జ‌గ‌న్‌ - శిల్పాలు... నిజమైన సింహాలే!

Update: 2017-08-04 09:51 GMT
ఏపీ విప‌క్ష నేత‌, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీసుకున్న సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యం ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల‌నే కీల‌క మ‌లుపు తిప్ప‌నున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. 2014 ఎన్నిక‌ల్లో స్వల్ప తేడాతో ఓట‌మి పాలైన వైసీపీ ఇప్పుడు విప‌క్షంలో కూర్చుంది. ప్ర‌జ‌లిచ్చిన తీర్పును శిర‌సావ‌హించిన ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌... ప్ర‌తిప‌క్ష నేత‌గా త‌న‌దైన రీతిలో స‌త్తా చాటుతున్నారు. త‌న పార్టీకి చెందిన ఎమ్మెల్యేల‌ను బ‌లవంతంగా టీడీపీ లాగేసుకోగా... కాస్తంత ఇబ్బంది ప‌డ్డ జ‌గ‌న్‌... ఆ వెంట‌నే ఫిరాయింపుల నిరోధ‌క చ‌ట్టాన్ని అస్త్రంగా చేసుకుని అధికార ప‌క్షంపై ముప్పేట దాడి చేశారు. ద‌మ్ముంటే అనైతిక ప‌ద్ద‌తుల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీల‌తో రాజీనామా చేయించి ఉప ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాలని, ప్ర‌జా క్షేత్రంలోనే ఎవ‌రి ద‌మ్ము ఎంతో తేల్చుకుందామ‌ని ఆయ‌న విసిరిన స‌వాల్‌కు అధికార ప‌క్షం నుంచి సూటిగా స‌మాధానం వ‌చ్చిన దాఖ‌లానే క‌నిపించ లేదు.

ఈ క్ర‌మంలో నిన్న నంద్యాల‌లో నిర్వహించిన బ‌హిరంగ స‌భ‌లో జ‌గ‌న్... టీడీపీపైకి ఓ పాశుప‌తాస్త్రాన్నే విసిరార‌ని చెప్పాలి. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ కు ముందు మాజీ మంత్రి, నంద్యాల టీడీపీ నియోజ‌వ‌క‌ర్గ ఇన్ చార్జీ శిల్పా మోహ‌న్ రెడ్డి వైసీపీలో చేర‌గా, తాజాగా నిన్న‌టి స‌భ‌లో శిల్పా సోద‌రుడు, టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి ప్ర‌జా స‌మ‌క్షంలో రాజీనామా చేసి, రాజీనామా పత్రాన్ని జ‌గ‌న్ చేతిలో పెట్టారు. అంతేకాకుండా తాను త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేశానంటూ శాస‌న‌మండ‌లి చైర్మ‌న్ కార్యాల‌యానికి స‌మాచారం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా చ‌క్ర‌పాణి సాహ‌సోపేత నిర్ణ‌యం తీసుకున్నార‌ని, స‌చ్ఛీల రాజ‌కీయాల‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన చ‌క్ర‌పాణిరెడ్డిని పులి అందామా?  సింహం అందామా? అంటూ జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌కు జ‌నం నుంచి భారీ స్పంద‌నే ల‌భించింది. జ‌గ‌న్ వ్యాఖ్య‌లు విన్న స‌భ‌కు వ‌చ్చిన జ‌నం... ఈ నిర్ణ‌యంతో జ‌గ‌న్‌తో పాటు చ‌క్ర‌పాణి రెడ్డి కూడా నిజ‌మైన సింహాలేన‌ని కూడా చెప్పుకున్న వైనం ఆస‌క్తి క‌లిగించేదే.

ఈ ఒక్క దెబ్బ‌తో చ‌క్ర‌పాణి రూపంలో జ‌గ‌న్ టీడీపీకి కోలుకోలేని దెబ్బ కొట్టేశార‌నే చెప్పాలి. ఈ వ్య‌వ‌హారంపై ఇప్పుడు మాట మాత్రంగా స్పందించేందుకు కూడా టీడీపీ జంకుతోంద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. నేటి ఉద‌యం వెల‌గ‌పూడి స‌చివాల‌యం వేదిక‌గా టీడీపీ మంత్రులు, ఆ పార్టీ ఫైర్ బ్రాండ్‌గా పేరున్న ఎమ్మెల్సీ ప‌య్యావుల కేశ‌వ్ మీడియా స‌మావేశం పెట్టినా... చ‌క్ర‌పాణి రెడ్డి రాజీనామాపై స్పందించేందుకు సాహ‌సం చేయ‌లేక‌పోయారు. మీడియా మిత్రుల నుంచి దీనిపై ప్ర‌శ్న‌లు ఎదురైనా కూడా వారి నోరు పెగ‌ల‌లేద‌న్న వార్త‌లు కూడా క‌ల‌క‌ల‌మే రేపుతున్నాయి. అంటే... చ‌క్ర‌పాణి స్వ‌చ్ఛంద రాజీనామాతో జ‌గ‌న్ టీడీపీని పెద్ద దెబ్బే కొట్టేశార‌న్న మాట‌.

జ‌గ‌న్ తీసుకున్న ఈ సాహ‌సోపేత‌మైన నిర్ణయాన్ని వాపప‌క్షాలు ఆకాశానికెత్తేశాయి. సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి మ‌ధుతో పాటు సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ కూడా చ‌క్ర‌పాణి నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తూ ప్ర‌క‌ట‌న‌లు జారీ చేశారు. చ‌క్ర‌పాణి రాజీనామా స‌చ్ఛీల రాజ‌కీయాల‌కు నిద‌ర్శ‌నంగా నిలుస్తోందని, రాష్ట్రంలో నీతివంత‌మైన రాజ‌కీయాల‌కు ఈ నిర్ణ‌యం దోహ‌ద‌ప‌డుతోంద‌ని వారు అభిప్రాయ‌ప‌డ్డారు. సాధార‌ణంగా ఏ రాజ‌కీయ ప‌క్షం తీసుకునే నిర్ణ‌యాన్నైనా లోతుగా ప‌రిశీలించి విమ‌ర్శ‌లు గుప్పించే వామ‌ప‌క్షాల నేత‌లు... జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని కీర్తించ‌డ‌మంటే నిజంగానే ఆశ్చ‌ర్యం క‌లిగించ‌క మాన‌దు.
Tags:    

Similar News