భార‌త్‌ పై సైబ‌ర్ ఎటాక్‌.. వాట్సాప్ ఆగిన రెండు గంట‌ల్లో.. కేంద్రం సీరియ‌స్‌

Update: 2022-10-27 11:38 GMT
ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ సేవల్లో ఈ నెల 25వ తేదీన అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. భారత్‌ సహా పలు దేశాల్లో దాదాపు 2 గంటల పాటు సేవలు నిలిచిపోయాయి. ఆ సమయంలో సందేశాలు పంపడం వీలు పడలేదని, వెబ్‌ వాట్సాప్‌ కూడా కనెక్ట్‌ కాలేదని యూజర్లు ఫిర్యాదు చేశారు. కొంత సమయం తర్వాత సమస్య పరిష్కారమైంది. గతంలోనూ పలుమార్లు వాట్సాప్‌ సేవల్లో అంతరాయం ఏర్పడినప్పటికీ.. ఈ స్థాయిలో సమస్య తలెత్తడం ఇదే తొలిసారి. కలిగిన అసౌకర్యానికి గానూ వాట్సాప్‌ క్షమాపణ సైతం చెప్పింది.

కానీ, అందుకు గల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇక్క‌డే తేడా కొడుతోంది. ఎందుకంటే.. కేవ‌లం ఐదు ప‌దినిమిషాల‌కే ఏదైనా జ‌రిగిపోయే ప‌రిస్థితి ఉన్న నేటి రోజుల్లో.. ఇలా గంట‌ల త‌ర‌బ‌డి.. వ్య‌వ‌స్థ నిలిచిపోవ‌డం వెనుక ఏదో జ‌రిగి ఉంటుంద‌నే అనుమానాలు బ‌లంగా వినిపిస్తున్నాయి. మొద‌ట్లో దీనిని లైట్ తీసుకున్నా.. త‌ర్వాత‌.. మాత్రం దీనిపై సీరియ‌స్‌గానే చ‌ర్చ జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో దీనిపై తాజాగా భారత ప్రభుత్వం దృష్టి సారించింది. సేవల్లో అంతరాయానికి గల కారణాలను తెలియజేయాలని వాట్సాప్‌ను వివరణ కోరింది.

సాంకేతిక సమస్య కారణంగా అంతరాయం ఏర్పడిందా? సైబర్‌ ఎటాక్‌ ఏమైనా జరిగిందా? అన్న కోణంలో వాట్సాప్‌ నుంచి ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ వివరణ కోరింది.  భారత్‌కు చెందిన కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ తో సమన్వయం చేసుకుంటూ అంతరాయానికి గల కారణాలను అన్వేషించాలని సూచించింది. వాట్సాప్‌ వివరణ కోరిన విషయాన్ని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ సైతం ధ్రువీకరించారు. వారంలోగా నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లు తెలిసింది.

ప్ర‌స్తుతం భార‌త్ పై చైనా.. అక్క‌సుతో ఉంది. ఈ నేప‌థ్యంలో ఏదైనా జ‌రిగే ప్ర‌మాదం ఉంద‌ని.. కేంద్రం భావిస్తోంది. సైబ‌ర్ ఎటాక్ క‌నుక జ‌రిగితే.. ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల న‌ష్టం రావ‌డంతోపాటు.. దేశ భ‌ద్ర‌త‌కు కూడా.. పెనుముప్పు వాటిల్లే అవ‌కాశం ఉంటుంద‌ని కేంద్రం అంచ‌నా వేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే దీనిని చాలా సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే,  భారత్‌లో దాదాపు 50 కోట్ల మందికి పైగా వాట్సాప్‌ వినియోగదారులు ఉన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News