చెత్తకుప్పలో కరెన్సీ కలకలం

Update: 2016-02-23 09:31 GMT
డంపింగ్ యార్డులో ఏముంటుంది... నానా చెత్త ఉంటుంది... కానీ, అక్కడ బ్యాగు నిండుగా నోట్ల కట్టలు కనిపిస్తే.. ఎవరికైనా ఆశ పుడుతుంది. ఎవరికి వారు దాన్ని తామే సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అక్కడే తేడా కొట్టి విషయం బయటకొస్తుంది. హైదరాబాద్ లోని జవహర్ నగర్ లోనూ ఇలాగే జరిగింది. అక్కడున్న డంపింగ్ యార్డులో ఒక పెద్ద సంచిలో కట్టలుకట్టలుగా నోట్లు కనిపించాయి. ఆ సంగతి అక్కడి సిబ్బందికి, సెక్యూరిటీ గార్డులకు తెలిసింది. ఇంకేముంది ఆ సంచి నాకు కావాలంటే నాకు కావాలంటూ కొట్టాడుకున్నారు. అది చినికిచినికి గాలివానగా మారి చివరికి వారే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇదీ ఈ రోజు హైదరాబాద్ లో మద్యాహ్నం మొదలైన వదంతి. అసలు నిజంగానే డబ్బు సంచి కనిపించిందా లేదా అన్నదీ ఇంకా తేలలేదు.
   
జవహర్ నగర్ డంపింగ్ యార్డులో ఈరోజు పెద్దసంఖ్యలో నోట్ల కట్టలతో ఓ సంచి కనిపించిందని... దాన్ని చేజిక్కించుకునేందుకు సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు పోటీ పడ్డారని... చివరకూ ఎటూ తేలకపోవడంతో సిబ్బంది పోలీసుకు విషయం చేరవేశారని ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది.  రూ.2 కోట్ల నగదు అందులో ఉందని... అయితే అవి అసలు నోట్లా ? నకిలీ నోట్లా అని పోలీసులు పరిశోధిస్తున్నారని కూడా ప్రచారం జరిగింది.  డంపింగ్ యార్డు సిబ్బంది మాత్రం అసలు నోట్ల సంచి లాంటిదేమీ దొరకలేదని చెప్పుకొస్తున్నారు. తాము సెక్యూరిటీ గార్డులు అందరినీ విచారించామని...ఎవరూ డబ్బుకు సంబంధించిన సమాచారం ఇవ్వలేదని వారు చెబుతున్నారు.
   
మరి ప్రచారం నిజమా... లేకుంటే సిబ్బంది నిజమా అన్నది తేలాల్సి ఉంది. తొలుత ఎవరికివారు చేజిక్కించుకోవాలన్న ప్రయత్నంలో గొడవ పడినా ఆ తరువాత వ్యవహారం సెటిల్ చేసుకుని కల్లబొల్లి కబుర్తు చెబుతున్నారన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.
Tags:    

Similar News