ముంద‌స్తు రావ‌చ్చు..కామ్రేడ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Update: 2018-12-21 17:31 GMT
ఐదు రాష్ర్టాల్లో ఎన్నిక‌ల హ‌డావుడి స‌ద్దుమ‌ణుగుతున్న త‌రుణంలో సీనియ‌ర్ రాజ‌కీయ‌ వేత్త ఒక‌రు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ముంద‌స్తు ఎన్నిక‌లు రావ‌చ్చ‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అలా వ్యాఖ్యానించింది చిన్నా చిత‌క నేత కాదు...ఏకంగా జాతీయ పార్టీకి చెందిన ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి. విశాఖపట్నం వేదికగా డిసెంబ‌ర్ 19 నుంచి భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ సమితి సమావేశాలు మొద‌ల‌య్యాయి.21వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ సమావేశాల్లో... తాజాగా ప్రకటించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహించారు.

శుక్రవారం విశాఖ పాత జైల్ రోడ్ లో సీపీఐ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో జాతీయ కార్యదర్శులు ఎం రాజా - నారాయణ - కాంగో.. ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి.. రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. జాతీయ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ - సీపీఐ నేత నారాయణలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురవరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ... మరో మూడు నెలల్లో జాతీయ స్థాయిలో సాధారణ ఎన్నికలు రావచ్చు. అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. బీజేపీ వచ్చాక దళితులుపై దాడులు పెరిగాయి - మతకల్లోలాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. మేధావులు అవార్డులు వెనక్కు ఇస్తున్న సమయంలో వారిపై దాడులు చేస్తున్నారన్నారు. 'కర్నూలులో 300 మంది రైతులు మృతి చెందారు. విశాఖలో ప్రభుత్వ భూముల కుంభకోణం జరుగుతోంది. సీఎం చంద్రబాబు ప్రభుత్వ భూములు దోచుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని' సీపీఐ నేత నారాయణ అన్నారు. 

కాగా, సీపీఐ నేత నారాయణ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందని అన్నారు. రాఫెల్ కుంభకోణంపై సుప్రీంకోర్టు తీర్పును అడ్డుపెట్టుకున్న ప్రధాని మోడీని ప్రజలు విశ్వసించరన్నారు. ఇప్పటికే బ్యాంకులను - సీబీఐ - ఈడీ - ఎన్ ఫోర్స్ మెంట్ విభాగాలను దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. రాఫెల్ కుంభకోణంపై దాఖలైన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేయడాన్ని కేంద్రం తమకు అనుకూలంగా మలచుకోవడం దారుణం. ప్రజలు చెల్లించిన పన్నులతో కొనుగోలు చేసిన ప్రభుత్వం వారికి జవాబు దారీగా వ్యవహరించకపోవడం ఆశ్చర్యానికి గురుచేస్తోందన్నారు. జైళ్లను కూడా కేంద్ర ప్రభుత్వం తమ అనుచరుల కోసం స్టార్ హోటళ్లుగా మార్చారని నారాయణ విమర్శించారు.

దేశంలో మోడీకి వ్యతిరేకంగా 21 పార్టీలు ఏకమైన  నేపథ్యంలో.. తెలంగాణ ముఖ్యమంత్రి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించడం హస్యాస్పదమన్నారు. కేసీఆర్ ఫ్రంట్ పరోక్షంగా కేంద్రంలోని బీజేపీకి వత్తాసు పలకడానికే అని పేర్కొన్నారు. నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన కేటీఆర్ ఇకనైనా ప్రతిపక్షాలకు విలువనిచ్చి.. వారితో ప్రగతి భవన్ లో సమాలోచనలు చేసేందుకు చర్యలు చేపట్టాలని నారాయణ సూచించారు.
Tags:    

Similar News