రేప్‌కు పాల్పడ్డ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ను బహిష్కరించిన ఆ దేశ క్రికెట్‌ బోర్డు!

Update: 2022-11-08 02:30 GMT
యువతిని అత్యాచారం చేసిన కేసులో అరెస్టు అయిన శ్రీలంక క్రికెటర్‌ ధనుష్క గుణతిలకను అన్ని ఫార్మాట్‌ల నుంచి బహిష్కరిస్తూ శ్రీలంక క్రికెట్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వరల్డ్‌ కప్‌ టీ20 సెమీస్‌కు చేరకుండానే శ్రీలంక నిష్క్రమించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాను విడిచిపెట్టి స్వదేశానికి వెళ్లిపోయింది. యువతికి అత్యాచారానికి పాల్పడ్డ ధనుష్క గుణతిలకను వన్డే, టీ20, టెస్టు క్రికెట్‌ ఇలా అన్ని ఫార్మాట్‌ల నుంచి బహిష్కరిస్తున్నట్టు శ్రీలంక క్రికెట్‌ బోర్డు ప్రకటించింది.

మరోవైపు అత్యాచారం కేసులో అరెస్టైన శ్రీలంక క్రికెటర్‌ ధనుష్క గుణతిలకకు ఆస్ట్రేలియాలోని సిడ్నీ కోర్టులో చుక్కెదురైంది. అతనికి కోర్టు బెయిల్‌ నిరాకరించింది. అయితే బెయిల్‌ కోసం గుణతిలక్‌ ఇప్పుడు మరోసారి న్యూ సౌత్‌ వేల్స్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. ఒకవేళ ఇక్కడ కూడా అతనికి బెయిల్‌ రాకపోతే అతడికి చిక్కులు తప్పవని తెలుస్తోంది.

ఎందుకంటే ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం రేపిస్టులకు జీవిత ఖైదును శిక్షగా విధిస్తారు. ఈనేపథ్యంలో ధనుష్కకు కూడా జీవిత ఖైదు విధించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. కాగా మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో ధనుష్కను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డేటింగ్‌ యాప్‌లో పరిచయమైన ఓ యువతి హోటల్‌ రూమ్‌కు రాగా ఆమెపై ధనుష్క  నవంబర్‌ 2న అత్యాచారం చేశాడు. దీంతో అతడిని అరెస్టు చేశారు.

కాగా 2015లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టిన ధనుష్క ఇప్పటివరకు 8 టెస్ట్, 47 వన్డే, 46 టీ20 ఆడాడు. అయితే ఆటతోనే కాకుండా వివాదాలతోనూ వార్తల్లో నిలిచాడు. 2018లో గుణతిలక్‌ తన ఫ్రెండ్‌తో కలిసి ఓ నార్వేజియన్‌ మహిళపై అత్యాచారయత్నం చేశాడని అభియోగాలు వచ్చాయి. దీంతో శ్రీలంక క్రికెట్‌ బోర్డు అతనిపై 6 మ్యాచ్‌ల సస్పెన్షన్‌ విధించింది. అయినా బుద్ధి మార్చుకోని ధనుష్క తాజాగా యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఆస్ట్రేలియాలో తమ పరువు తీసిన ధనుష్క వ్యవహారంపై శ్రీలంక క్రికెట్‌ బోర్డు కూడా ఆగ్రహంతో ఉంది. ఆస్ట్రేలియా పోలీసుల విచారణకు తాము అన్ని విధాలా సహకరిస్తామని ఇప్పటికే శ్రీలంక క్రికెట్‌ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అన్ని రకాల క్రికెట్‌ ఫార్మాట్ల నుంచి అతనిని బహిష్కరిస్తున్నట్లు శ్రీలంక బోర్డు తెలిపింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News