షంషేర్ షమీ.. తన దమ్ము చూపాడు

Update: 2022-03-01 16:30 GMT
మొహమ్మద్ షమీ.. టీమిండియా ప్రధాన పేసర్. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వికెట్లు తీయగల బౌలర్. మరో పేసర్ జస్ర్పీత్ బుమ్రా కు సరిజోడు. ఒకవిధంగా చెప్పాలంటే బుమ్రాకు తగిన రేసుగుర్రం. ఆ మాటకొస్తే కొన్నిసార్లు బుమ్రా అయినా తడబడతాడేమో కానీ, షమీకి మాత్రం అలుపుండదు.

అప్పుడప్పుడు పరుగులు జారవిడిచినా.. అదంతా పరిస్థితుల రీత్యానే. మొత్తానికి తిరిగి బ్యాలెన్స్ చేయగల సమర్థుడు షమీ. తన తొలి మ్యాచ్ ల్లోనే అదరగొట్టాడీ బౌలర్. 9-4-23-1 ఇవీ షమీ తొలి వన్డే గణాంకాలు. తన కోటా ఇంకో ఓవర్ ఉండగా.. ఏకంగా నాలుగు మొయిడెన్లు ఉన్నాయి ఇందులో. 17-2-71-4... ఇవీ షమీ తొలి టెస్టు గణాంకాలు. ఎలాంటి బౌలర్ అయినా కోరుకునే డెబ్యూ ఇది.

అందుకే షమీ టీమిండియా స్ట్రయిక్ బౌలర్ గా ఎదిగాడు. కుటుంబ తగాదాలో చిక్కుకునిమరోవైపు షమీ మధ్యలో కొంత కాలం ఫామ్ లేమితో బాధపడ్డాడు. ప్రతి క్రికెటర్ కు ఎదురయ్యే పరిస్థితినే అతడూ అనుభవించాడు. అదే సమయంలో వ్యక్తిగత జీవితంలో ఐదేళ్ల క్రితం అతడు తీవ్ర ఒడిదొడుకులకు గురయ్యాడు. ప్రేమించి పెళ్లాడిన మోడల్- హసీన్ జహాన్ కారణంగా షమీ జీవితం అల్లకల్లోలానికి గురైంది. వీరి వివాహం 2014లో జరగ్గా నాలుగేళ్లు కూడా ఆ సంసారం నిలవలేదు. జహాన్.. షమీ పై కేసు పెట్టడం మరింత సంచలనమైంది.

అంతేకాక షమీ అన్న, కుటుంబంపై జహాన్ తీవ్ర ఆరోపణలకు దిగింది. అయితే, వీరిద్దరూ ప్రస్తుతం విడిగా ఉంటున్నా విడాకులు మాత్రం తీసుకోలేదు. కాగా, వీరికి ఒక కుమార్తె ఉంది. మొత్తానికి ఈ కేసుల నుంచి ఎలాగో బయట పడిన షమీ.. ఈ వెంటనే టీమిండియాలోకి పునరాగమనం చేశాడు. టెస్టులకే పనికొస్తాడనుకున్న అతడు వన్డేలు, టి20ల్లోనూ చోటు స్థిరం చేసుకున్నాడు. కాకపోతే ఐపీఎల్ లోనూ పూర్తి స్థాయిలో పాల్గొంటున్న షమీకి కొంత విశ్రాంతి ఇవ్వాలన్న ఉద్దేశంలో జట్టు మేనేజ్ మెంట్ అతడిని ఎక్కువగా టెస్టులకే పరిగణనలోకి తీసుకుంటోంది. వీలునుబట్టి వన్డేలు, ప్రపంచ కప్ లాంటి టోర్నీలుంటే టి20లు ఆడిస్తోంది.

పాకిస్థాన్ అభిమానిపైకి దూసుకెళ్లి..
భారత్- పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే ఉండే హై ఓల్టేజే వేరు. దీనికితగ్గట్టే గతంలో ఓ మ్యాచ్ లో పాక్ చేతిలో ఓడి భారత జట్ట పెవిలియన్ కు తిరిగొస్తుండగా.. పెవిలియన్ సమీపంలో ఉన్న ఆ దేశ అభిమాని ఒకరు ''బాప్ కౌన్ హై '' (రెండు జట్లను బాప్ ఔర్ బేటా గా అభివర్ణించే సంగతి తెలిసిందే) అన్న మాటలు షమీ కి తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. అతడి పైకి దూసుకెళ్లి కొట్టినంత పని చేశాడు. సహచర ఆటగాళ్లు అడ్డుకోవడంతో ఆగిపోయాడు. దేశం అంటే షమీకి అంత అభిమానం.

కాకపోతే.. అతడి నేపథ్యం రీత్యా అది పదేపదే సందేహాస్పదం అవుతుంటుంది. ఇలాంటి అనుభవమే మూడు నెలల క్రితం జరిగిన టి20 ప్రపంచకప్ మ్యాచ్ లో పాక్ పై భారత్ ఓటమి అనంతరం ఎదురైంది. ఆ మ్యాచ్ లో షమీ ప్రదర్శన బాగోలేకపోవడంతో పాటు టీమిండియా ఓటమి పాలవడం అదికూడా ప్రపంచ కప్ లో తొలిసారిగా దాయాది చేతిలో ఓటమిని ఎదుర్కొనడంతో షమీ టార్గెట్ అయ్యాడు. చిరకాల ప్రత్యర్థి చేతిలో ఓటమి అనంతరం షమీ మీద ఆన్‌లైన్‌లో తీవ్ర దాడి జరిగింది. ఆ సమయంలో కెప్టెన్ కోహ్లి సహా జట్టంతా అతడికి మద్దతుగా నిలిచి గొప్ప సంఘీభావం చాటింది.

దేశం కోసమే పోరాడతాం.. వారిని పట్టించుకోం తాజాగా నాటి వివాదంపై షమీ స్పందించాడు. తనను విమర్శించిన వారు అసలు అభిమానులే కాదన్నాడు. వారు నిజమైన భారతీయులు కూడా కాదని ధైర్యంగా చెప్పాడు. దీంతో ఇప్పడు అందరూ షంషేర్ షమీ అంటున్నారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ షమీ ఈ జవాబిచ్చాడు. తనపై వచ్చిన విమర్శలను ఏమాత్రం పట్టించుకోనని చెప్పాడు. ఒక ఆటగాడిగా తానేంటో తనకు తెలుసని చెప్పాడు.

'సామాజిక మాధ్యమాల్లో గుర్తు తెలియని వ్యక్తులు లేదా అతి తక్కువ మంది ఫాలోవర్లు ఉన్న వాళ్లు.. ఇతరులపై విమర్శలు చేస్తే మాకు పోయేదేమీ లేదు. అలాంటి వారిని అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మేమేంటో మాకు తెలుసు. మాకు దేశం అంటే ఎంత గొప్పో తెలియజేయాల్సిన అవసరం లేదు.

మేం దేశాన్ని గౌరవిస్తాం. దేశం కోసమే పోరాడతాం. అలాంటప్పుడు ఆ విమర్శలకు స్పందించి లేదా వారికి సమాధానం ఇచ్చి మా అంకితభావాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు' అని షమి వివరించాడు. కాగా, షమి ప్రస్తుతం మణికట్టు గాయంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల జట్టుకు దూరమయ్యాడు.
Tags:    

Similar News