ఈ 5 అసెంబ్లీ సీట్లపై కోట్ల బెట్టింగ్ లు

Update: 2019-03-26 06:38 GMT
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు వేడి పుట్టిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత ఉత్కంఠ రేపుతున్నాయి. ఈసారి అధికార టీడీపీని జనం మరోసారి అందలమెక్కిస్తారా.? లేక 10 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉండి పోరాడుతున్న వైసీపీ అధినేత జగన్ ను ఆదరిస్తారా? మధ్యలో వచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రభావం ఎంత.? ఇలా ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నారు.

జనంలో ఉన్న ఆసక్తికి కొందరు అప్పనంగా ‘క్యాష్’ చేసుకుంటున్నారు. గతంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఏపీలో జరుగా బెట్టింగ్ లు కాశారు. ముఖ్యంగా తూర్పు - పశ్చిమ గోదావరి.. రాజధాని అమరావతి చుట్టుపక్కల జిల్లాల్లో తెలంగాణలోని టఫ్ ఫైట్ స్థానాల్లో బెట్టింగ్ లు కాశారు.. మెజార్టీపై కూడా పందాలు కాశారు. అప్పుడు కోట్లు పోగొట్టుకున్న వారు కొందరైతే.. ఫలితాలు ఆశించినట్టు రావడంతో కోట్లకు పడగలెత్తిన వారు మరికొందరు..

ఇప్పుడు కూడా బెట్టింగ్ టైం వచ్చేసింది. ఏపీలో బెట్టింగ్ రాయుళ్లు పందాలు మొదలుపెట్టారు. ముఖ్యంగా హోరాహోరీతోపాటు ప్రముఖులు పోటీచేసే స్థానాల్లో ఎవరు గెలుస్తారు? వారి మెజార్టీపై బెట్టింగ్ లు కాస్తున్నారు. లక్షలకు లక్షలు పోసి తమకు అనుకూలురపై పందాలు పాడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బరిలో ఈసారి పవన్ పోటీచేస్తున్న భీమవరం - కొడాలి నాని (వైసీపీ) - దేవినేని అవినాష్ (టీడీపీ) లు పోటీపడుతున్న గుడివాడ - నారా లోకేష్ బరిలోకి దిగిన మంగళగిరి - ఇక గంటా వదిలేసిన అవంతి శ్రీనివాస్ (వైసీపీ) బరిలోకి దిగిన భీమిలి - గంటా శ్రీనివాస్ (టీడీపీ) బరిలోకి దిగిన విశాఖపట్నం ఉత్తరం - నటరత్నం బాలక్రిష్ణ మరోసారి పోటీపడుతున్న హిందూపురంపై బెట్టింగ్ రాయుళ్లు లక్షలు పందాలు కాస్తున్నారు.

హేమాహేమీలైన వీరు గెలుస్తారా? లేదా అన్న ఉత్కంఠ రాష్ట్రవ్యాప్తంగా ఉంది. కొందరిపై వ్యతిరేకత.. కొన్ని చోట్ల నువ్వానేనా అన్నట్టు పోటీ నెలకొనడంతో ఈ సీట్లు హాట్ సీట్లుగా మారాయి. ఇక్కడ గెలుపు ఎవరిది అన్నది చెప్పడం కష్టంగా మారింది. అందుకే ఈ నియోజకవర్గాల్లో గెలుపు - మెజారిటీలపై బెట్టింగ్ రాయుళ్లు కోట్లు కుమ్మరిస్తున్నారు..

*భీమవరం మెజారిటీపైనే బెట్టింగ్

పవన్ కళ్యాణ్ పోటీచేస్తున్న భీమవరం సీటులో ప్రధానంగా ఆయనకు ఎంత మెజారిటీ వస్తుందనే దానిపై బెట్టింగ్ కాస్తున్నారు. కాపు ఓట్లు ఎక్కువగా ఉండడం.. పవన్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉండడంతో ఇక్కడ గెలుపు పక్కా. అందుకే పవన్ మెజార్టీపైనే పందాలు కాస్తున్నారు..

*గుడివాడ బస్తీమే సవాల్.. కోట్ల పందాలు

వైసీపీలో గండరగండరుడిగా పేరొందిన కొడాలి నాని ఓ వైపు.. దశాబ్ధాల ఫ్యాక్షన్ చరిత్ర ఉన్న దేవినేని ఫ్యామిలీ నుంచి అవినాష్ ఓ వైపు పోటీపడుతుండడంతో ఈ ఇద్దరు గెలుపు ఎవరిదనే దానిపై బెట్టింగ్ రాయుళ్లు ప్రధానంగా పందాలు కాస్తున్నారు. ఈ నియోజకవర్గంపై కోట్లు కుమ్మరిస్తున్నారు.

*మంగళగిరిలో నారాలోకేష్ బోణీపైనే బెట్టింగ్

ఇన్నాళ్లు తండ్రి ప్రోద్బలంతో ఎమ్మెల్సీగా గెలిచి మంత్రి అయిన నారాలోకేష్ కు ఈ అసెంబ్లీ ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయి. తొలిసారి ఎమ్మెల్యే బరిలో ప్రత్యక్ష ఎన్నికల్లో దిగాడు. చెమటోడుస్తున్నాడు. ప్రత్యర్థి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ బలంగా ఉన్నారు. దీంతో ఇక్కడ లోకేష్ బోణీ కొడుతాడా? లేదా అన్నదానిపై బెట్టింగ్ రాయుళ్లు కోట్లు పందాలు కాస్తున్నారు. లోకేష్ గెలుపుపైనే అందరి దృష్టి నెలకొంది.

*భీమిలి ప్రత్యేకం.. వైసీపీ నెగ్గుతుందా.? బెట్టింగ్..

మంత్రి గంటా శ్రీనివాసరావు ఓటమి భయంతో వదిలేసిన భీమిలి సీటులో ఆయన అనుచరుడు ప్రస్తుత వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ గెలుస్తాడా.? టీడీపీ అభ్యర్థి సబ్బం హరి నిలుస్తాడా అన్నది ఉత్కంఠగా మారింది. కీలకమైన ఈ సీటుపై కూడా బెట్టింగ్ రాయుళ్లు పందాలు కాస్తున్నారు.

*విశాఖ ఉత్తరం గంట బయటపడుతాడా పైనే బెట్టింగ్

ప్రతిసారి పోటీచేసే స్థానాన్ని మారుస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు ఈసారి భీమిలి ని వదిలి విశాఖ ఉత్తరం బరిలోకి దిగారు. ఈ హాట్ సీటులో ఆయన గెలుపుపై బెట్టింగ్ లు కాస్తున్నారు. ఆయన మరోసారి గెలుస్తాడా? చరిత్ర తిరిగేస్తారా లేదా అన్నదానిపైనే లక్షలు కాస్తున్నారు.

*హిందూపురంలో బాలయ్య దబిడదిబిడేనా?

హిందూపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బాలయ్య తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. అక్కడ బాలయ్య - ఆయన పీఏకు వ్యతిరేకంగా జనం రోడ్ల మీదకొచ్చారు. టీడీపీకి కంచుకోట అయిన హిందూపురంలో బాలయ్య గెలుపు ప్రతిష్టాత్మకమైంది. దీంతో ఇక్కడ బాలయ్యపై లక్షలు పందాలు కాస్తున్నారు.


Tags:    

Similar News