ఏపీ పోలీసుల తీరుపై విమ‌ర్శ‌లు.. రీజ‌నేంటి?

Update: 2022-08-28 00:30 GMT
'కనిపించని నాలుగో సింహం' ఒకవైపే చూస్తోందా? 'చట్టం ముందు అందరూ సమానమే' అంటూనే అధికార వైసీపీ శ్రేణులకు మాత్రమే అండగా నిలుస్తోందా? తెలుగుదేశం అనే మాట వింటే చాలు... విచక్షణ మరిచి లాఠీలు విసిరి, కేసులు పెట్టి, దూకుడుగా వెళ్లడమే లక్ష్యంగా పెట్టుకుందా? రాష్ట్రంలో జరుగుతున్న వరుస సంఘటనలను చూస్తే ఈ ప్రశ్నలన్నింటికీ 'ఔను' అనే సమాధానమే లభిస్తోందని అంటున్నారు మేధావులు.

పోలీసు వ్యవస్థ మరీ ఇంత ఏకపక్షంగా వ్యవహరించడం ఇప్పుడే చూస్తున్నామని రిటైర్డ్‌ ఐపీఎస్ అధికారులు చెబుతున్నారు. మొత్తానికి వైసీపీ ఆడుతున్న రాజకీయ చదరంగంలో పోలీసులు పావులుగా మారారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.  కుప్పం నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే గేమ్ మొదలు పెట్టిందనే టాక్ బలంగా నడుస్తోంది.  కుప్పంలో ప్రశాంత వాతావరణాన్ని మార్చేసి ఆ ప్రాంతాన్ని వైసీపీ కార్యకర్తలు రణరంగంగా మార్చారు.

పోలీసులు సైతం వీరికి అండగా నిలిచారని టీడీపీ విమర్శిస్తోంది. తాజాగా టీడీపీ కార్యకర్తల అరెస్ట్‌కు వైసీపీ పెద్దలు పోలీసులను ఉసిగొల్పుతున్నారని బాహాటంగానే విమర్శలు వినవస్తున్నాయి. కుప్పం నియోజకవర్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తల అరెస్ట్‌లు మొదలయ్యాయి.

రాత్రి ఎమ్మెల్సీ గౌని వారి శ్రీనివాసులు మరో ఇద్దరు నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక రామకుప్పం మండలం మాజీ జడ్పీటీసీ సభ్యుడు మునుస్వామిని అరెస్ట్ చేశారు. టీడీపీ నేతల అక్రమ అరెస్ట్‌లను పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు.

అక్రమ అరెస్టులకు నిరసనగా టీడీపీ శ్రేణులు ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా భావ‌ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ అనేది రాజ్యాంగం ప్ర‌సాదించిన కీల‌కమైన వ‌రం. అయితే.. ఈవిష‌యంలోనూ పోలీసులు ఉక్కుపాదం మోపడం.. తీసుకువెళ్లి.. వాయించేయడం..

వంటివి తీవ్ర వివాదానికి దారి తీస్తున్నాయి. ఇప్పుడు టీడీపీ నేత‌లు చెబుతున్న‌ట్టు .. రేపు టీడీపీ ప్ర‌భుత్వ‌మే వ‌స్తే.. అప్పుడు ఈ పోలీసుల‌ ప‌రిస్థితి ఏంటి? అనేది చ‌ర్చకు వ‌స్తోంది. రిటైర్డ్ ఐపీఎస్‌లు సైతం.. త‌ప్పుప‌ట్టేలా.. వీరి వ్య‌వ‌హారం ఉంద‌ని ఆక్షేపిస్తున్నారు.
Tags:    

Similar News