ఒడిశాలో ఘర్షణలు.. కర్ఫ్యూ

Update: 2017-04-08 10:22 GMT
శ్రీరామనవవి తరువాత ఒడిశాలో మొదలైన చిన్నపాటి ఘర్షణలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. శ్రీరాముడిని కించపరుస్తూ ఫేస్ బుక్ లో ఎవరో పెట్టిన పోస్టింగ్ అక్కడి  భద్రక్ పట్టణంలో  ఘర్షణలు, ఆందోళనకు దారీ తీసింది. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు.  తొలుత ఘర్షణలు చెలరేగగానే 144వ సెక్షన్ విధించిన పోలీసులు పరిస్థితి అదుపు లోనికి రాకపోవడం తో కర్ఫ్యూ విధించారు. ఆ ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం 15 ప్లాటూన్ల పోలీసులను నియమించారు.
    
శ్రీరాముడి సహా పలువురు హిందూ దేవతల చిత్రాలపై అశ్లీల రాతలు రాసి సోషల్ మీడియాలో పెట్టిన నేపథ్యంలో ఈ ఘర్షణలు మొదలయ్యాయి. గురువారం నుంచి మొదలైన గొడవలు శనివారం నాటికి కర్ఫ్యూ పెట్టాల్సిన పరిస్థితులు కల్పించాయి.  భద్రక్ లోని టౌన్‌ బజార్‌ ప్రాంతంలో ఒక వర్గానికి చెందిన యువకులు కొన్ని దుకాణాలకు నిప్పంటించారు. దుస్తుల షాపుతోపాటు పలు దుకాణాలు దగ్ధమయ్యాయి. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో  డీజీపీ సహా ఉన్నతాధికారులు భద్రక్ చేరుకున్నారు.  విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.  మార్కెట్లు, బ్యాంకులు, కార్యాలయాలు మూసివేశారు. కాగా ఈ ఘర్షణల ప్రభావంతో సమీప పట్టణం కటక్ లోనూ అల్లర్లు మొదలయ్యాయి.  ఒడిశా సురక్షా సేన కార్యకర్తలు కటక్‌ లో ఆందోళన చేపట్టారు. భజరంగదళ్, వీహెచ్ పీలు ఆందోళనలు చేశాయి. ఇలాంటి పోస్టింగులు చేసిన ఓ వర్గానికి చెందిన ముగ్గురిని అరెస్టు చేయాలంటూ వారు డిమాండు చేస్తున్నారు.
    
కాగా దేశంలో ఇతర ప్రాంతాల్లో మత ఘర్షణలకు ఒడిశాలో ఘర్షణలకు తేడా ఉంటుంది. ఇక్కడ గతంలో కంధమాల్ లో జరిగిన అల్లర్లు అత్యంత తీవ్రమైనవి. స్వామి లక్ష్మణానంద సరస్వతి హత్య నేపథ్యంలో అప్పట్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఆ ఘటన తరువాతే బీజేడీ - బీజేపీ పొత్తు తెగిపోయింది.
    
ఒడిశాలో మత ఘర్షణల పరంగా అత్యంత సెన్సిటివ్ ప్రాంతం భద్రక్. మొత్తం రాష్ర్ర్టంలో 2.1 శాతం ముస్లింలు ఉంటే భద్రక్ లో మాత్రం అత్యధికంగా 35 శాతం ఉంటారు. వారు ఒడియా సంస్కృతిలో మమేకమైనప్పటికీ అప్పుడప్పుడు బయట శక్తుల ప్రభావంతో ఘర్షణలు తలెత్తుతున్నాయి. తాజా ఘర్షణల నేపథ్యంలో సమర్థంగా పనిచేయలేదన్న కారణంతో భద్రక్ కలెక్టరును మార్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News