ఆ క్రూయిజ్‌ షిప్‌లో కల్లోలం.. ఏకంగా 800 కోవిడ్‌ కేసులు!

Update: 2022-11-12 09:30 GMT
గత రెండేళ్లు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కరోనా. కరోనా విజృంభణకు అన్ని దేశాలు చిగురుటాకుల్లా విలవిలలాడాయి. కొన్ని కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడ్డారు. దాదాపు 2 కోట్ల మంది ప్రజలు బలయ్యారు. మరెన్నో కోట్ల మంది ప్రజలు కరోనా బారిన పడి దాని సైడ్‌ ఎఫెక్ట్స్‌తో ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఆ తర్వాత వ్యాక్సిన్ల రాకతో కోవిడ్‌కు అడ్డుకట్ట పడింది.

మళ్లీ ఈ మహమ్మారి కోరలు చాస్తోంది. వ్యాక్సిన్లు వచ్చినా కొత్త రూపు మార్చుకుని కొత్త కొత్త వేరియంట్లతో విరుచుకుపడుతూనే ఉంది. ఇప్పటికే చైనాలో కోవిడ్‌ కేసులు రోజూ వేల సంఖ్యలో నమోదవుతున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఒక క్రూయిజ్‌ నౌకలో 800 మంది కరోనా బారిన పడటం కల్లోలం రేపుతోంది. దీంతో ఆ నౌకను ఆస్ట్రేలియాలోని సిడ్నీ తీరంలో నిలిపివేయాల్సి వచ్చింది. ఆ నౌకలో 4,600 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉండగా ఏకంగా 800 మంది కరోనా బారినపడ్డారు.

న్యూజిలాండ్‌ నుంచి బయలుదేరిన ఈ నౌక పేరు మేజెస్టిక్‌ ప్రిన్సెస్‌ క్రూయిజ్‌ షిప్‌. 12 రోజుల తన సముద్రయానంలో భాగంగా ఈ నౌక ఆస్ట్రేలియా చేరుకుంది. తద్వారా సగం ప్రయాణాన్ని ఈ నౌక పూర్తి చేసుకుంది.

ఇంతలోనే భారీ ఎత్తున కోవిడ్‌ కేసులు నౌకలో వెలుగుచూశాయని క్రూయిజ్‌ ఆపరేటర్‌ కార్నివాల్‌ ఆస్ట్రేలియా తెలిపింది.

కాగా వైరస్‌ బారినపడిన కొందరిలో లక్షణాలు కనిపించడం లేదని వెల్లడించింది. మరికొందరిలో మాత్రం వ్యాధి తీవ్రత స్వల్ప స్థాయిలో ఉందని తెలిపింది.

ప్రస్తుతం వారిని ఐసోలేషన్‌ ఉంచామని.. వారికి తగిన సదుపాయాలు కల్పించామని మేజెస్టిక్‌ ప్రిన్సెస్‌ వెల్లడించింది. అలాగే ఈ నౌక త్వరలో మెల్‌బోర్న్‌కు చేరుకుంటుందని తెలిపింది.

మరోవైపు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో కరోనా కేసులు భారీగా వెలుగుచూస్తున్నాయి. వారం వ్యవధిలోనే 19,800 కేసులు అక్కడ బయటపడటం గమనార్హం.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News