోది అన్న‌ట్టుగా కేంద్రం క్లారిటీ ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ వాళ్లు లోక్ స‌భ‌లో అడిగిన ప్ర‌శ్న ద్వారా ఈ అంశంసై కేంద్ర హోం శాఖ స్ప‌ష్ట‌త ఇచ్చింది. ఒక రాష్ట్ర రాజ‌ధాని ఆ రాష్ట్రం ప‌రిధిలో ఎక్క‌డైనా ఉండొచ్చు, రాజ‌ధాని అంశం పూర్తిగా ఆ రాష్ట్రం ప‌రిధిలోని అంశం అని కేంద్రం కుండ‌బ‌ద్ధ‌లు కొట్టింది. ఇలా రాజ‌ధాని అంశంపై దాదాపు స్ప‌ష్ట‌త వ‌చ్చింది.

అయితే తెలుగుదేశం పార్టీ వాళ్లు మాత్రం త‌గ్గ‌డం లేదు. మూడు రాజ‌ధానుల‌కు వ్య‌తిరేకంగా అంటూ స‌భ‌లు పెడుతూ ఉన్నారు. ఈ స‌భ‌ల్లో తెలుగుదేశం సంగ‌తెలా ఉన్నా.. క‌మ్యూనిస్టు పార్టీ సీపీఐ హ‌డావుడి మాత్రం గ‌ట్టిగానే ఉంది. ఇప్ప‌టికే తెలుగుదేశం పార్టీకి బీ టీమ్ లా మారింది సీపీఐ. ఎన్నిక‌ల ముందు వ‌ర‌కూ జ‌న‌సేన‌కు బీ టీమ్ లా ప‌ని చేసింది సీపీఐ. ఇప్పుడు ప‌వ‌న్ వెళ్లి క‌మ‌లం పార్టీతో జ‌త క‌ల‌వ‌డంతో.. తెలుగుదేశం పంచ‌న చేసింది ఈ క‌మ్యూనిస్టు పార్టీ.

సీపీఐ నేత రామ‌కృష్ణ అయితే చంద్ర‌బాబు వెంట తిర‌గ‌డం ఇప్ప‌టికే విమ‌ర్శ‌ల పాల‌య్యింది. చంద్ర‌బాబు వెళ్లి జోలె ప‌ట్టిన కార్య‌క్ర‌మాల్లో ప‌క్క‌నే క‌నిపించారాయ‌న‌. చంద్ర‌బాబుకు మ‌రీ అతి భ‌జ‌న‌కారుడుగా ఆయ‌న మారాడు అనే విమ‌ర్శ‌లు వినిపించాయి. అధికారంలో ఉన్న‌ప్పుడు చంద్ర‌బాబు నాయుడు క‌మ్యూనిస్టు పార్టీల ఉనికిని కూడా గుర్తించ‌లేదు. అలాంటిది ఇప్పుడు సీపీఐ వాళ్లు మ‌రీ చంద్ర‌బాబు నాయుడి భ‌జ‌న‌ బృందంగా మారిపోయారు. ఇక రాయ‌ల‌సీమ ప్రాంతానికి చెందిన రామ‌కృష్ణ అలా మూడు రాజ‌ధానుల ఫార్ములాకు వ్య‌తిరేకిగా మార‌డం మ‌రింత విమ‌ర్శ‌ల‌కు కార‌ణం అవుతూ ఉంది.

అలా ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా సీపీఐ తీరు మాత్రం మార‌డం లేదు. మ‌రోసారి ఆ పార్టీ అమ‌రావ‌తి విష‌యంలో అతిగా ఆవేశ‌ ప‌డింది. మూడు రాజ‌ధానుల ఆలోచ‌న‌ను సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌చ్చితంగా మార్చుకోవాల‌ని సీపీఐ హెచ్చ‌రించింది. నిర్ణ‌యం మార్చుకోవ‌డానికి గడువు కూడా పెట్టింది. ఈ నెలాఖ‌రులోగా జ‌గ‌న్ నిర్ణ‌యం మార్చుకోవాల‌ట‌. లేక‌పోతే.. ఢిల్లీకి వెళ్లి నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టున్న‌ట్టుగా సీపీఐ ప్ర‌క‌టించేసింది. మ‌రి సీపీఐ హెచ్చ‌రిక‌తో సీఎం జ‌గ‌న్ భ‌య‌ప‌డిపోవాలా!
Tags:    

Similar News