క్రిమినల్స్ పై మోజు పెంచుకుంటున్న ఓటర్లు

Update: 2022-03-06 23:30 GMT
దేశంలోని అటు కేంద్ర కేబినెట్‌లోను, ఇటు రాష్ట్రాల కేబినెట్‌ల‌లోను.. మ‌రో వైపు పార్ల‌మెంటు, అసెంబ్లీల్లో నూ ఇప్పుడు క్రిమిన‌ల్ నేరాలు ఎదుర్కొన్న వారే చ‌ట్ట‌స‌భ‌ల స‌భ్యులుగా ఎక్కువ మంది ఉన్నారు. ప్ర‌స్తుతం వీరి సంఖ్య‌.. దేశ‌వ్యాప్తంగా 44 శాతం ఉన్న‌ట్టు ఎన్నిక‌ల అఫిడ‌విట్‌ల‌లో ఆయా నేత‌లు చెబుతున్న కేసుల సంఖ్య‌ను బ‌ట్టి స్ప‌ష్ట‌మ‌వుతోంది.

అయితే.. ఈ త‌ర‌హా ప‌రిస్థితి ఎప్పుడు త‌గ్గుతుంది?  నేర‌చ‌రితులు, క్రిమిన‌ల్ నేరాలు, రేప్ కేసుల్లో ఉన్న‌వారు చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్ల‌కుండా అడ్డుకోలేమా? అనేది పెద్ద ఎత్తున దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ సాగుతోంది. మేధావులు, ప్ర‌జాస్వామ్య వాదులు.. ఇలాంటి పోక‌డ‌ల‌ను తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు.

అయితే.. ఇప్పుడున్న ప‌రిస్థితి త‌గ్గుతుందో లేదో .. తెలియ‌దు కానీ, మ‌రింత పెచ్చుమీర‌డం మాత్రం ఖాయ మ‌ని అంటున్నారు.. ఈశాన్య రాష్ట్రం త్రిపుర‌కు డీజీపీగా ప‌నిచేసి రిటైరైన బీఎల్ వోహ్రా! అనేక స‌ర్వేలు.. ఎన్నిక‌ల అఫిడ‌విట్‌ల‌ను ప‌రిశీలించిన ఆయ‌న భ‌విష్య‌త్ భార‌తం ఎలా ఉంటుందో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు వివ‌రిం చారు.

ఆయ‌న చెప్పిన లెక్క‌ల ప్ర‌కారం.. 2050 నాటికి ప్ర‌పంచానికే ఆద‌ర్శంగా ఉంటుంద‌ని భావిస్తున్న మ‌న దేశంలో ఒక‌క‌ర‌డు గ‌ట్టిన క్రిమిన‌ల్‌, మాఫియా డాన్ ప్ర‌ధానిగా ఉంటార‌ని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. ఈ ప్ర‌ధాని నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌లో ఏకంగా.. స‌గానికిపైగానే నేర చ‌రితులు.. మంత్రులుగా చ‌క్రాలు తిప్పుతార‌ని కూడా చెబుతున్నారు.

దీనికి సంబంధించి కొన్ని మౌలిక విష‌యాలు.. అందుబాటులో ఉన్న నేర‌చ‌రితుల లెక్క‌ల‌ను వోహ్రా ప్ర‌స్తావించారు. ప్ర‌స్తుతం ఉన్న‌పార్ల‌మెంటును తీసుకుంటే.. మొత్తం స‌భ్యుల సంఖ్య 539. వీరంతా గ‌త 2019 ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు.

అయితే.. వీరిలో 233 మంది పార్ల‌మెంటు స‌భ్యులు(44 శాతం)పై క్రిమిన‌ల్ కేసులు ఉన్నాయి. ఇది వారికి వారే ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో ప్ర‌క‌టించుకున్న సంఖ్య‌. 2014తో పోల్చుకుంటే.. పార్ల‌మెంటుకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న క్రిమిన‌ల్స్ సంఖ్య 26 శాతం అనూహ్యంగా పెరిగిపోయింది.

