ట్రెండింగ్ పిక్: నల్లడబ్బేది మోడీజీ?

Update: 2018-11-30 09:26 GMT
ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు తమ ఎన్నికల ప్రచార సభల్లో ఒక విషయాన్ని మరిచిపోతున్నారు. గడిచిన 2014 ఎన్నికల్లో మోడీ, అమిషాలు స్విస్ బ్యాంకుల్లో దాగిన నల్లడబ్బును వెలికి తీస్తామని.. పేదల ఖాతాల్లో వేస్తామని భీషణ వాగ్ధానాలు చేశారు. గద్దెనెక్కాక ఆ విషయం మరిచిపోయారు. బ్లాక్ మనీ తేవడం కోసం చేసిన ‘నోట్ల రద్దు ’ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దాదాపు 99శాతం డబ్బు తిరిగివచ్చింది. దీంతో నల్లధనంపై భారీ ఆశలు పెట్టుకున్న మోడీ - షాలు ఖంగుతిన్నారు..

తాజాగా తెలంగాణ సహా 5 రాష్ట్రాల ఎన్నికల్లో మళ్లీ ప్రచారానికి అమిత్ షా - మోడీలు వస్తున్నారు. కానీ ఒక్క ప్రచార సభల్లోనూ నల్లడబ్బును తిరిగితెస్తామని.. పేదలకు పంచుతామన్న హామీనే ప్రస్తావించడం లేదు.. కనీసం వాటి గురించి చెబుతున్న పాపాన పోవడం లేదు.  దీంతో కొందరు సోషల్ మీడియా యాక్టివిస్టులు తాజాగా మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త నోట్లను బట్టలు ఆరేసినట్టు దండానికి ఆరేసి ఇవి వేస్ట్ అన్నట్టున్న ఫొటోను విడుదల చేశారు. ఈ ఫొటో ఇప్పుడు వైరల్ గా మారాయి. బీజేపీ ప్రభుత్వంపై సంధించిన ఈ ఫొటో పిక్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.

ఈ ఫొటోను షేర్ చేస్తూ రాజకీయ కార్యకర్తలు, సామాన్య ప్రజానీకం బీజేపీ, మోడీ ప్రభుత్వాన్ని వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు.. ‘కొత్త నోట్లను ప్రవేశపెట్టి మోడీ, గులాబీ డబ్బు, పసుపు డబ్బు, ఆరెంజ్ డబ్బు, బ్లూ డబ్బు, గ్రీన్ డబ్బును అందుబాటులోకి తెచ్చాడని.. కానీ నల్ల డబ్బు ఏమైంది’ అంటూ చాలామంది సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. ఓ నెటిజన్ అయితే ‘కొత్త కరెన్సీ నోట్లు చాలా మెరుస్తున్నవి.. ఈ రంగులు చాలా బాగున్నవి.. కానీ ఒక కలర్ మాత్రం మిస్ అయ్యింది. అది నలుపు రంగు.. ఆ నల్లడబ్బును వెనక్కి తీసుకొస్తానని హామీ ఇచ్చి మరిచిపోయావా మోడీ’ అంటూ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.

2014 ఎన్నికల ప్రచారం సందర్భంగా నరేంద్రమోడీ.. విదేశీ బ్యాంకులలోని నల్లధనంను తిరిగి తీసుకొచ్చి.. ప్రతి భారతీయుడి ఖాతాలో 15లక్షల రూపాయలను డిపాజిట్ చేస్తానని ఓటర్లకు హామీ ఇచ్చారు. కానీ గద్దెనెక్కాక మాత్రం మోడీ ప్రభుత్వం ఆ దిశగా హామీని అమలు చేయడంలో విఫలమైంది. నల్లడబ్బు కోసం చేసిన నోట్లరద్దు, జీఎస్టీ ఘోరంగా విఫలమై దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. అటు నల్లడబ్బు తిరిగిరాక.. ఇటు దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడంతో ఇక నల్లడబ్బు గురించే మోడీ ప్రస్తావించడం లేదు. అందుకే ఇప్పుడు మళ్లీ ప్రచారానికి వస్తున్న మోడీకి గుర్తు చేసేలా నెటిజన్లు ఈ దండానికి డబ్బులను వేలాడదీసి దిమ్మదిరిగేలా కామెంట్లు పెడుతున్నారు.
Tags:    

Similar News