సీఎస్ కూడా ఆంధ్రోడా అంటారా..?

Update: 2015-08-19 10:06 GMT
విడిపోయి క‌లిసి ఉందామ‌న్న‌ది తెలంగాణ ఉద్య‌మ‌కారుల నినాదం. దానికి త‌గ్గ‌ట్లే.. విభ‌జ‌న‌కు ముందు హైద‌రాబాద్ లో ఉన్న‌కొద్దిపాటి ఉద్రిక్త‌త విభ‌జ‌న త‌ర్వాత‌.. ఎవ‌రి దారిన వారు బ‌తుకుతున్న ప‌రిస్థితి. సామాన్యుల్లో ఎవ‌రు ఆంధ్రా.. ఎవ‌రు తెలంగాణ అన్న తేడా లేకుండా క‌లిసిపోతున్నారు. ఎవ‌రి బ‌తుకు వారు బ‌తుకుతున్నారు. రెండు రాష్ట్రాల మ‌ధ్య విభ‌జ‌న పంచాయితీలు రోజుకొక‌టి చొప్పున తెర మీద‌కు వ‌స్తున్నా.. సామాన్యులు మాత్రం అలాంటిదేమీ లేకుండా ఎవ‌రి మానాన వారు బతుకున్న ప‌రిస్థితి.

మ‌రి.. సామాన్యులే అంత‌లా ఉంటే.. అస‌మాన్యుల‌మంటూ అత్యున్న‌త స్థానాల్లో ఉన్న వారి ప‌రిస్థితి ఏమిటి? వారి మ‌ధ్య ఎలాంటి మాట‌లు న‌డుస్తున్నాయ‌న‌టానికి తాజాగా తెలంగాణ సీఎస్ రాజీవ్ శ‌ర్మ.. అప్పా డీజీల వివాదం చూస్తే.. ఔరా అని అనుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితి. వివాదాలు ఉంటే.. ప్ర‌భుత్వ స్థాయిలో కూర్చొని దాని సంగ‌తి తేల్చుకోవాలే త‌ప్పించి.. ప్రాంతం పేరు చెప్పి నోరు జారాల్సిన అవ‌స‌రం లేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇక‌.. వివాదంలోకి వెళితే..

దాదాపు 30 ఏళ్ల కింద‌ట‌.. ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో హైద‌రాబాద్‌ లో అప్పా సెంట‌ర్ ను ఏర్పాటు చేశారు. దీన్లో.. నాటి ఉమ్మ‌డి రాష్ట్రంలోని 23 జిల్లాల‌కు చెందిన పోలీసుల‌కు శిక్ష‌ణ ఇచ్చేవారు. ఈ అప్పా కేంద్రాన్ని విభ‌జ‌న చ‌ట్టంలో ప‌దో షెడ్యూల్ లో చేశారు. దీని ప్ర‌కారం రెండు రాష్ట్రాల వారు ప‌దేళ్లు దీన్ని వినియోగించుకునే వీలు ఉంటుంది. ఇది చ‌ట్టం ఇచ్చిన వెసులుబాటు.

విభ‌జ‌న స‌మ‌యం నాటికి అప్పా డైరెక్ట‌ర్ గా ఏపీ కేడ‌ర్  కు చెందిన అద‌న‌పు డీజీ మాల‌కొండ‌య్య డైరెక్ట‌ర్ గా ఉన్నారు. విభ‌జ‌న త‌ర్వాత అప్పాను.. తెలంగాణ పోలీస్ అకాడెమీగా మార్చి డైరెక్ట‌ర్‌ గా కుమార్ ను నియ‌మించింది. ఇక్క‌డితో ఒక పంచాయితీ మొద‌లైంది.

ఇదిలా ఉంటే.. అప్పాలో ఒక డీఐజీ స్థాయి పోస్ట్ ఉంది. విభ‌జ‌న‌కు ముందు నుంచి దీన్లో ఏపీ కేడ‌ర్  కు చెందిన వెంక‌టేశ్వ‌రావు ఈ పోస్ట్ లో ఉన్నారు. ఆయ‌న్ను రిలీవ్ చేస్తూ తెలంగాణ స‌ర్కారు జూన్ 25న ఉత్త‌ర్వులు జారీ చేసింది. వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌దులు ప‌రిమ‌ళ నూత‌న్ అనే అధికారిని ఆ స్థానంలో నియ‌మిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే.. దీనిపై వెంక‌టేశ్వ‌ర‌రావు వాద‌న ఏమిటంటే.. తాను ఏపీ క్యాడ‌ర్ అధికారిన‌ని.. అలాంట‌ప్పుడు తెలంగాణ ప్ర‌భుత్వం త‌న‌ను ఎలా రిలీవ్ చేస్తుంద‌న్న‌ది ఆయ‌న వాద‌న‌. ఈ మాట‌తోనే ఆయ‌న రిలీవ్‌  కాకుండా ఉన్నారు. ఇదిలా ఉంటే జులైలో ప‌దో షెడ్యూల్ లోని సంస్థ‌ల‌పై స‌చివాల‌యంలో ఒక స‌మావేశం జ‌రిగింది. దానికి అప్పా త‌ర‌పున వెంక‌టేశ్వ‌ర‌రావు హాజ‌ర‌య్యారు.

