హైదరాబాద్ సమీపానికి అమరావతి..?

Update: 2015-09-23 05:15 GMT
ఏపీ రాష్ట్ర రాజధాని.. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు దగ్గరగా వచ్చేస్తుందా? హైదరాబాద్ పొలిమేరల వరకూ అమరావతి విస్తరించనుందా? అంటే అవునన్న సమాధానం వినిపిస్తోంది.  ఏపీ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే.. హైదరాబాద్ సమీపానికి అమరావతి నగర విస్తరణ సాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

మొదట ఏపీ రాజధానిగా అమరావతి కింద ఎంపిక చేసిన మండలాల్లో మార్పులు.. రోజురోజుకీ జత కలుస్తున్న మండలాల సంఖ్యే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. తాజాగా.. ఏపీ రాజధాని విస్తీర్ణాన్ని పెంచుతూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకోవటం గమనార్హం. ఏపీ రాజధానికి సంబంధించి సీఆర్ డీఏ  పరిధిని విస్తరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటివరకూ ఉన్న 7068.20 చదరపు కిలోమీటర్ల నుంచి మరో 1284.49 చదరపు కిలోమీటర్ల వరకూ విస్తరిస్తూ నిర్ణయం తీసుకోవటంతో తెలంగాణ సరిహద్దులకు అత్యంత సమీపానికి ఏపీ రాజధాని వచ్చేసినట్లయింది. అంతేకాదు.. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు దాదాపుగా దగ్గర్లోకి వచ్చేయటం మరో విశేషంగా చెప్పాలి. తాజా నిర్ణయంతో ఏపీ రాజధాని అమరావతి మొత్తం విస్తీర్ణం 8352.69 చదరపు కిలోమీటర్లుగా మారినట్లైంది.

తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దు ప్రాంతాలుగా ఉండే కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పట్టణంతో సహా మండలంలోని 24 గ్రామాలతో పాటు పలు మండలాలు తాజాగా సీఆర్డీఏలోకి వచ్చేశాయి. అదే సమయంలో గతంలో సీఆర్ డీఏ పరిధిలో చేర్చిన కొన్ని గ్రామాల్ని తొలగిస్తూ నిర్ణయం తీసుకోవటం విశేషం. ఓ పక్క విస్తరిస్తూనే.. మరోపక్క రాజధాని ప్రాంతం నుంచి కొన్ని గ్రామాల్ని తొలగిస్తూ నిర్ణయం తీసుకోవటం చూస్తే.. రాజధాని ప్రాంతంలో భూముల సమీకరణలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న ప్రాంతాల్ని తొలగించినట్లుగా తెలుస్తోంది. కృష్ణా జిల్లాలో జగ్గయ్యపేట పట్టణంతో సహా మొత్తం 123 గ్రామాలు చేరాయి. ఇక.. గుంటూరు జిల్లాలో 30 గ్రామాలు కొత్తగా చేరాయి. అదే సమయంలో మరికొన్ని గ్రామాల్ని సీఆర్ డీఏ పరిధి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

సీఆర్ డీఏలో కొత్తగా చేరిన మండలాలు జిల్లాల వారీగా చూస్తే.. కృష్ణా జిల్లాలో..

జగ్గయ్య పేట మండలంలో 24 గ్రామాలు

వత్సవాయి మండలంలో 26గ్రామాలు

పెనుగ్రంచిపోలు మండలంలో 12 గ్రామాలు

మైలవరం మండలంలో 4 గ్రామాలు

నూజివీడు మండలంలో 2 గ్రామాలు

బాపులపాడు మండలంలో 3 గ్రామాలు

మువ్వ మండలంలో 7 గ్రామాలు

ఘంటసాల మండలంలో 9 గ్రామాలు

చల్లపల్లి మండలంలోని 2 గ్రామాలు

మోపిదేవి మండలంలో 7 గ్రామాలు

పామార్రు మండలంలో 10 గ్రామాలు

నందివాడ మండలంలో 10 గ్రామాలు

గుడివాడ మండలంలో 6 గ్రామాలు

నందిగామ మండలంలో 1 గ్రామం

గుంటూరు జిల్లాలో..

అచ్చంపేట మండలంలో 6 గ్రామాలు

క్రోసూరు మండలంలో 5 గ్రామాలు

సత్తెనపల్లి మండలంలో 2 గ్రామాలు

ఫిరంగిపురం మండలంలో 3 గ్రామాలు

యడ్లపాడు మండలంలో 2 గ్రామాలు

పత్తిపాడు మండలంలో 1 గ్రామం

పొన్నూరు మండలంలో 3 గ్రామాలు

భట్టిప్రోలు మండలంలో 8 గ్రామాలు

తొలగించిన గ్రామాలు మండలాలు జిల్లాల వారీగా చూస్తే.. కృష్ణా జిల్లాలో..

గుడ్లవల్లేరు మండలంలో 6 గ్రామాలు

గుంటూరు జిల్లాలో..

పెదనందిపాడు మండలంలో 1 గ్రామం

నాదెండ్ల మండలంలో 1 గ్రామం

ముప్పాళ్ల మండలం నుంచి 1 గ్రామం
Tags:    

Similar News