మోదీజీ... మ‌ళ్లీ నోట్ల క‌ట‌క‌ట వ‌చ్చిందండీ!

Update: 2018-02-24 06:46 GMT
ప్ర‌ధానిగా న‌రేంద్ర మోదీ ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి దేశంలో నానా ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. తొలి రెండేళ్లు జ‌నార్ష‌క పాల‌న సాగించిన మోదీ... ఆ త‌ర్వాత త‌న అమ్ముల‌పొదిలో అప్ప‌టికే సిద్ధం చేసుకున్న అస్త్రాల‌ను తీసేశారు. 2016 న‌వంబ‌ర్ 8న రాత్రి 8 గంట‌ల స‌మ‌యంలో టీవీ తెర‌ల‌పై ప్ర‌త్య‌క్ష‌మైన మోదీ... దేశ ప్ర‌జ‌ల‌కు షాకింగ్ వార్త చెప్పారు. చెలామ‌ణిలో ఉన్న వెయ్యి, 500 రూపాయ‌ల నోట్ల‌ను రాత్రికి రాత్రి ర‌ద్దు చేస్తున్నామ‌ని - ప్ర‌జ‌లంతా త‌మ వ‌ద్ద ఉన్న ఈ నోట్ల‌ను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవ‌చ్చ‌ని ప్ర‌క‌టించేశారు. ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన త‌ర్వ‌త కేవ‌లం 4 గంట‌ల‌కు అంటే అదే రోజు రాత్రి 12 గంట‌ల‌కు 1000 - 500 నోట్లు ర‌ద్దైపోయాయి. ఆ మ‌రునాడు ఉద‌యం జ‌న‌మంతా బ్యాంకుల ముందు క్యూ క‌ట్టారు. బ్యాంకుల్లోని త‌మ న‌గ‌దు కోసం మ‌రికొంద‌రు ఏటీఎంల ముందు ప‌డిగాపులు కాశారు. ఇలా నెల‌ల త‌ర‌బ‌డి జ‌నం బ్యాంకులు - ఏటీఎంల ముందు క్యూలు క‌ట్ట‌క త‌ప్ప‌లేదు. అయితే 2000 నోటు - ఆ త‌ర్వాత కొత్త‌గా వ‌చ్చిన 500 నోటుతో కాస్తంత ఇబ్బంది త‌గ్గినా... న‌గ‌దు చెలామ‌ణిపై ఆంక్ష‌లు విధిస్తూ మోదీ తీసుకున్న మ‌రో నిర్ణ‌యం జ‌నంపై బాగానే ప్ర‌భావం చూపింది.

బ్యాంకుల్లో దాచుకున్న త‌మ సొమ్మును త‌మ‌కు ఇచ్చేందుకు బ్యాంక‌ర్లు ఎందుకు స‌తాయిస్తున్నారంటూ జ‌నం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తే... మాదేం లేదు... అంతా మోదీ ప్ర‌భుత్వ నిర్ణ‌య‌మేన‌ని బ్యాంక‌ర్లు వాపోయారు. వెర‌సి న‌గ‌దుకు సంబంధించి గంద‌ర‌గోళ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. కొన్ని నెల‌ల త‌ర్వాత ఆ ఇబ్బందులు త‌ప్పిపోగా... ప‌రిస్థితి చ‌క్క‌బ‌డిందిలే అనుకుంటున్న త‌రుణంలో జీఎస్టీ ప‌న్నును అమ‌ల్లోకి తెచ్చేసిన మోదీ... జ‌నాన్ని మ‌రోమారు అన్యాయానికి గురి చేశారు. ఈ క్ర‌మంలో మోదీ ఇక జ‌నాల‌ను ఊరికే ఉండ‌నివ్వ‌ర‌న్న వాద‌న కూడా వినిపించింది. అయితే జీఎస్టీ ప్ర‌భావం కూడా త‌గ్గిపోగా... ప‌రిస్థితి ఇక స‌ర్వ సాధార‌ణంగా మారిపోవడం ఖాయ‌మేన‌న్న వాద‌న వినిపిస్తున్న క్ర‌మంలో మళ్లీ ఇప్పుడు న‌గ‌దుకు ఎక్క‌డ లేని కొర‌త వ‌చ్చింది. పెద్ద నోట్ల ర‌ద్దు నాడు బ్యాంకులు - ఏటీఎంల ముందు ఎలాంటి ప‌రిస్థితులు నెల‌కొన్నాయో - ఇప్పుడు స‌రిగ్గా అదే త‌ర‌హా ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. నాడు బ్యాంకులు - ఏటీఎంల ముందు ఏర్ప‌డ్డంత మేర క్యూలు ప్ర‌స్తుతం క‌నిపించ‌కున్నా... మ‌రో వారం ప‌ది రోజులు న‌గ‌దు కొర‌త ఇలాగే కొన‌సాగితే... నాటి ప‌రిస్థితులే పున‌రావృతం కావ‌డం త‌థ్య‌మ‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

అస‌లే ఇప్పుడు పెళ్లిళ్ల కాలం వ‌చ్చేసింది. మూడు నెల‌ల పాటు కొన‌సాగిన మూడం  వెళ్లిపోవ‌డం - శుభ ముహూర్తాలు రావ‌డంతో మూడు నెల‌ల పాటు వాయిదా ప‌డ్డ పెళ్లిళ్ల‌న్నీ ఇప్పుడు పెళ్లి పీట‌లెక్కేస్తున్నాయి. ఈ క్ర‌మంలో న‌గ‌దు చేతిలో లేక‌పోతే చాలా ఇబ్బందే. అయితే ప‌రిస్థితిని కాస్తంత ముందుగానే అంచ‌నా వేసిన చాలా మంది న‌గ‌దును బ్యాంకుల్లో జ‌మ చేయ‌కుండా ఇంటిలోనే ఉంచేసుకున్నారు. గ‌త అనుభ‌వాల‌ను అంత‌గా గుర్తు పెట్టుకోని వారు మాత్రం ఇప్పుడు న‌గ‌దు చేతిలో లేక - బ్యాంకుల్లో ఉన్న త‌మ న‌గ‌దు చేతికంద‌క మ‌రికొంత మంది నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. మొత్తంగా నాడు నెల‌ల త‌ర‌బ‌డి స‌తాయించిన న‌గ‌దు కొర‌త ఇబ్బందులు ఇప్పుడు మ‌రోమారు రంగంలోకి దిగేశాయ‌న్న మాట‌. అయినా ఇప్పుడు నోట్ల ర‌ద్దు లాంటి నిర్ణ‌యాలు లేకున్నా... న‌గ‌దుకు కొర‌త ఎందుకు వ‌చ్చింద‌న్న విష‌యంపై స్ప‌ష్ట‌త రావ‌డం లేదు. మ‌న ఖాతాల్లోని మ‌న సొమ్మును కొంతే ఇస్తున్న బ్యాంక‌ర్లు కూడా ఈ ప‌రిస్థితికి కార‌ణాలేమిటో చెప్ప‌డం లేదు. మ‌రి మోదీ స‌ర్కారు ఇంకే నిర్ణ‌యం తీసుకునేందుకు ఈ త‌ర‌హా న‌గ‌దు కొర‌త‌ను సృష్టించిందో ఆ దేవుడికే తెలియాలి.

Tags:    

Similar News