80 శాతం మంది హెల్మట్లు వాడటం లేదంట

Update: 2015-10-02 04:17 GMT
వినటానికి విచిత్రంగా అనిపించినా ఇది నిజం. రోడ్డు మీద అడ్డంగా పడి మరీ ఆపేసి.. హెల్మెట్ లేనందుకు జరిమానాలు విధించే పోలీసుల్లో దాదాపు 80 శాతం మంది అస్సలు హెల్మెట్ లే వాడటం లేదట. ఇదేదో కాకి లెక్క కాదు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చేసిన కసరత్తులో తేలిన నిజం. సెప్టెంబరు నెలలో జరిగిన ప్రమాదాల్లో సైబరాబాద్ పరిధిలోనే ముగ్గురు కానిస్టేబుళ్లు రోడ్డు ప్రమాదంలో మరణించటం.. వారికి హెల్మెట్లు లేకపోవటంతో ఈ అంశంపై దృష్టి పెట్టిన పోలీస్ బాస్ కి కొత్త విషయాలు తెలిసి వచ్చాయి.

హెల్మెట్ వాడకాన్ని తప్పనిసరి చేయటంతో పాటు.. కొన్ని కొన్ని కార్యాలయాల్లోకి హెల్మెట్ ధరించకుండా వాహనం మీద వెళితే అనుమతి నిరాకరిస్తున్న సంగతి తెలిసిందే. హెల్మెట్ వాడకంపై అవగాహన పెంచటంతో పాటు.. రోడ్డు ప్రమాదాల నుంచి ప్రాణాపాయాన్ని తప్పించే హెల్మెట్ వినియోగంపై అవగాహన పెంచాల్సిన పోలీసులే.. హెల్మెట్ వినియోగించకపోవటం ఏమిటని సీవీ ఆనంద్ ప్రశ్నిస్తున్నారు.

పోలీసులంతా హెల్మెట్లు వినియోగించేలా చర్యలు తీసుకోవటంతో పాటు.. మొత్తం అధికారులు ఎంతమందికి హెల్మెట్లు అవసరమవుతాయన్న అంశంపై లెక్కలు వేస్తున్నారు.  మిలటరీలో అయితే రైడర్.. పిలియన్ రైడర్ హెల్మెట్లు ధరించాల్సిందేనని.. అవి లేకపోతే విధుల్లోకే రానివ్వరని.. బయటకు సైతం పోనివ్వరని.. ఈ విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని హెల్మెట్లు వినియోగించని సిబ్బందిని ఆఫీసుల్లోకి అనుమతించని విధానాన్ని అమలు చేయనున్నట్లు సీవీ ఆనంద్ చెబుతున్నారు.

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు ఏడు వేలమంది పోలీసులు విధులు నిర్వహిస్తుంటే.. కేవలం 20 శాతం మందికి మాత్రమే హెల్మెట్లు ఉన్నాయట. ఇక.. హోంగార్డుల విషయంలో ఈ శాతం మరింత తక్కువగా ఉందని..ఈ నేపథ్యంలో పోలీసులందరికి హెల్మెట్లు అందించే కార్యక్రమంపై దృష్టి సారించినట్లు చెబుతున్నారు. హెల్మెట్ల వినియోగం తప్పనిసరి చేయటం ఒక మంచి అడుగుగా చెప్పక తప్పదు. తప్పు చేసే ప్రజల్ని పట్టుకొని జరిమానాలు విధించే పోలీసులు.. మొదట తాము  తప్పు చేయకూడదన్న విషయాన్ని గుర్తించి.. అందరికి ఆదర్శంగా నిలవాలన్న ఆలోచన చేయటం మంచి పరిణామమే.
Tags:    

Similar News