ఈ స‌మావేశానికి హాజ‌రైన తెలంగాణ సీఎస్ రాజీవ్ శ‌ర్మ మాట్లాడుతూ.. అక్క‌డున్న వెంక‌టేశ్వ‌ర‌రావును చూసి.. నువ్వెందుకు రిలీవ్ కాలేదు? ఆంధ్రావాడికి నీకిక్క‌డేం ప‌ని? అంటూ న‌లుగురి ముందు కోప్ప‌డ్డారు. ఈ విష‌యాన్ని ఏపీ డీజీపీ రాముడు.. గ‌వ‌ర్న‌ర్ దృష్టికి తీసుకెళ్లి తెలంగాణ సీఎస్ మీద ఫిర్యాదు చేశారు. అప్పా ప‌దో షెడ్యూల్ లో ఉన్నందున ఇరు రాష్ట్రాల పోలీసుల‌కు అక్క‌డ శిక్ష‌ణ ఇచ్చే అవ‌కాశం ఉన్నందున‌.. తాను కొన‌సాగుతాన‌ని ఏపీ సీఎస్‌ కు వెంక‌టేశ్వ‌ర‌రావు స్ప‌ష్టం చేశారు. అయితే.. ఆగ‌స్టు మూడో తేదీన అప్పా రికార్డు నుంచి వెంక‌టేశ్వ‌ర‌రావు పేరును తొలగిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే.. ఆ వివ‌రాలు ఆయ‌న‌కు తెలీలేదు. పంద్రాగ‌స్టు రోజు జెండా వంద‌నానికి వెళ్లిన ఆయ‌న్ను.. ఆగ‌స్టు మూడునే రిలీవ్ చేస్తే ఇక్క‌డేం చేస్తున్నావ‌ని అడ‌గ‌టంతో ఆయ‌న‌కు అస‌లు విష‌యం తెలిసి వ‌చ్చింది. దీంతో ఆయ‌న ఏపీ డీజీపీని క‌లిసి ఈ విష‌యం మీద ఫిర్యాదుచేశారు. అంతేకాకుండా గ‌వ‌ర్న‌ర్‌.. ఏపీ సీఎస్ కు కంప్లైంట్ చేశారు. ఈ ఇష్యూ ఇప్పుడు అప్పాలోనూ.. పోలీసువ‌ర్గాల్లోనూ చ‌ర్చ‌నీయాంశం అయ్యింది.
 
ఈ మొత్తం వ్య‌వ‌హారం చూస్తే.. రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం న‌డుచుకోక‌పోవ‌టం వ‌ల్లే ఈ స‌మ‌స్య‌ల‌న్న విష‌యం అర్థ‌మ‌వుతుంది. ప‌దో షెడ్యూల్ లోని సంస్థ‌ల్ని పేరు మార్చేయ‌టం ద్వారా.. తెలంగాణ ప్ర‌భుత్వం దూకుడు నిర్ణ‌యాలు తీసుకోవ‌టం.. రెండు రాష్ట్రాల మ‌ధ్య స‌హృద్బావ వాతావ‌ర‌ణం లేక‌పోవ‌టంతో ఇలాంటి చికాకులు వ‌స్తున్న ప‌రిస్థితి. రాజీవ్ శ‌ర్మ కోణంలో చూసిన‌ప్పుడు.. ఒక ఆంధ్రా అధికారి తాము చెప్పిన‌ట్లు ఎందుకు విన‌కూడ‌ద‌ని అనుకోవ‌చ్చు. అదే స‌మ‌యంలో వెంక‌టేశ్వ‌ర‌రావు కోణం నుంచి చూసిన‌ప్పుడు.. ప‌దో షెడ్యూల్ లోని సంస్థ‌ల‌కు విభ‌జ‌న చ‌ట్టంలోని ప్ర‌కారం ఎందుకు న‌డుచుకోకూడ‌ద‌న్నది న్యాయంగా ఉండొచ్చు. ఏది ఏమైనా.. ఇలాంటి సున్నిత విష‌యాల్లో రాజీవ్ శ‌ర్మ లాంటి సీనియ‌ర్ అధికారి ప్రాంతం పేరును ప్ర‌స్తావించ‌కుండా సంయ‌మ‌నంతో వ్య‌వ‌హ‌రించ‌టం.. లేదంటే.. త‌న వ‌ద్ద‌కు వెంక‌టేశ్వ‌ర‌రావును పిలిపించుకొని చెబితే స‌రిపోయే దానికి.. నోరు జారాల్సిన అవ‌స‌రం లేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

మ‌రోవైపు.. మిగిలిన వారి మాదిరే కామ్ గా ఉండ‌క‌.. వెంక‌టేశ్వ‌ర‌రావు ఓవ‌ర్‌యాక్ష‌న్ ఎందుకు చేయాల‌ని..అందుకే అలాంటి మాట అనిపించుకోవాల్సి వ‌చ్చింద‌ని వాదించేవారు లేక‌పోలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఈ వ్య‌వ‌హారం ఒక ప‌ట్టాన తేల‌దు. ఎందుకంటే.. ఎవ‌రూ కూడా చ‌ట్టం దృష్టిలో కంటే కూడా.. తాము గీసుకున్న చ‌ట్రం నుంచి బ‌య‌ట‌కు రావ‌టానికి ఇష్ట‌ప‌డ‌ని నేప‌థ్యంలో ఇలాంటి పంచాయితీలు త‌ప్ప‌వు. రానున్న రోజుల్లో మ‌రెన్ని చోటు చేసుకుంటాయో..?
Tags:    

Similar News