ఇక్కడ మ‌రో కీల‌క విష‌యాన్ని కూడా వోహ్రా ప్ర‌స్తావించారు. కేర‌ళ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఒక ఎంపీ త‌న‌పై ఏకంగా 204 క్రిమిన‌ల్ కేసులు ఉన్నాయ‌ని అఫిడ‌విట్‌లో పేర్కొన్నారు. అదేవిధంగా 2019లో విజ‌యం ద‌క్కించుకున్న‌ 159(29శాతం) మంది ఎంపీలు.. స‌మ‌ర్పించిన అఫిడ‌విట్ల‌ను ప‌రిశీలిస్తే.. వీరిపై అత్యంత తీవ్ర‌మైన క్రిమిన‌ల్ కేసులు ఉండ‌డం గ‌మ‌నార్హం. వీటిలో అత్యాచారం, హ‌త్య‌, హ‌త్యాయ‌త్నం, కిడ్నాప్‌, మ‌హిళ‌ల ప‌ట్ల లైంగిక వేధింపులు వంటివి తీవ్ర‌మైన కేసులు ఉన్నాయి.

ఇక‌, పార్ల‌మెంటు ప‌రిస్థితి ఇలా ఉంటే.. రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ దీనికి భిన్న‌మైన ప‌రిస్థితులు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఉదాహ‌ర‌ణ‌కు.. అసోసియేష‌న్ ఫ‌ర్ డెమొక్క‌టిక్ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌) స‌ర్వే ప్ర‌కారం.. అస్సాం, కేర‌ళ‌, త‌మిళ‌నాడు, పుదుచ్చేరి, ప‌శ్చిమ బెంగాల్‌ల‌లో ఏర్పిన కొత్త ప్ర‌భుత్వాల్లో స‌గానికిపైగా ఎమ్మెల్యేల‌పై అత్యంత తీవ్ర‌మైన కేసులు ఉన్నాయి.

2020, సెప్టెంబరులో ఒక కేసు విచార‌ణ సంద‌ర్భంగా దేశ అత్యున్న‌త న్యాయస్థానం సుప్రీం కోర్టు.. ఒక సంచ‌ల‌న విష‌యాన్ని వెల్ల‌డించింది. 22 రాష్ట్రాల నుంచి ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేల్లో 2556 మందిపై క్రిమిన‌ల్ కేసులు ఉన్నాయ‌ని తెలిపింది. అయితే.. వీరిలో మాజీల‌ను కూడా క‌లుపుకొంటే.. ఈ సంఖ్య 4,422కు చేరింది.

ప్ర‌స్తుతం ఉన్న నేర‌చ‌రితుల సంఖ్య 44 శాతాన్ని 1970ల నుంచి గ‌డిచిన 50 ఏళ్ల‌కు విభాజ‌నం చేస్తే.. స‌రాస‌రిన ప్ర‌తి ప‌దేళ్ల‌కు 8.8 శాతం చొప్పున క‌ళంకిత నేత‌లు పెరుగుతున్నారు. ఈ లెక్క‌న 2050 నాటికి వీరి సంఖ్య 70.4 శాతానికి చేరే అవ‌కాశం ఖ‌చ్చితంగా క‌నిపిస్తోంది. వాస్త‌వానికి 2014 నుంచి 2019 వ‌ర‌కు చూసుకుంటే.. ఈ ఐదేళ్ల కాలంలోనే ఏకంగా 26 శాతం మంది నేర చ‌రితులు పెర‌గ‌డం.. గ‌మ‌నార్హం. అని వోహ్రా పేర్కొన్నారు.   దీనిని బ‌ట్టి 2050 నాటికి ఈ దేశానికి క‌ళంకితులే సార‌థ్యం వ‌హించ‌నున్నార‌నేది వోహ్రా ఆందోళ‌న‌, ఆవేద‌న‌!!
------------------------------
నేర నేత‌లు పెరుగుతున్న విధం ఇదీ..
ఎన్నిక‌లు జ‌రిగిన సంవ‌త్స‌రం                  అప్పుడున్న నేర చ‌రితులు
2009                                                                    14 శాతం
2014                                                                    21 శాతం
2019                                                                    44 శాతం
Tags:    

Similar News