జగన్ మాటకు ఎర్రన్నధీటైన రిప్లై

Update: 2022-02-10 11:30 GMT
కామ్రేడ్స్ ని నిబద్ధత కలిగిన వారుగానే అంతా చూస్తారు. వారు మంచిని మంచిగా చూస్తారు. పేదల పక్షాల పోరాడుతారు అని పేరు. అయితే రాను రానూ వారి ధోరణులలో మార్పు వస్తోంది అన్న విమర్శలు ఉన్నాయి. ఇక రెండుగా వామపక్షాలు చేలడంతో పాటు ఎన్నికల వేళ తాము నిరంతరం విమర్శలు చేస్తే బూర్జువా పార్టీలతో పొత్తు పెట్టుకుని పోటీ చేయడం వల్ల కూడా జనంలో మునుపటి విశ్వసనీయతను పొందలేకపోతున్నారు అని ఆరోపణలు ఉన్నాయి.

ఇక ఉపాధ్యాయ సంఘాల నిరసనల వెనక కామ్రేడ్స్ ఎర్ర జెండాలు ఉన్నాయని ఈ మధ్య జగన్ ఘాటు కామెంట్స్ చేశారు. అంతటితో ఆగకుండా ముందు ఎర్ర జెండా వెనక పచ్చ అజెండా అంటూ విమర్శించారు. చంద్రబాబు అనుకూల విధానాలు అనుసరించడానికి విపక్షాలు ఆరాటపడుతున్నాయి అన్నట్లుగా జగన్ చేసిన కామెంట్స్ ఉన్నాయి.

దీంతో సీపీఎం తాజాగా దీని మీద  గట్టిగా రియాక్ట్ అయింది. అంతే కాదు జగన్ మీద ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పి మధు మండిపడ్డారు. మేము టీడీపీతో అంటకాగడమేంటి అని గుస్సా అయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారందరినీ టీడీపీతో జత కట్టి నిందించడమేంటి అన్నారు. ముందు ఈ మాటలను జగన్ వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఎన్నికలకు ముందు టీడీపీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టులతో కలిపి కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, ఉపాధ్యాయులు, అంగన్ వాడీ, ఆశా వర్కర్లకు హామీ ఇస్తూ వైసీపీ  పోరాడిన సంగతిని మధు గుర్తు చేశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను జగన్ తప్పారని, ఇపుడు వాటిని అడిగితే విపక్షాన్ని బెదిరించడమేంటి అని కూడా మధు నిలదీశారు.

రివర్స్ పీయార్సీకి వ్యతిరేకంగా చలో విజయవాడ ఎంతటి విజయవంతం అయిందో జగన్ గుర్తించాలని కోరారు. ఇక పోరాటాలు చేస్తున్న వారి మీద పోలీసులతో జులుం చేయిస్తున్నారని అన్నారు. ఒక విధంగా చెప్పలీ అంటే జగన్ అచ్చం చంద్రబాబు బాటలో నడుస్తూ పాలన చేస్తున్నారని మధు గట్టి ఆరోపణ చేశారు.

కమ్యూనిస్టులు ఎపుడూ పోరాడే కార్మిక సంఘాలకు మద్దతుగా నిలుస్తాయని ఆయన అన్నారు. వైసీపీకి చిత్త శుద్ధి ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని, ప్రత్యేక హోదాను ఏపీకి సాధించాలని డిమాండ్ చేశారు. మొత్తానికి సీపీఎం కి చాలానే జగన్ కోపం తెప్పించారు అనుకోవాలి.

తమ మానాన తాము పోరాటం చేస్తూ ఉంటే టీడీపీతో కలపడం ఏంటి అన్నదే సీపీఎం ఆవేదన. పైగా సీపీఎం  ఎపుడూ టీడీపీకి తందానా అని ముందుకు సాగలేదు, అన్నీ తెలిసి కూడా జగన్ వామపక్షాలను ఒక గాటకు కట్టి విమర్శలు చేయడంతో మధు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు అంటున్నారు.

    
    
    

Tags:    

Similar News