దేశంలో వ్యాక్సినేషన్ విమర్శల..కేంద్రానికి సీరం సంస్థ వివరణ !

Update: 2021-05-24 07:30 GMT
అదర్ పూనావాలా  గత ఏడాది కాలంగా దేశంలో మారుమోగుతున్న పేరు. కరోనా మహమ్మారికి  దేశంలో తొలి విరుగుడును కనిపెట్టి.. కోవిషీల్డు పేరుతో వ్యాక్సిన్ ను ప్రకటించిన నాటి నుంచి సీరం సంస్థ అధినేత అదర్ పూనావాలా వార్తల్లో ఉంటూ వస్తున్నారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ జోరు కొనసాగుతున్న తరుణంలో అదర్ పూనావాలా లండన్‌ కు వెళ్ళిపోయిన విషయం చర్చనీయాంశమైంది. తన బిజినెస్ ఎక్స్‌ పాన్షన్‌ లో భాగంగా అంతర్జాతీయ మార్కెట్‌ లో కోవీ షీల్డును మార్కెటింగ్ చేసుకునేందుకు వెళ్ళినట్లు ఓ వైపు ప్రచారం జరుగుతుంటే అదర్ పూనావాలా మాత్రం ది టైమ్స్‌ కిచ్చిన ఇంటర్వ్యూలో తనకు తీవ్రంగా ఒత్తిళ్లు వస్తున్నాయని, దేశంలోని కొందరు అత్యంత బలవంతులైన ప్రముఖులు కోవిషీల్డ్‌ సరఫరా కోసం డిమాండ్‌ చేస్తూ దురుసుగా మాట్లాడుతున్నారని పూనావాలా ఇంటర్య్వూలో వెల్లడించారు. అందుకే భార్యా పిల్లలతో కలిసి ఉండటానికి లండన్‌ కు వచ్చేశానని, దీనికి ఒత్తిళ్లే ముఖ్యకారణమని ఆయన చెప్పారు.

కానీ భారత్‌ లో వ్యాక్సిన్ ధర విషయంలో ఎదుర్కొన్న విమర్శలు కూడా అదర్ పూనావాలా లండన్ పయనమవడానికి కారణమని తెలుస్తోంది. ప్రభుత్వానికి 300 రూపాయలకు వ్యాక్సిన్ సరఫరా చేస్తున్న సీరం సంస్థ.. ప్రైవేటు రంగానికి మాత్రం 600 రూపాయల ధరను నిర్ణయించింది. ఈ విషయంలో దేశంలో పలు రాజకీయ పార్టీలు సీరం సంస్థను టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగాయి.  ప్రతీ రోజు 6 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ ను సీరం సంస్థ కోవిషీల్డును తయారు చేస్తుంటే.. భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కోవాక్సిన్  కేవలం కోటి మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ఈ స్థాయిలో కోవిషీల్డు ఉత్పత్తి అవుతున్న పరిస్థితిలో తమకంటే తమకు సరఫరా చేయాలని పలువురు ఒత్తిళ్ళకు పాల్పడడం వల్లనే తాను యుకే వెళ్ళినట్లు పూనావాలా చెబుతున్నారు. అంతే కాదు, ఇప్పుడప్పుడే మన దేశానికి రావాలని అనుకోవడం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. మొత్తంగా అయన ఓ పక్కా ప్లాన్ ప్రకారమే లండన్ వెళ్ళిపోయినట్టు కొందరు చెప్తున్నారు.

ఈ నేపథ్యంలోనే సీరం కి మరో కష్టం వచ్చి పడింది. దీనితో దిద్దుబాటు చర్యలకి దిగింది. దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరత తీవ్రంగా ఉన్న సమయంలో శుక్రవారం ఓ ఆన్ లైన్ హెల్త్ సమ్మిట్ లో సీరం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సురేశ్‌ జాదవ్‌ మాట్లాడుతూ..వ్యాక్సిన్ల స్టాక్‌ ను గానీ, డబ్ల్యూహెచ్‌ ఓ మార్గదర్శకాలను గానీ ప్రభుత్వం పట్టించుకోకుండా వివిధ వయసుల వారికి వ్యాక్సినేషన్‌ ప్రారంభించిందని , దేశంలో  తగినన్ని వ్యాక్సిన్ డోసులు అందుబాటులో లేవని తెలిసి కూడా ప్రభుత్వం..45 ఏళ్లు దాటినోళ్లకు,18ఏళ్లు దాటినోళ్లకు వ్యాక్సినేషన్ ప్రారంభించిందని అని అన్నారు. అయితే, సురేశ్ జాదవ్ వ్యాఖ్యలపై భిన్న స్పందనలు రావడంతో సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తాజాగా కేంద్రానికి వివరణ ఇచ్చుకుంది. సురేశ్ జాదవ్ వ్యాఖ్యలతో సీరమ్ కు సంబంధం లేదని సీరం సంస్థ డైరెక్టర్ ప్రకాశ్ కుమార్ సింగ్ కేంద్రానికి తెలిపారు. అవి సురేశ్‌ జాదవ్‌ వ్యక్తిగత అభిప్రాయాలేనని.. వాటితో కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. ఈ మేరకు సీరం డైరెక్టర్‌ ప్రకాశ్‌ కుమార్‌ సింగ్‌, కేంద్ర ఆరోగ్యశాఖకు లేఖ రాశారు. కంపెనీ సీఈఓ అదర్‌ పూనావాలా తరఫున లేఖ రాస్తున్నట్లు అందులో తెలిపారు. కరోనాపై ప్రభుత్వం చేస్తున్న పోరులో భాగంగా కొవిషీల్డ్‌ ఉత్పత్తిని భారీగా పెంచేందుకు తాము కట్టుబడి ఉన్నామని లేఖలో వివరించారు. పూనావాలా మాత్రమే కంపెనీ అధికార ప్రతినిధి అని, ఆయన వ్యాఖ్యలనే పరిగణనలోకి తీసుకోవాలని తేఖలో కోరారు. మొత్తంగా సీరం మళ్లీ కేంద్రాన్ని ప్రసన్నం చేసుకొనే పనిలో పడింది అంటూ నెటిజన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.
Tags:    

Similar News