వెంక‌య్య‌నాయుడు కొత్త ప‌ద‌వి ద‌క్కింద‌ట‌

Update: 2016-10-01 13:13 GMT
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఘాటు విమర్శలు చేశారు. వెంక‌య్య నాయుడు కేంద్ర మంత్రి స్థాయి నుంచి చంద్రబాబుకు ప్ర‌చారం చేసే పీఆర్ ఓ స్థాయికి దిగజారినట్లుందని ఎద్దేవా చేశారు. వెంకయ్యనాయుడు ప్రత్యేక విమానాల్లో వచ్చి మరీ సన్మానాలు చేయించుకుంటున్నారని, అసలు ఏం సాధించారని సన్మానాలకు సిద్ధపడుతున్నారో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. పైపెచ్చు త‌న‌తో పాటు ఏపీ సెఈం చంద్ర‌బాబు నాయుడును సైతం ప్ర‌త్యేకంగా పొగ‌డాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని రామకృష్ణ ప్ర‌శ్నించారు.

రెండు నాలుకల వెంకయ్యనాయుడు సన్మానాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందని రామకృష్ణ మండిప‌డ్డారు. గతంలో విభజన చ‌ట్టం ఆమోదించే సందర్భంలో తనవల్లే ఏపీకి న్యాయం జరిగిందని ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చి సన్మానాలు చేయించుకున్న వెంకయ్య... ప్ర‌స్తుతం రెండో కృష్ణుడి అవతారం ఎత్తి విభజన రాష్ట్రానికేమీ మేలు జరగలేదని అన్యాయం జరిగిందని చెపుతూ సన్మాన ఘట్టాలకు సిద్ధమవ్వడం సిగ్గుచేటని ద్వ‌జ‌మెత్తారు. ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని, అధికారంలోకి వస్తే 10 ఏళ్ళపాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామంటూ చెప్పిన ఆయన ప్రస్తుతం ప్యాకేజీ పాట పాడుతూ "సన్మానాల ప్యాకేజీ"కి సిద్ధమవ్వడాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ప్రజా బ్యాలెట్ పెట్టినా కనీసం 10 శాతం మంది కూడా ప్యాకేజీకి ఆమోదం తెలపడం లేదని స్ప‌ష్టం చేశారు. కేవలం రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకి 2020 వరకు మాత్రమే పన్నురాయితీలు ప్రకటించడం ద్వారా పెద్దగా పరిశ్రమలు వచ్చే అవకాశంలేదని చెప్పారు.

ఈ రెండేళ్ళ కాలంలో తానేదో బ్రహ్మాండం బద్దలుకొట్టినట్లు ప్రతిరోజూ చెప్పకు తిరుగుతున్న వెంకయ్యనాయుడు రాష్ట్ర ప్రజలను మోసం చేయడం తప్ప చేసిందేమీలేదని రామ‌కృష్ణ మండిప‌డ్డారు. ఏపీ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో 10 ఏళ్ళపాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన విషయాన్ని మరోసారి రామ‌కృష్ణ గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికైన నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు - ఇద్దరు పార్లమెంటు సభ్యులు రాజీనామా చేసి - తిరిగి ఎన్నికల్లో పోటీచేసి ఒక్క సీటు గెలిచినా ఎపికి ప్రత్యేక హోదా విషయమై మాట్లాడబోమని మ‌రోమారు రామ‌కృష్ణ‌ సవాల్ చేశారు. తిరుపతిలో వెంకయ్యనాయుడు పర్యటన సందర్భంగా త‌మ నాయకులను ముందస్తు అరెస్తులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News