బాబు రికార్డు 150 ఏళ్ల పాత‌ద‌ట‌

Update: 2016-12-24 14:13 GMT
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారంతోనే కాలం వెళ్ళదీస్తున్నాయ‌ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి  రామకృష్ణ విమర్శించారు. ప్రచారం తప్ప ఇటు దేశంలో, అటు రాష్ట్రంలో ప్రగతి శూన్యమని త‌ప్పుప‌ట్టారు.  పెద్ద నోట్ల రద్దుతో దేశంలో సామాన్య - మధ్యతరగతి వర్గాలను మోడీ కష్టాలు పాలుచేయగా - ప్రచారార్భాటంతో - పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ చంద్రబాబు రాష్ట్రంలో రాజకీయాలను దిగజార్చారని రామ‌కృష్ణ‌ దుయ్యబట్టారు. 2017 సంవత్సరంలో ప్రజా సమస్యలపై పోరాటాలకు మరింత పదును పెట్టాల్సిన అవసరం వుందని, అందుకు ఎర్రజెండాలన్నీ ఏకం కావడానికి సిద్ధంగా ఉన్నాయని తెలియజేశారు. సీపీఐ కార్యక్ర‌మంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు.

రాజధాని నిర్మాణం, నదుల అనుసంధానం అంటూ చంద్ర‌బాబు ప్రచారం చేసుకుంటూ కాలం గ‌డిపేస్తున్నారని రామ‌కృష్ణ మండిప‌డ్డారు. నదుల అనుసంధానం 150 ఏళ్ళ క్రితమే జరిగిన విషయం చంద్రబాబుకు తెలియదా లేక కాపీ కొట్టి ప్ర‌చారం చేసుకుంటున్నారా అని ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో రాజకీయాలను చంద్రబాబు భ్రష్టుపట్టించారని, ఎమ్మెల్యేలను సంతలో పశువుల్ని కొన్నట్లు కొంటున్నాడని ధ్వజమెత్తారు. పైగా తాను నిప్పలాంటోడ్ని అంటున్నారని, ఆయన నిప్ప కాదు తుప్ప అని ప్రజలకు అర్థమైందని రామ‌కృష్ణ ఎద్దేవా చేశారు. నల్లధనాన్ని రప్పించి, ఒక్కొక్కరి ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తానన్న ప్రధాని మంత్రి త‌మ సొంత డ‌బ్బులు బ్యాంకుల్లో ఉంటే తీసుకునేందుకు అవకాశం లేకుండా చేశారని ధ్వజమెత్తారు. బడా వ్యాపారులు, రాజకీయ నాయకులు కోట్ల ఖర్చు చేస్తున్నా పట్టించుకోకుండా సామాన్యుల జీవితాలతో చెలగాటమాడారని, పైగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఓపిక పట్టడంటూ ప్రజల్ని మోసగిస్తున్నారని రామ‌కృష్ణ ధ్వజమెత్తారు. పెద్ద నోట్ల రద్దు చేయాలని చెప్పింది తానేనని ప్రచారం చేసుకున్న చంద్రబాబు ప్రభుత్వం తప్పచేసింది, ప్రజలు కష్టాలు పడుతున్నారంటూ మొసలి కన్నీరు కారుస్తురని దుయ్యబట్టారు

ఈ సంద‌ర్భంగా సినీ ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ‌పై రామ‌కృష్ణ మండిప‌డ్డారు. సీనియర్ కమ్యూనిస్టు నాయకులు, విజయవాడలో సంఘ వ్యతిరేక శక్తులను తరిమికొట్టిన - ప్రజా ఉద్యమాల ద్వారా 14 యేళ్ళ వయస్సులోనే జైలు జీవితాన్ని అనుభవించిన చలసాని వెంకటరత్నంను రాంగోపాల్ వర్మ తన సినిమాలో ఓ తాగుబోతుగా, తిరుగుబోతుగా చిత్రీకరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వర్మకుగాని, వాళ్ళ నాన్నకు గాని ప్రజల కోసం పోరాడి జైలుకు వెళ్ళిన చరిత్ర ఉందా అని ప్రశ్నించారు. కమ్యూనిస్టు జీవితాలను స్టడీ చేయకుండా ఇష్టానుసారంగా సినిమాలు తీస్తే శృంగభంగం తప్పదని హెచ్చరించారు. ప్రచారం కోసం తప్పడు పద్దతుల్లో సినిమాలు తీయడం సరైంది కాదని, వర్మ తన పద్దతి మార్చుకోవాలన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News