పెన్‌ - వాచ్‌... ఆ ఎంపీని స‌స్పెండ్ చేసేశాయి!

Update: 2017-09-08 14:13 GMT
భార‌త క‌మ్యూనిస్టు పార్టీ (మార్స్కిస్టు)... మ‌నమంతా సింపుల్‌గా సీపీఎం అని పిలుచుకునే లెఫ్ట్ పార్టీలో నియ‌మ నిబంధ‌న‌లు చాలానే ఉన్నాయి. ఆ పార్టీ నేత‌లుగా ఉన్న వారు చ‌ట్ట‌స‌భ‌ల‌కు ఎన్నికైనా... సామాన్య జీవితం గ‌డ‌పాల్సిందే. చ‌ట్ట‌స‌భ స‌భ్యులుగా నెల‌కు ల‌క్ష‌కు పైగానే  అందే వేత‌నాల‌తో ల‌గ్జ‌రీ లైఫ్ సాగిస్తామంటే కుదర‌దంటే కుద‌ర‌దు. అయినా ఈ విష‌యంలో ఆ పార్టీ సిద్ధాంతాలేమిట‌న్న విషయాన్ని ఓ సారి ప‌రిశీలిస్తే.. పార్టీ నేత‌లుగా ఉన్న వారికి పార్టీనే నెల‌కు ఇంత అని వేత‌నం ఇస్తుంది. చ‌ట్ట‌స‌భలో స‌భ్యులుగా ఉన్న వారితో పాటు బ‌య‌ట పార్టీ త‌ర‌ఫున పోరాటం చేస్తున్న వారికి కూడా ఈ వేత‌నాలు అందుతాయి. పార్టీలో ఆయా స్థాయిల‌ను బ‌ట్టి ఈ వేత‌నాలు ఉంటాయి. వేత‌నాలు అంటే... ఏ కార్పొరేట్ స్థాయి వేత‌నాలంటే మ‌నం త‌ప్పులో కాలేసిన‌ట్లే. ఎందుకంటే... సీపీఎం నేత‌ల‌కు ఆ పార్టీ నుంచి అందే వేత‌నాల‌తో ఓ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం త‌ర‌హాలో జీవ‌నం సాగించ‌డం కూడా సాధ్యం కాదు.

మొన్న‌టిదాకా సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శిగా ఉన్న బీవీ రాఘ‌వులు తెలుసు క‌దా. ఇప్పుడు ఆయ‌న పార్టీ కేంద్ర కార్య‌వ‌ర్గంలోకి వెళ్లిపోయారు. పార్టీలో యువ నేత‌గా ఉన్న‌ప్ప‌టి నుంచి పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి స్థాయిలో ఉన్నా కూడా రాఘ‌వులు ఒకే లుక్‌లో క‌నిపించారు. అదే సాధార‌ణ లుక్‌. పార్టీలో ఏ హోదా వ‌చ్చినా కూడా రాఘ‌వులు లుక్ మార‌లేదు. ఇక ఆ పార్టీ త‌ర‌ఫున చ‌ట్ట‌స‌భ‌ల‌కు ఎన్నిక‌వుతున్న నేత‌ల‌కు ల‌క్ష‌ల్లో వేత‌నం వ‌స్తుంది క‌దా అంటే... ఆ వేతనాన్ని పార్టీ ఖాతాలో జ‌మ చేసి... పార్టీ ఇచ్చే వేత‌నంతోనే జీవనం సాగించాలి. దీనికి నిలువెత్తు నిద‌ర్శ‌నంగా సీపీఎం త‌ర‌ఫున చ‌ట్ట‌స‌భ‌ల‌కు ఎన్నికైన నేత‌లంద‌రూ నిలిచారు. స‌రే మ‌రి ఇప్పుడు ఈ ప్ర‌స్తావ‌న ఎందుకంటే... సింపుల్‌గానే జీవించాల‌న్న పార్టీ నిబంధ‌న‌ల‌ను తోసిరాజ‌ని కాస్తంత ల‌గ్జ‌రీగా క‌నిపించిన సొంత పార్టీ ఎంపీని సీపీఎం ఏకంగా బ‌హిష్క‌రించేసింది.

పార్టీ నుంచి మూడు నెల‌ల పాటు బ‌హిష్క‌ర‌ణ వేటు ప‌డిన స‌ద‌రు సీపీఎం ఎంపీ ఎవ‌రంటే... ప‌శ్చిమ బెంగాల్‌కు చెందిన రాజ్య‌స‌భ స‌భ్యుడు రిత‌బ్ర‌త బెన‌ర్జీ. అయినా రిత‌బ్ర‌త ఏం చేశార‌న్న విష‌యానికి వ‌స్తే.. సీపీఎం విద్యార్థి విభాగం ఎస్ఎఫ్ఐకి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌నిచేసిన రిత‌బ్ర‌త‌... కొంత‌కాలం క్రితం రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. ఇంకా యుక్త వ‌య‌సులోనే ఉన్న 38 ఏళ్ల రిత‌బ్ర‌త‌..  ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో రితబ్రత బెనర్జీ సోషల్ మీడియాలో ఒక ఫోటోను అప్‌లోడ్ చేశారు. ఈ ఫోటోలో ఆయన ధరించిన పెన్ - వాచ్ ‌పై  పార్టీ కార్యకర్త ఒకరు అభ్యంతరాలను లేవనెత్తాడు. దీంతో ఈ విషయం సీపీఎం‌కు ఇబ్బందిగా మారింది. ప్రవర్తనను మార్చుకోవాలని పార్టీ కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీలు రితబ్రత బెనర్జీకి సూచించాయి. ప్రవర్తనలో మార్పు రాని కారణంగా ఆయనను పార్టీ నుండి మూడు మాసాల పాటు సస్పెండ్ చేస్తూ సీపీఎం కాస్తంత క‌ఠిన‌మైన‌ నిర్ణయం తీసుకొంది. మ‌రి ఈ వివాదం నుంచి రిత‌బ్ర‌త ఎలా బ‌య‌ట‌ప‌డ‌తారో చూడాలి.
Tags:    

Similar News