జగన్ తో చిరంజీవి... ఈ కామెంట్స్ ఏంటి... ?

Update: 2022-01-14 10:00 GMT
ముఖ్యమంత్రి జగన్ తో మెగాస్టార్ చిరంజీవి తాజాగా సమావేశమయ్యారు. ఆయనతో ముఖాముఖీ భేటీ ద్వారా సినీ రంగానికి సంబంధించిన సమస్యల మీద కూలంకషంగా చర్చించారు. అదే విషయాన్ని ఆయన మీడియాకు కూడా చెప్పారు. తాను పూర్తి సంతృప్తి చెందానని, ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీతో సినీ రంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కారం అవుతాయని చిరంజీవి చెప్పారు.

సరే దీని తరువాత కూడా మరోసారి సినీ రంగ పెద్దలను తీసుకుని జగన్ తో చర్చలు జరుపుతాను అని చిరంజీవి చెప్పారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ దీని మీద ఏపీలో విపక్షం మాత్రం విమర్శలు కొనసాగిస్తోంది. మరీ ముఖ్యంగా సీపీఐ అయితే ప్రభుత్వ తీరుని తప్పుపడుతోంది. ఏంటి ఈ వన్ టూ వన్  భేటీలు, దీని వల్ల ఒరిగేది ఏముంటుంది అని నిన్ననే సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మీడియా ముందే రుసరుసలాడారు.

సినీ రంగంలో రిజిష్టర్ బాడీస్ ఉన్నాయి. కార్మిక చట్టప్రకారం నెగ్గిన యూనియన్లు ఉన్నాయి. వారిని పిలిచి చర్చలు జరిపితే ప్రయోజనం ఉంటుంది కానీ వ్యక్తులతో చర్చల వల్ల ఉపయోగం లేదని నారాయణ ఘాటు విమర్శలు చేశారు. ఇపుడు సీపీఐ ఏపీ కార్యదర్శి రామక్రిష్ణ వంతు వచ్చింది. ఆయన కూడా ఇదే రాగం అందుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవితో జగన్ జరిపిన చర్చల వల్ల ఏంటి లాభమని ఆయన నిలదీస్తున్నారు. వ్యక్తులతో చర్చలు జరపడమేంటి అని రామక్రిష్ణ గుస్సా అవుతున్నారు. సినీ పరిశ్రమకు చెందిన సినిమా ఆర్టిస్ట్స్‌, డైరెక్ట‌ర్స్‌, డిస్ట్రిబ్యూట‌ర్స్ అసోసియేష‌న్లు, థియేట‌ర్ల యాజ‌మాన్యాల‌తో మాత్రమే ప్రభుత్వం చర్చలు జరిపితే ఫలితం ఉంటుంది అని రామక్రిష్ణ అంటున్నారు.

ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వం తప్పు చేస్తోంది అన్నట్లుగానే రామక్రిష్ణ మాట్లాడారు. సినీ రంగం నుంచి కొంతమంది, ఇటు వైసీపీ ప్రభుత్వ పెద్దలు పరస్పరం విమర్శలు చేసుకోవడం వల్ల కూడా ఉపయోగం ఉండదని కూడా  ఆయన అంటున్నారు. సరే సీపీఐ రామక్రిష్ణ చెప్పినది వింటే సబబుగానే ఉన్నా కూడా ఇక్కడ పాయింట్ ఏంటి అంటే చిరంజీవిని కేవలం ఒక వ్యక్తిగా చూడడమే.

ఆయనను ఇండస్ట్రీ శక్తిగా, సినీ పెద్దగానే అంతా గుర్తిస్తున్నారు. మరి ఆ విషయం నారాయణకు కానీ రామక్రిష్ణకు కానీ తెలియదా అని ప్రశ్నలు వస్తున్నాయి. మరో వైపు గతంలో కూడా చిరంజీవి జగన్ తో చర్చలు జరిపారు. నాడు రాని అభ్యంతరాలు ఇపుడే ఎందుకు వస్తున్నాయి అని కూడా కొందరు డౌట్లు వ్యక్తం చేస్తున్నారు

నిజానికి ఏపీలో ఉన్న రాజకీయ వాతావరణం మూలంగానే ఈ కామెంట్స్ చేస్తున్నారు అంటున్నారు. పేరుకు సినీ రంగ సమస్యల మీద చర్చలు అని అంటున్నా జగన్ తో మెగాస్టార్ భేటీ మీద టీడీపీ సహా కొన్ని పక్షాలు కలవరపడుతున్నాయని ప్రచారం సాగుతోంది. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో నేరుగా కామెంట్స్ చేయలేకనే తమ అనధికార మిత్రుడిగా ఉన్న రామక్రిష్ణ చేత ఇలాంటి కామెంట్స్ చేయిస్తోంది అన్న అనుమానాలను వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.

మరో వైపు చూస్తే సినీ రంగ సమస్యలు ఏదో విధంగా పరిష్కారం కావడమే కదా అందరికీ కావాల్సింది అన్న మాట కూడా వినిపిస్తోంది. మొత్తానికి కామ్రేడ్స్ నుంచి ఈ తరహా విమర్శలు రావడమే వింతగా ఉంది అంటున్నారు. వారు సమస్య పరిష్కారానికే ఎపుడూ చూస్తారు. మార్గాన్ని కాదు, కానీ ఇపుడు మార్గాన్ని తప్పుపడుతున్నారు అంటే దీని వెనక పక్కా రాజకీయమే ఉందని, ఎవరి ప్రయోజనాల మేరకో వారు మాట్లాడుతున్నారా అన్న చర్చ కూడా వస్తోందిట. చూడాలి మరి దీని మీద మరెంత దుమారం రేగుతుందో.
Tags:    

Similar News