టాంప‌రింగ్ భాగోతాన్ని బ‌ద్ధ‌లు చేసింది ఇత‌డే

Update: 2018-03-27 06:35 GMT
క్రికెట్ క్రీడాభిమానుల మ‌ధ్య హాట్ హాట్ చ‌ర్చంతా ఆసీస్ బాల్ టాంప‌రింగ్ గురించే. గ‌తంలోనూ టాంప‌రింగ్ ఆరోప‌ణ‌లు వెల్లువెత్తినా.. ఈసారి దొరికినంత ప‌క్కాగా గ‌తంలో ఎప్పుడు దొర‌క‌లేదు. టాంప‌రింగ్ చేస్తున్న భాగోతం ఎలా బ‌య‌ట‌కు వ‌చ్చింది?  ఎవ‌రు గుర్తించారు?  దాన్ని షూట్ చేసినోడు ఎవ‌రు? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం వెతికితే.. ఆస‌క్తిక‌ర అంశాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి.

బంతి ఆకారాన్ని మార్చేందుకు ప‌సుపుప‌చ్చ రంగు చిన్న టేపును ఉప‌యోగించిన వైనాన్ని త‌న కెమేరా క‌న్నుతో ఒడుపుగా ప‌ట్టుకున్న కెమేరామ‌న్ ప‌నితీరుతోనే టాంప‌రింగ్ భాగోతం బ‌ద్ధ‌లైంది. దీన్ని చిత్రీక‌రించిన కెమేరా మెన్ పేరు ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా మారుమోగుతోంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఈ కెమేరా మాన్ గ‌తంలో క్రిక‌ట‌ర్ కావ‌టం. క్రిక‌ట‌ర్ కాస్తా.. కెమేరామ‌న్ కావ‌టం వెనుక జ‌ర్నీ చూస్తే ఆస‌క్తిక‌రంగా అనిపించ‌క మాన‌దు.

ఇంత‌కీ అత‌గాడి పేరేమంటే.. జొటాని అస్కార్‌. ఇత‌డిది ద‌క్షిణాఫ్రికా. క్రికెట‌ర్ గా ఉన్న అత‌ను త‌ర్వాతి కాలంలో ఒక టీవీ ఛాన‌ల్ లో ప‌ని చేసేవాడు. 2007-08 లో కివీస్ జ‌ట్టు సౌతాఫ్రికాలో ప‌ర్య‌టించింది. ఆ సంద‌ర్భంగా ఒక టెస్ట్ మ్యాచ్ ను క‌వ‌ర్ చేయాల్సిన కెమేరామ‌న్ కు అనుకోని రీతిలో అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దీంతో.. అత‌ని స్థానంలో మ‌రొక‌రిని పంపాల్సి వ‌చ్చింది.

ఈ సంద‌ర్భంగా అస్కార్ ను క‌వ‌ర్ చేయాల్సిందిగా చానెల్ టెక్నిక‌ల్ హెడ్ సూచించారు. దీంతో.. సూటు.. బూటు.. టై క‌ట్టుకొని బౌండ‌రీ లైన్ వ‌ద్ద కెమేరా మ‌న్ బాధ్య‌త‌ల్ని నిర్వ‌ర్తించారు. అత‌గాడి సూటు.బూటు వ్య‌వ‌హారం చూసి చాలామంది ఎగ‌తాళి చేసే వారు. కానీ.. అస్కార్ ది మ‌రోలాంటి స‌మ‌స్య‌. అత‌డి శ‌రీరం సూర్య‌కిర‌ణాల్ని త‌ట్టుకోలేదు. ఎండ ఒంటి మీద ప‌డితే అత‌ను అస్వ‌స్థ‌కు గురి అవుతాడు. అందుకే.. శ‌రీరం మొత్తాన్ని క‌ప్పేసేలా కోటు వేసుకుంటాడు. ఇది తెలియ‌ని వారు అత‌న్ని గేలి చేస్తుంటారు.

తాజా టాంప‌రింగ్ వ్య‌వ‌హారాన్ని ఎలా బ్రేక్ చేశాడ‌న్న విష‌యంలోకి వెళితే.. ఇది చాలా అనూహ్యంగా జ‌రిగింద‌ని చెబుతారు. మూడో టెస్ట్ లో ఆస్ట్రేలియా ఏదో చేస్తుంద‌న్న సందేహం సౌతాఫ్రికా మాజీ క్రికెట‌ర్.. ప్ర‌స్తుతం కామెంటేట‌ర్ గా ప‌ని చేస్తున్న డిలిల్లీర్స్ కు వ‌చ్చింది. అంతే.. అత‌ను అస్కార్ ను అప్ర‌మ‌త్తం చేశాడు. శ‌నివారం మూడో రోజు ఆట‌లో అస్కార్ ఎంతో అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించి.. 90 నిమిషాల పాటు ఏకబిగిన ఆసీస్ క్రికెట‌ర్ల ప్ర‌తి క‌దలిక‌నూ రికార్డు చేశాడు. అలా చేసే స‌మ‌యంలో బాన్ క్రాఫ్ట్ దొరికిపోయాడు. అస్కార్ ప‌నిత‌నం మీద ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. అత‌డికి అస్కార్ ఇవ్వాల‌ని కొంద‌రు అంటుంటే.. మ‌రికొంద‌రు మాత్రం క్రికెట‌ర్ల‌కు కోత వేసిన మ్యాచ్ ఫీజు మొత్తాన్ని అత‌నికి ఇవ్వాలంటున్నారు. మ‌రి.. ఇంత పెద్ద దుర్మార్గాన్ని బ్రేక్ చేసిన వాడికి ఆ మాత్రం ఇవ్వ‌టం ధ‌ర్మ‌మే.
Tags:    

Similar News