కేసీఆర్ విమ‌ర్శ‌ను క‌సిగా తీసుకున్న విప‌క్షం

Update: 2016-12-30 22:30 GMT
సీపీఎం దిక్కుమాలిన పార్టీ అంటూ తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన విమ‌ర్శ నేప‌థ్యంలో తన ఆయుపట్టు అయినా శ్రామికశక్తిని పెంచుకునే దిశగా ఆ పార్టీ కసరత్తు చేస్తోంది. ఈ రూపంలో తన పూర్వవైభవం సాధ్యమని - కేసీఆర్ ను ఎదుర్కోవ‌డానికి సరైన వేదిక అని  భావిస్తున్నట్లు సమాచారం.  త్వ‌ర‌లో ఒక నిర‌స‌న‌కు కార్య‌రూపం ఇచ్చేందుకు ముందుకు సాగుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో ఇటు రైతులు - అటు శ్రామికుల‌ను భాగ‌స్వామ్యం చేసుకునే దిశ‌గా సీపీఎం క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లు చెప్తున్నారు.

ఒకప్పుడు ప్రభుత్వాలపై వైఖరిపై వామపక్షాలు గళం ఎత్తాయంటే అధికార పక్షానికి గుండెలో రైళ్లుపరిగెత్తేవి. ఈ వామపక్ష ఉద్యమాలు అధికార పీఠాలు కదిల్చే స్థాయి గత 15 ఏళ్ల కింద ఉండేది. కానీ 2004లో వైఎస్ అధికారంలోకి వచ్చాక వామపక్షాల బలం మరీ ముఖ్యంగా సీపీఎం పార్టీ బలహీనపడే పరిస్థితికి వచ్చింది. వామపక్ష పార్టీల అనుబంధ యూనియన్లను, వారి శక్తిని బల‌హీనం చేసేందుకు నాడు ముఖ్యమంత్రిగా ఉన్న వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ఆపరేషన్ లెఫ్ట్ కు శ్రీకారం చుట్టారు. వామపక్ష పార్టీలకు ఉన్న అనుబంధ సంఘాలకు ధీటుగా కాంగ్రెస్‌ పార్టీ తరపున వివిధ సంఘాల రూపకల్పనకు దిగారు. ఈ రూపకల్పనలో నాడు సీపీఎం నుంచి పీఆర్‌ పీలోకి ఆ తరువాత కాంగ్రెస్‌ లోకి వచ్చిన ఓ నేతతో మంతనాలు జరిపిన వై ఎస్  రాజ‌శేఖరరెడ్డి ఆపరేషన్ లెఫ్ట్ తో నేపథ్యంలో సీపీఎం అనుబంధ సంఘాలైన సీఐటీయుతో పాటు ఇతర ప్రజా సంఘాలు కొంత బలహీనపడ్డాయి. తాజాగా అదే రీతిలో కార్మిక వ‌ర్గం టార్గెట్ చేస్తూ కేసీఆర్ ముందుకు సాగుతున్నార‌ని అదే స‌మ‌యంలో విమ‌ర్శ‌లు చేయ‌డం ద్వారా సీపీఎంను బ‌ల‌హీన ప‌ర్చేందుకు ఆయ‌న స్కెచ్ వేస్తున్నార‌ని భావిస్తున్నారు.  దీంతో తన శక్తిని ఎక్కడో కోల్పోయిందో గుర్తించిన సీపీఎం నాయకత్వం దానిని తిరిగి సాధించుకొనేందుకు వీలుగా సమాలోచనలు చేస్తోంది. వివిధ పరిశ్రమలు - కంపెనీలలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలపై సీఐటీయు తరపున పోరాటాలు ఉధృతంచేయాలని ఆ పార్టీ యోచిస్తోంది. తద్వారా తనకు పూర్వం కార్మికులపై ఉన్న పట్టును నిలుపుకోవాలని ఆ పార్టీ సన్నాహాలు చేస్తోంది.

ఇదే తరుణంలో సీపీఎంకు అనుబంధంగా ఉన్న రైతు - రైతు కూలీ సంఘా లతోపాటు పైకి ఆ పార్టీకి అనుబంధంగా కనిపించని కుల వృత్తుల సంఘాలు - వివక్ష వ్యతిరేక పోరాట సంఘాలు ఉన్నాయి. ఆయా సంఘాల ద్వారా కూడా ఆయా వర్గాల ప్రజల పక్షాన పోరాడి - ఆ పోరాటాలు సీపీఎం నాయకత్వం వహించడం పార్టీ ప్రతిష్టను పెంపొందించాలని సమాలోచనలు చేస్తోంద‌ని స‌మాచారం. త్వ‌ర‌లో రుణ‌మాపీతో పాటు తెలంగాణ‌లో వివిధ ప‌రిశ్ర‌మ‌లు మూత‌ప‌డ‌టంతో న‌ష్ట‌పోయిన కార్మికులు - రైతులంద‌రినీ ఏకం చేసి త్వ‌ర‌లో ఉద్య‌మానికి శ్రీ‌కారం చుట్టాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News